Wednesday 16 May 2012

మారని వారే మార్క్సిస్టులు ...
మార్పు కోరుకునేదే మార్క్సిజం. కానీ సిపిఎం నేతలకు ఇది వర్తించదు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కారత్ ఆ మధ్య అమెరికాలో ఓ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి తమ సిద్ధాంతాలకు కాలం చెల్లిందన్నారు. (మన దేశానికి వచ్చాక ఆ వ్యాఖ్యలను ఖండించారు అది వేరే విషయం). ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. వస్తున్నాయి. వీటిని స్వాగతించే వారు ఉన్నారు. విభేదించే వారూ ఉన్నారు. వీరితో ప్రజలకు ఎలాంటి పేచీ లేదు. కానీ ఒక విషయాన్ని కొత్తగా చెబుతున్నట్టు నటించే వారితోనే ప్రమాదం. వీరు చేసే పనులన్నీ సిద్ధాంతాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తారు. కాలం చెల్లిన పిడి వాదాలను పట్టుకొని మూర్ఖపు వితండవాదాలు చేస్తారు.ఇలాంటి పనులన్నీ చేస్తున్నది ఎవరో కాదు సిపిఎం పార్టీ. తెలంగాణ విషయంలో తాము భాష ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడే ఉంటాము అంటారు. మరోసారి తెలంగాణపై తేల్చాల్సిన కాంగ్రెస్ పార్టీ తమ భుజాన తుపాకీ పెట్టి తాను తప్పించుకోవాలని చూస్తున్నదని ఆ పార్టీ నేతలే చెబుతారు. ప్రాంతాల వెనుకబాటుకు రాష్ట్ర విభజన సరికాదు అంటారు. చిన్న రాష్ట్రాల విభజన విషయంలో సిపిఎం వితండవాదన వెనుక చాలా కారణాలు ఉన్నాయి. మూడు దశాబ్దాల పాటు బెంగాల్ ను ఏకాచత్రాధిపత్యంగా ఏలిన సిపిఎం కోటలు కూలిపోయాయి. అక్కడ గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతున్నది. ఒక్క బెంగాల్ విభజనను వ్యతిరేకించడం కోసం సిపిఎం దేశ వ్యాప్తంగా అదే నినాదాన్ని అన్ని ప్రాంతాల ప్రజలపై రుద్దుతున్నది. అక్కడ గూర్ఖాలాండ్ విభజనపై దానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి గూర్ఖా నేతలతో  మమత ప్రభుతం  ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఆ సందర్భంగా గూర్ఖా నేతలు ఈ ఒప్పందం తాత్కాలికమే.. ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండును మేము వదులుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని తెలంగాణ కు ఆపాదిస్తూ సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం చేసింది. ఈ వాదనలు ఇలా ఉంటే సిపిఎం గత కొంతకాలంగా కొత్త వాదనను తెరమీదికి తెచ్చింది.బాబు రెండుకండ్ల సిద్ధాంతం, కాంగ్రెస్ కాలయాపన కంటే సిపిఎం చేస్తున్న వాదన మరింత ప్రమాదకరమైంది. తెలంగాణ ఉద్యమాన్ని మతంతో ముడిపెడుతున్నది ఆ పార్టీ. తమ భాష ప్రయుక్త రాష్ట్రాల నినాదాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఏర్పడితే బిజెపి బలపడుతుందని ఎంఐఎం చేస్తున్న వాదననే ఈ పార్టీ ఆలపిస్తున్నది. శ్రీ కృష్ణ కమిటీ ముందుకూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మత కలహాలు చెలరేగుతాయని ప్రజల ఆకాంక్ష పై విషం చిమ్మింది. బహుశా తెలంగాణపై ఎంఐఎం కు ఉన్న అభిప్రాయాలూ, అనుమానాలు ఇంత భయంకరంగా లేవు. అందుకే ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ తెలంగాణ పై తేలకుండా.. హెచ్ఎండీఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను తప్పుపట్టాడు.అంటే ఎంఐఎం కూడా తమకు సమైక్య రాష్ట్రం వల్ల ఉండే  ప్రయోజనాలను పక్కన పెట్టి, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు గుర్తించింది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రంపై తెలంగాణపై తేల్చాలని ఒత్తిడి తెస్తున్నది. తమ ఓటు సమైక్య వాదానికే అని ప్రకటించినా ఒకవేళ కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయదలుచుకుంటే హైదరాబాద్ రాజధానితో కూడిన  తెలంగాణ రాష్ట్రాన్నిడిమాండ్ చేస్తున్నది. అ పార్టీలో కూడా మార్పు వస్తున్నది. కానీ మార్పు కోరుకునే మార్క్సిస్టులం అనే చెప్పుకునే వీరు మూర్క్సిస్ట్ ల వలె వ్యవహరిస్తున్నారు. ఒక రాష్ట్రం ఏర్పడితే ఒక  పార్టీ బలపడుతుందనే వాదన అసంబద్ధమైనది. ప్రజల ఆదరణ లేకుండా ఏ పార్టీ కూడా బలపడలేదు అనేది కూడా గుర్తించలేని వీరు మార్క్సిస్టుల నే కాదు ఏ చిన్న పిల్లాడిని అడిగిన చెబుతాడు. అంతే కాదు వీరు చెప్పే ఉద్యమాలు, పోరాటాలు కూడా ప్రజల ఆదరణ ఉంటేనే సక్సెస్ అవుతాయి. మరి రాఘవులు వంటి వారు తెలంగాణ అంశాన్ని ఒక పార్టీతో ఎందుకు ముడిపెడుతున్నాడో తెలుసుకోలేని అమాయకులు కారు తెలంగాణ ప్రజలు. రాష్ట్ర సిపిఎంలో ఆధిపత్యం చెలాయిస్తున్నది ఒక వర్గమే అన్నది విదితమే. పార్టీలు, సిద్ధాంతాలు ఏవైనా వీరి డ్యూయెట్ ఒక్కటే అబ్బని 'కమ్మ'ని దెబ్బ. అందుకే సిపిఎం రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది. అయినా ఈ నేతల వైఖరిలో మార్పు రాలేదు. వస్తుందని కూడా ఎవరు భావించడం లేదు. ఎందుకంటే వారు మారని మార్క్సిస్టులని తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజలు  ఎప్పుడో గుర్తించారు. మార్పు కోరుకోకుంటే పోయిన ప్రతిష్ట ఒక్కటే కాదు, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చే వారు కూడా దూరమౌవుతారు అనే విషయాన్ని రాఘవులు అండ్ కో ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home