Tuesday 8 May 2012

ముంచుకొస్తున్న మనుగడ ముప్పు!

మొన్న ఉప ఎన్నికల వరకు తెలంగాణ ఉద్యమంపై, ఉద్యమ నాయకత్వంపై అవాకులు చెవాకులు పేలిన తెలంగాణ టిడిపి ఫోరం కొంత కాలంగా కనిపించడం లేదు. దేవేందర్ గౌడ్ కు చంద్రబాబు రాజ్యసభ టికెట్ కట్టబెట్టిన తరువాత టి టిడిపి కార్యకలాపాలు పూర్తీగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాయి. కానీ రాష్ట్రంలో ప్రధాన పత్రికలకు మాత్రం ఇవి సమస్యలుగా కనిపించక పోవడం శోచనీయం. కానీ పనిగట్టుకుని ఈ ప్రధాన మీడియా వర్గం మాత్రం టిఆర్ఎస్ , జేఏసీల మధ్య ఏదో జరిగిపోతున్నట్టు కాలుకు బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నది. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవ, అవాస్తవాలు ఎంత వరకు నిజమో తెలియదు. కానీ విజయవాడ వేదికగా టిడిపిలో జరుతున్న నందమూరి వర్సెస్ నారా వారి అంతర్గత కలహాలు మాత్రం ప్రజలకు ప్రత్యక్షంగా కనపడుతూనే ఉన్నది. అయితే  టిఆర్ఎస్ , జేఏసీల మధ్య అభిప్రాయ భేదాలు అసలే  లేవని చెప్పలేము. కానీ కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు అదేపనిగా పనిగట్టుకుని ఉద్యమం పై విష ప్రచారం చేయడం దారుణం. టిడిపిలో ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జగన్ వేసిన ఎత్తుగా ఫలిస్తున్నట్టు కనిపిస్తున్నది. జగన్ ఆపరేషన్ ఆకర్ష్ కు సీమాంధ్ర తెలుగు తమ్ముళ్ళు వైఎస్ఆర్ సీపీ లోకి వలస బాట పడుతున్నారు. జగన్ 'కమ్మ'ని కౌగిలింతతో టిడిపిలో కలవరం మొదలైంది. ఇటు తెలంగాణ, అటు జగన్ తో టిడిపికి  వచ్చే ఎన్నికల నాటికీ పూర్తిగా చతికిల పడే ప్రమాదం పొంచి ఉంది. పార్లమెంటు వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ టి ఎంపీ లు స్వరాష్ట్రం కోసం నినదించి సస్పెన్షన్ కు గురయ్యారు. టిఆర్ఎస్ సభ్యులు కూడా సభలో హల్ చల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేశారు. పాపం టి టిడిపి నేతలు మాత్రం దీనిపై ఏమిచేయాలో పాలుపోక ఒక్కరోజు ప్లకార్డులు పట్టారు. చంద్రబాబు రెండుకండ్ల సిద్ధాంతం అ పార్టీ ని రెండుచోట్ల కాపాడడం సంగతేమో గానీ,, తెలంగాణాలో ఉద్యమం, సీమాంధ్రలో జగన్ ఆకర్ష్ టిడిపి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. అయితే టిడిపి నేతలు చెబుతున్నట్టు .. పార్టీ పెట్టిన ముప్పై ఏళ్లలో ఇలాంటి సంక్షోభాలు చాలానే చూడవచ్చు. మళ్లీ పుంజుకుని అధికారాన్ని కైవసం చేసుకుని ఉండవచ్చు. కానీ ఆ సంక్షోభ సమయంలో నందమూరి కుటుంబం పార్టీ వెంటే ఉన్నదనే విషయాన్ని మరిచిపోకూడదు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించినప్పుడు కూడా నందమూరి కుటుంబం నారా నేతృత్వం లోనే నడిచింది. కానీ పరిస్థితులు మారిపోయాయి. నారా వారిపై ధిక్కార స్వరం వినిపిస్తున్నదే నందమూరి కుటుంబం. పైకి తాము కలిసే ఉన్నామని ప్రకటనలు ఇస్తున్న ఆచరణలో మాత్రం అది కానరావడం లేదు. విజయవాడలో జగన్, వల్లభనేని కలయిక కాకతాలియమే అని చెబుతున్న.. అది పక్కా ప్లాన్ తోనే జరిగింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే వంగవీటి రాధా విజయవాడలో వైఎస్ఆర్ సీపీలో చేరే రోజే టిడిపి బందర్ పోర్టు పై బందుకు పిలుపునిచ్చింది. అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా విడుదల అయ్యింది. టిడిపి తీసుకున్న బందు నిర్ణయం నందమూరి అభిమానులను కలచివేసింది. ఉప ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదు కానీ.. టిడిపిని వెంటాడుతున్న ఆగస్టు సంక్షోభం మాత్రం ఈ పార్టీని ముందున్న పెద్ద సవాలు. అందుకే తన కుటుంబ, పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని కప్పిపెట్టి, తనకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో తెలంగాణ ఉద్యమం పై విషం చిమ్మడం మానివేస్తే మంచిది.
-రాజు ఆసరి

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home