Tuesday 2 October 2012

సంక్లిష్టం అంటే సాగదీతే!

‘సాగరహారం’ తెలంగాణ ప్రజల సంకల్పాన్ని చాటింది. మార్చ్ ద్వారా ప్రజల మనోభావాలు ఏమిటో చెప్పినా.. హస్తిన పెద్దలకు ఇంకా అర్థం కావడం లేదు. సహనమే సంస్కృతి అని పెద్దలు అన్నారు. దాన్ని తెలంగాణ ఉద్యమం దశాబ్ద కాలంగా ఆచరిస్తూ వస్తున్నది.  ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కాలంలో ఏవో కొన్ని చిన్న చిన్న ఘటనలు మినహా అహింసాయుతంగానే ప్రజలను తమ ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. అయితే ఒకవైపు సంయమనం పాటించాలంటున్న ఢిల్లీ పెద్దలే సహనం కోల్పోతున్నారు. ప్రజలను రెచ్చగొడుతున్నారు. సమస్య ఏనుగు లాగా కళ్లముందు కనబడుతున్నా సంక్లిష్టమైనదని, సున్నితమైనదని సమాధానాలు చెబుతున్నారు. కాలపరీక్షకు నిలబడిన తెలంగాణ ప్రజలు ఇంకా ఎంత కాలం నిరీక్షించాలో కూడా స్పష్టమైన జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రంలో అన్ని పార్టీలు (ఒక్క సీపీఎం మినహా) తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్నప్పుడు ఇంకా ఏకాభిప్రాయం మాట ఎందుకు వస్తున్నది? రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం ఇంకా ఈ సమస్యను సాగదీస్తారు? నిజంగానే తెలంగాణ ఏర్పాటు వల్ల ఏవైనా సమస్యలు తలెత్తుతాయి అనుకుంటే అవి ఏమిటో ప్రజలకు వివరించాలి. అంతేగానీ తెగేదాకా లాగుతాం అనడం ప్రజాస్వామిక లక్షణం కానే కాదు.

 తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు చెప్పిన కేంద్ర హోం మంత్రి... రాష్ట్ర విభజనపై ఒక ముందడుగు లేదనడం దేనికి సంకేతం? అంటే శాంతి అనే పదం ప్రజలకే కానీ పాలకులకు వర్తించదా? ప్రజలు సంయమనంగా ఉండాలంటున్న హస్తిన పెద్దలు సీమాంధ్ర పెట్టుబడిదారులకు అదే విషయాన్ని ఎందుకు సూచించడం లేదు? ఏఐసీసీ పెద్దలే చెబుతున్నారు శ్రీకృష్ణ కమిటీతో ఒనగూరిన ప్రయోజనం సున్నా అని. మరి ఇంకా లగడపాటి, టీజీ వెంకటేశ్, కావూరి, లాంటి వాళ్లే కాదు టీడీపీ సీమాంధ్ర నేతలు కూడా శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పిందని ఎందుకు సీమాంధ్ర ప్రజానీకాన్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఎస్సార్సీ అంటే మందుపాతర పేల్చినట్టే అంటున్న ఏఐసీసీ పెద్దల మాటలు లగడపాటికి అర్థం కావడం లేదా? నిజానికి తెలంగాణపై ఏకాభిప్రాయం లేదంటున్న వాళ్లు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. తెలంగాణపై పార్లమెంటులో బిల్లుపెడితే మద్దతు ఇస్తామని ఇప్పటికే మెజారిటీ పార్టీలు బహిరంగంగానే వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ  ఈ విషయంపై తన వైఖరి వెల్లడిస్తే పార్లమెంటులో తెలంగాణకు అనుకూలంగా ఎంత మెజారిటీ ఉన్నదో తేలిపోతుంది. కానీ రెండో ఎస్సార్సీని దేశంలో ఏ పార్టీ కూడా ఆహ్వానించడం లేదు. ఇప్పుడు తెలంగాణపై కాంగ్రెస్ పెద్దలు చెబుతున్న అభ్యంతరాలన్నీ 2001లో నాటి సీఎల్పీ లీడర్ వైఎస్ 41 మంది తెలంగాణ ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ పంపినప్పుడే చెప్పాల్సింది. టీఆర్‌ఎస్‌తో 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడే చెప్పాల్సింది. ప్రణబ్ కమిటీ వేసే ముందే సమీక్షించుకోవాల్సింది. కామన్ మినిమిమమ్ ప్రోగ్రాంలో చేర్చేముందు చర్చించాల్సింది. వైఎస్ హయాంలో రోశయ్య కమిటీ, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ, మొన్న ఆజాద్ కమిటీ ఇలా కమిటీలతో కాలయాపన చేసేకంటే ఈ విషయంపై కన్‌క్లూజన్ ఏమిటో ఆలోచిస్తే బాగుండేది. ఇరు ప్రాంతాల ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యేవి. కానీ ఇవేవీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. తమ పార్టీ ప్రయోజనాలే తప్ప ప్రజల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడే పార్టీ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నది. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే అది అసాధ్యమేమీ కాదు. కానీ అవకాశవాదమే తమ అజెండా అని పార్టీలు భావించినంత కాలం దేశంలో ఏ సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా రావణకాష్టంగా రగులుతూనే ఉంటాయి. గాంధీ వారసులైన కాంగ్రెస్ నేతలకు  నీతులు చెప్పడమే కానీ ఆచరించడం రాదు. అందుకే ఇవ్వాళ ఆ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో తన ఉనికి కోల్పోయిందో చూస్తే అర్థమవుతుంది. యూపీఏ నుంచి తృణమూల్ వైదొలిగిన తర్వాత తుమ్మితే ఊడిపోయే మన్మోహన్ సర్కార్‌ను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతూ.. ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నది. అది తెలంగాణ అంశమైనా కావొచ్చు. లేదా మరేదైనా కావొచ్చు.

