Saturday 13 October 2012

సులువు కాదన్నప్పుడు సూక్తులెందుకు?

సంక్లిష్టం, సున్నితం, సంయమనం, సంప్రదింపులు, చర్చలు, ఏకాభిప్రాయం, అందరికి ఆమోదయోగ్యం ఇవన్నీ సప్త స్వరాల వలె ఎప్పుడూ మనకు వినిపిస్తాయి. తెలంగాణపై హస్తిన పెద్దలను ఆరాతీస్తే వచ్చే సమాధానాల్లో ఇందులో ఏదో ఒకటి తప్పక ఉంటుంది. ఐదున్నర దశాబ్దాలుగా తెలంగాణపై ఎన్నడూ ఒక్క ముందడుగు వేయలేదు (ఒక్క 2009 డిసెంబర్ 9 ప్రకటన తప్ప). 2009 డిసెంబర్ 7 నుంచి 9 వరకు మాత్రమే తెలంగాణపై రాష్ట్రంలో, కేంద్రంలో ఏకాభిప్రాయం వచ్చింది. తెలంగాణపై చిదంబరం ప్రకటన తెల్లారి నుంచి అంటే  డిసెంబర్ 10 మానవ హక్కుల దినం నుంచి ఈ ప్రాంతంలో ప్రజల హక్కులు కాలరాయబడుతూనే ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తాము అంటూనే వారి హక్కులను హరిస్తున్నాయి పార్టీలు. నిజానికి తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు చూస్తే తెలంగాణ ప్రజల్లో తెగువ రెట్టింపు అయితే, ఆంధ్ర ప్రాంత ప్రజలకు అసహ్యం వేస్తున్నది. ఎందుకంటే ప్రజల్లో రాష్ట్ర విభజనపై మానసిక విభజన ఎన్నడో వచ్చింది. వారంతా కోరుతున్నది ఇక భౌగోళిక విభజనే! అయితే అది ఎలా ఉంటుంది అనేదే అందరిలో ఉన్న ఆసక్తి.

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పటి నుంచి తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు చేసిన ప్రకటనలు చూస్తే వారికి ఈ ప్రాంత ప్రజల మనోభావాలపై ఎంత చిన్నచూపు ఉన్నదో అర్థమవుతుంది. కేంద్ర హోం మంత్రి తెలంగాణపై తనకు అవగాహన లేదంటూనే అడ్డదిడ్డంగా, అనాలోచితంగా మాట్లాడతారు. వాయలార్ రవికి అయితే ప్రజల ఆకాంక్ష హాస్యం అయిపోయింది. అందుకే ఆయన వేరీజ్ తెలంగాణ అంటారు. ఆజాద్‌ను తెలంగాణ గురించి ఆరా తీస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చెప్పేది ఒక్కటే మాట ఏకాభిప్రాయం. అందుకే ఆజాద్ తనకున్న ఆజాదీతో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను విభజించినంత సులువుగా ఏపీ విభజన సాధ్యం కాదు అంటారు. అయితే  ఆ రాష్ట్రాల విభజన కూడా అంత సులభంగా జరగలేదు అన్న విషయం పాపం ఆయనకు తెలియదు కాబోలు. ఎందుకంటే ఆ పని చేసింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కాదు కమలనాథుల నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. మనీష్ తివారీ సంయమనం పాటించాలి అంటారు. మరో అధికార ప్రతినిధి ప్రజల మనోభావాలు మాకు తెలుసు అంటారు. నిజానికి కాంగ్రెస్ పెద్దలు తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు కానీ అభ్యంతరాలు ఏమిటో చెప్పడం లేదు. అవి కూడా ప్రజల అభిప్రాయాలా లేక ప్రజాప్రతినిధులవా లేక పెట్టుబడిదారులవా అన్నది స్పష్టం చేయడం లేదు. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నామంటున్న హస్తిన పెద్దలు అది ఎన్నటికి పూర్తవుతుందో వారికే తెలియదు. తెలంగాణపై అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న హస్తిన పెద్దలను అర్థం చేసుకునేది రాష్ట్ర కాంగ్రెస్ నేతలే. వారి అవగాహనా రాహిత్యాన్ని అర్థం చేసుకోవాలని, వాటికి అపార్థాలు తీయవద్దని వాళ్ల బాధ్యతారాహిత్య వ్యాఖ్యల భారాన్ని వీళ్లు మోస్తారు.

 2004 నుంచి తెలంగాణ అంశం కేంద్రం కోర్టులో  (కాంగ్రెస్ పార్టీ) ఉంది. అంటే ఎనిమిదిన్నర సంవత్సరాలుగా వీళ్లు ఈ అంశం ఏం సాధించారో తెలియదు. కానీ కనీసం వాళ్ల పార్టీలోనే అది కూడా రాష్ట్రస్థాయిలో ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. ఇక భాగస్వామ్య పక్షాల్లో ఎలా అది సాధ్యమవుతుందో వాళ్లకే తెలియాలి. ప్రణబ్ కమిటీకి దాదాపు నలభై పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తమ అభిప్రాయాలు పంపాయి. అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ లిఖితపూర్వకంగా తమ అభిప్రాయం తెలియజేయకున్నా పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై బిల్లుపెట్టంటి మేము మద్దతు ఇస్తామని ప్రకటించింది. అయినా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కదలిక ఉండదు. కాలయాపన కోసం కమిటీలు వేస్తూ.. అవి ఇచ్చిన నివేదికలపై నిర్ణయం చెప్పకుండా నిశ్చింతగా ఉండడం హస్తిన పెద్దలకు అలవాటైపోయింది. అందుకే ఆజాద్ రెండున్నర సంవత్సరాలుగా తెలంగాణపై సంప్రదిపులు కొనసాగుతున్నాయి అంటున్నారు కానీ సాధించింది ఏమిటో చెప్పడం లేదు.

ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది. తెలంగాణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. అసెంబ్లీ తెలంగాణపై తీర్మానం పెట్టంటి అని బీరాలు పలికిన బాబు రాష్ట్రంలో ఎన్నో అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కానీ తెలంగాణపై మాత్రం గోడమీద పిల్లిలా వ్యవహరిస్తారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదన్నప్పుడు అసెంబ్లీలోతెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్ పట్టుబట్టినప్పుడు ప్రధానప్రతిపక్ష బాధ్యతను బాబు విస్మరించారు. అందుకే ఆయన మనసులోని అంశాన్ని మాటల్లో ఎన్ని రకాలుగా చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదు. బాబుకు ఊడిగం చేస్తున్న ఈ ప్రాంత టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పెద్దలు చెబుత్నున ఏకాభిప్రాయం ఎన్నటికీ సాధ్యం కాదు. కానీ  తెలంగాణ ప్రజల సహనం నశిస్తే మాత్రం సులువు కాదన్న అంశం సులభం అవుతుంది అన్నది సుస్పష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా వ్యవహరించడం కట్టిపెట్టాలి. సమస్యను సాగదీయకుండా పరిష్కరించాలి. రాష్ట్ర విభజన సులువు కాదు అనుకుంటే అవుననో కాదనో ఏదో ఒకటి చెప్పాలి. అప్పుడు బాధితులకు పోరుబాటే మార్గమైతే...త బాధ్యతలు విస్మరించిన వారికి అది మరణశాసనం అవుతుంది.
-రాజు

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home