Monday 14 May 2012

స్వరాజ్యమవలేని సురాజ్యమెందుకని?
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ  పార్లమెంటరీ సంస్థలు అరవై ఏళ్ళు మనగగలగడం గొప్ప విషయమే.అయితే ఈ సంతోష సందర్భాన్ని పురస్కరించుకుని తొలి లోక్ సభ ఎంపీలను సత్కరించారు. ఈ అరవై ఏళ్లలో దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులొచ్చాయి. వ్యక్తులకు పదవీ విరమణ ఉంటుందేమో కానీ, వ్యవస్థలకు మాత్రం ఉండదు. సభే సర్వోన్నతం అని గర్వంగా చెప్పుకుంటున్న మనం, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాల్సిన మనం, ప్రపంచానికి నాగరికత గురించి చెప్పిన మనం ఈ పార్లమెంటు వజ్రోత్సవాల సందర్భంగానైనా చాలా విషయాలు మననం చేసుకోవాలి. ఎందుకంటే ఈ అత్య్తున్నత చట్ట సభలో ప్రజా సంక్షేమం కోసం చేసినా చట్టాలన్నీయిప్పుడు ఉన్నోడి చుట్టలుగా మారిపోయాయి. మట్టి మనుషుల కళ్ళ కింది నేలను గుంజుకొని, బహుళజాతి కంపెనీల కొమ్ము కాస్తూ, ఈ అన్యాయాన్ని ఎదిరిస్తున్న ఈ దేశ భూమి పుత్రులపైనే యుద్ధం చేస్తున్నది, పార్లమెంటు అరవై ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్నది ఇప్పుడే. నాటి పార్లమెంటు సభ్యలు ప్రజా సమస్యల పై చర్చించడానికి ఈ వేదికను ఉపయోగించుకునేవారు. అధికార పక్షం పై ప్రతిపక్షం విమర్శలు చేస్తే హుందాగా వ్యవహరించే వారు. కానీ సమస్యల నుంచి తప్పించు కోలేదు. కానీ ఇప్పడు అందుకు పూర్తి విరుద్ధంగా మన పార్లమెంటు ఉన్నది. ఆరు దశాబ్దాలలో ఎన్నో సంస్కరణలకు బాటలు వేసిన పార్లమెంటు యిప్పుడు సంక్షోభంలో ఉన్నది. లక్షలాది కోట్ల కుంభకోణాలు వెలుగు చూస్తున్న ఈ కాలంలోనే. నాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యనికి వ్యతిరేకంగా ఉద్యమించిన స్వాతంత్ర్య సమరయోధులు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిపై ఉద్యమిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాల ప్రత్యేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇరోం షర్మిల పదకొండు ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఆ రాష్ట్రాల్లో సైనిక బలగాలకు ఉగ్రవాదిగా ఎవరిపై అనుమానం వచ్చినా కాల్చివేసే అధికారం ఉన్నది. నేరం రుజువు కాకుండా శిక్ష విధించారాదని మన చట్టాలు చెబుతున్నాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల   ఇలాంటి దుర్మార్గ చట్టాల వల్ల అక్కడి ప్రజల బతుకులకు రక్షణ కరువైందని ప్రజాస్వామిక వాదులు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరోం షర్మిల నిరసనను పటించుకోవడం లేదు. ప్రజల కోసం చేసిన శాసనాలన్ని దుర్వినియోగం అవుతున్నాయి. గ్రామ స్వరాజ్యం గంగలో కలిసిపోయింది. కాలం కలిసి రాక, వ్యవసాయం గిట్టుబాటు కాక అన్నదాతలు పొట్టకూటికోసం నగరాలకు వలసబాట పడుతున్నారు. బ్యాంకుల జాతీయకరణ, పార్టీ ఫిరాయింపుల చట్టం, గృహ హింస, సమాచార హక్కు చట్టం, 73వ, 74వ రాజ్యాంగ సవరణ చట్టం వంటి సాహసోపేతమైన శాసనాలను చేసిన పార్లమెంటు వీటిని పారదర్శకంగా అమలు చేయడం లేదు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించని పార్లమెంటరీ వ్యవస్థ పై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబూకుతున్నది. సభ్యుల క్రమశిక్షణ రాహిత్యం చట్టసభల గౌరవాన్ని తగ్గిస్తున్నది. అధికారంకోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టడానికి కూడా వెనకాడడం లేదు నేటి పాలకులు. తమ కుర్చీని కాపాడుకోవడానికి దోపిడీ దారులకు, విదేశీ తొత్తులతో రాజీ పడుతున్నారు. మేధావులు, ఆలోచన పరులతో నిండాల్సిన రాజ్యసభ నేడు పార్టీల ప్రయోజనాలను నెరవేర్చే వారితో నిండి పోతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.అలాగే దేశానికి స్వాతంత్ర్యం రాకముందు స్వతంత్ర దేశంగా ఉన్నది నిజాం స్టేట్. దేశంలో సంస్థానాల విలీన సమయంలో సైనిక చర్య ద్వారా భారత్ లో కలిసింది ఆ దేశం. పార్లమెంటుకు ఎంత చరిత్ర ఉన్నదో తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినా తెలంగాణ రాష్ట్ర డిమాండు కూడా అంతే చరిత్ర ఉన్నది. ప్రజాస్వామిక పద్ధతుల్లో ఈ ప్రాంత ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఐదున్నర దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన పాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్ర డిమాండ్ ను కూడా ఈ దేశ పాలకులు అణచివేయాలని చూస్తున్నారు. కొత్త రాష్ట్రాల డిమాండు ను పరిష్కరించాల్సిన కేంద్రమే అగ్నికి ఆజ్యం పోసే విధంగా వ్యవహరిస్తున్నది. నలుగురు పెట్టుబడిదారుల కోసం నాలుగున్నర ప్రజల కోరికను కాలరాస్తున్నది. ఈ పార్లమెంటు వజ్రోత్సవాల సందర్భంగా మాయావతి తెలంగాణ, విదర్భ, యూపీ విభజన సమస్యలను కేంద్రమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పటికైనా అలసత్వం వీడి తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేరిస్తే బాగుంటుంది. లేకపొతే చట్టసభల పై ఒక ప్రాంత ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉన్నది. అలాగే  పార్లమెంటు అరవై వసంతాల సంతోష సమయంలో ఈ దేశ పాలకులు సరిదిద్దవలసిన అనేక సమస్యలు ఉన్నాయి. లేకపొతే కవి అన్నట్టు స్వరాజ్యమవలేని సురాజ్యమెందుకని అని ప్రజలు భావించవలసి వస్తుంది.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home