Wednesday 8 March 2023

అధికారపార్టీపై పొంగులేటి పోరాటం ఫలించేనా?



తెలంగాణలో ఎన్నికలకు ఇంకా దాదాపు తొమ్మిది నెలల సమయం ఉన్నది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్రలు, ప్రచారాలు మొదలుపెట్టాయి. ఖమ్మం జిల్లాలో అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  ప్రధాన పార్టీలతో సమంగా మరోమాటలో చెప్పాలంటే ఇంకో అడుగు ముందుకు వేశారని చెప్పవచ్చు. కొంతకాలంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అధికారపార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆయన పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జెండా ఏదైనా కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ అజెండా అన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపించడమే తమ లక్ష్యమన్నారు. 


నిజానికి 2014లో, 2018లోనూ ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ గెలిచింది ఒక్క సీటే. మొదటిసారి ఎన్నికల్లో కొత్తగూడెం సీటు కాగా, రెండవసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానంలోనే ఆ పార్టీ గెలిచింది. 2019లో కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే. పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌లు రాజకీయ సమీకరణాల్లో భాగంగా వాళ్లంతా బీఆర్‌ఎస్‌లోకి జంప్‌  అయ్యారు.  టీడీపీ గత ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావులు కూడా బీఆర్‌ఎస్‌లో కలిసిపోయారు. ఇక వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్యా రాములు నాయక్‌ అనంతరం బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. వాళ్ల చేతిలో ఓడిపోయిన అధికారపార్టీ కి చెందిన నేతలు తమను పార్టీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదని అప్పుడప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అయినా వారికి పార్టీ నుంచి ఎలాంటి హామీలు దక్కలేదు. దీంతో చాలా కాలం మౌనంగా ఉన్నా పొంగులేటి ఎప్పుడైతే అదికారపార్టీతో ఢీ అంటే డీ అని సవాల్‌ చేశారో వారందరికీ ఒక వేదిక దొరికినట్టైంది. దీంతో పొంగులేటి అంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపడమే తమ లక్ష్యమని అదికారపార్టీ నేతలను ఉద్దేశించి చేసినవే. 


పొంగులేటి బీఆర్‌ఎస్ కు దూరంగా ఉంటూ తన అనుచరులతో కలిసి స్వతంత్రంగానే ఉమ్మడి జిల్లాలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరకపోయినా ఎన్నికల అనంతరమో లేక ఎన్నికలు సమీపించే సమయానికి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఆయన అడుగులు ఏ పార్టీ వైపు అన్నది క్లారిటీ లేదు. కానీ ఆయన కుదిరితే బీజేపీ లేదా వైఎస్‌ షర్మిల వెంట నడుస్తారనే చర్చ ఉన్నది. ఎందుకంటే బీజేపీ అధిష్టానంతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నట్టు సమాచారం. అలాగే పొంగులేటి బీఆర్‌ఎస్‌ నేతలను, కేసీఆర్‌ను సవాల్‌ చేసిన అనంతరం వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో భేటీ అయ్యారు. ఈ రెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నట్టు మాదే అధికారం అనే పరిస్థితులేమీ ప్రస్తుతం కనిపించడం లేదు. అందుకే పొంగులేటి ఏ పార్టీ వైపు వెళ్లకుండా స్వతంత్రంగానే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఖమ్మం ఎంపీ సీటు తో పాటు, పది అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచార ప్రభావం ఎంత ఉంటుంది? ఆయన అంటున్నట్టు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇంటికి వెళ్తారా? లేక ఆయన వ్యూహం బెడిసి కొట్టి విపక్ష పార్టీలకే నష్టం కలుగుతుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Labels: , , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home