Wednesday 8 March 2023

ఎన్నికల తర్వాత ఇక్కడ ఏక్‌నాథ్‌ షిండే ఎవరో?


ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో దాదాపు 119 లోక్‌సభ స్థానాలు ఉండటమే దీనికి కారణం. అందుకే ఈశాన్యరాష్ట్రాలైన నాగాలాండ్‌, త్రిపుర, మేఘాలయ మొదలు దక్షిణాది రాష్ట్రాల్లో కమలం పార్టీ వికాసానికి దోహదపడిన కర్ణాటక తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాడే ఉండనున్నాయి. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి కర్ణాటక కంటే తెలంగాణకే తన ప్రధాన్యం అని రాష్ట్ర బీజేపీ కీలక నేతల భేటీలో స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే బీజేపీ అధిష్ఠానం ఇప్పటి నుంచే తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నది.


ఇక నుంచి నా దృష్టి అంతా తెలంగాణపైనే. ఆ రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా మీరంతా ముందుకు సాగాలి. పాత, కొత్త నేతలనే అనే తేడాలు వద్దు. అభిప్రాయభేదాలు ఉంటే పరిష్కరించుకోండి. చేరికలను ప్రోత్సహించండి అని ఆయన రాష్ట్ర  నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి ఇంకా ఏడు నెలల సమయం ఉన్నది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సభ, ఉమ్మడి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించారు. 


కర్ణాటకలో ఆ పార్టీ పరిణమాలు బీజేపీ అధిష్ఠానాన్ని కలవరపరుస్తున్నాయి. పైకి అక్కడ కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా తెలంగాణపై మోడీ-షాలు దృష్టి సారించారు అంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టు కనిపిస్తున్నది. అక్కడ జరిగే నష్టాన్ని తెలంగాణలో పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయని విధంగా చేరికల కమిటీ ఒక ఏర్పాటు చేసి దానికి ఈటల రాజేందర్‌ కన్వీనర్‌గా నియమించింది. ఆయన నేతృత్వంలో పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని భావించింది. కానీ వారు ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోగా అధికార పార్టీ పై అసంతృప్తితో బీజేపీ చేరిన నేతలు తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతిలతో పాటు తుల ఉమ వంటి నేతలు రాష్ట్ర నాయకత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. పాత, కొత్త తేడా ఉండొద్దని అమిత్‌ షా చెప్పినా కొత్త వారికి ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన నేతలకే తగిన ప్రాధాన్యం లేదనే చర్చ జరుగుతున్నది. ఆ పార్టీలో నేతల మధ్య అంతర్గత అభిప్రాయభేదాల ఫలితంగా చాలామంది పార్టీలో చేరకపోవడానికి ముఖ్యకారణమని పార్టీ అధిష్టానం గుర్తించింది. అందుకే దీనివల్ల పార్టీలో చేరికలు లేకపోగా పార్టీకి నష్టం చేస్తున్నదని అంచనా వేసింది. పేరుకు తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారని పత్రికల్లో వచ్చినా.. నేతల మధ్య ఉన్న అంతరాలు పార్టీ పుట్టి ముంచుతుందని దాన్ని సరిచేయాలని అమిత్‌ షా సూచనలు చేశారు. 


తెలంగాణలో బీజేపీ గెలుపు అంత తేలిక కాదని వారికీ తెలుసు. అయితే గతంలో గెలిచిన నాలుగు లోక్‌సభ స్థానాలు తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు మరో మూడు నాలుగు స్థానాలు దక్కించుకోవాలన్ని ఆ పార్టీ పెద్దల వ్యూహం. మొత్తం పదిహేడు స్థానాల్లో సగం తమ ఖాతాలో వేసుకోవాలని కమలనాథులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని రెండు మూడు అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నా 20-30 స్థానాల్లో పాగా వేయవచ్చు అని, ఒకవేళ రాష్ట్రంలో హంగ్‌ లాంటి పరిస్థితి వస్తే మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ను ముందుపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ కూడా అదే వ్యూహాన్ని అమలుచేయవచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ఆ ఏక్‌నాథ్‌ షిండే ఇక్కడ ఎవరు అవుతారు అన్నది తేలుతుంది.

Labels: , , , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home