అలాగే తెలంగాణ ప్రజలకు ఇది పరీక్షా సమయం. ఇవ్వాళ తెలంగాణ కోరుతున్న సంఘాలు, పార్టీల్లో విభేదాలు ఉండవచ్చు. కానీ లక్ష్య సాధన కోసం అందరూ ఏదో ఒక సందర్భంలో ఏకతాటిపైకి వస్తూనే ఉన్నారు. విభజించి పాలించే విధానాన్ని అవలంబించే వారు ఈ ఐక్యతను దెబ్బతీయాలనే కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఇవ్వాళ గుంపులో గోవింద లాగా తెలంగాణ ప్రాంత నేతలు లేఖలతో, మీటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అంతేకానీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వారికంటూ ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోలేకపోతున్నారు. కావూరి లాంటి వాళ్లు అంటే టీ కాంగ్రెస్ నేతలు ఒంటికాలిపై లేచారు. కానీ పదవులు లేకుండా వీళ్లు ఒక్క క్షణం కూడా ఉండలేరు అన్నది ఇప్పటికి చాలాసార్లు రుజువైంది. నిజమే రాజీనామాలే అన్ని సమస్యలకు పరిష్కారం కాకపోవచ్చు. రాజకీయంగా వాళ్లు నిర్వర్తించాల్సిన బాధ్యత విస్మరించారనే కదా ఇవ్వాళ ప్రజలంతా రోడ్డెక్కాల్సి వస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నది. వాళ్లు పదవులు వదులుకున్నా.. ప్రజలతో కలిసి ఉద్యమంలో పాలుపంచుకున్నా ఇప్పుడే జరగాలి. అలాకాకుండా తీరా ఎన్నికలు దగ్గరికి వచ్చాక మళ్లీ తెలం‘గానం’ వినిపిస్తామంటే అందుకు తెలంగాణ ప్రజానీకం అంగీకరించే స్థితిలో లేదు. ఇందుకు తెలంగాణ టీడీపీ కూడా మినహాయింపు ఏమీ కాదు. ఆశయ సాధన కోసం కలిసి నడవాలి అనుకుంటే జేఏసీ, టీఆర్‌ఎస్ విభేదించేవాళ్లు మరో వేదికను ఏర్పాటు చేసుకుని ఉద్యమం చేయవచ్చు. అయితే పార్టీల గొడుగు కింద ఉండే ఆ పని చేస్తామంటే ప్రయోజనం ఉండదు. ప్రజలు చూపుతున్న ఐక్యత ప్రజాప్రతినిధులు చూపెట్టగలిగితే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంపై వినిపిసుత్న్న విభిన్న వాదనలు పోయి ఏకాభిప్రాయం దానంతట అదే వస్తుంది. అందరి ఆశయం నెరవేరుతుంది.
-రాజు

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home