Saturday 20 October 2012

జాతి ఆకాంక్షపై విషం కక్కడమే జాతీయభావనా?



వినోదాన్ని పంచాల్సిన సినిమాలు వివాదం ఎందుకు అవుతున్నాయి? ఆర్ట్ సినిమా తీసినా ఆదాయమే వారి ఉద్దేశం. దానికి కూడా కొన్ని కమర్షియల్ హంగులు జోడించి సొమ్ముచేసుకోవడం జరుగుతున్నదే. మంచి సందేశం ఇవ్వాలంటే ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం దాన్ని ద్వారా వచ్చే ఆదాయాన్ని సొమ్ముచేసుకోవడం జరుగుతున్నదే. అది తెలంగాణ ఉద్యమమే కావచ్చు. లేదా మరేదైనా కావచ్చు. అలా వివాదాస్పదం అయిన సినిమాల జాబితాలోకి ఇప్పుడు కెమెరామెన్ గంగాతో రాంబాబు చేరిపోయింది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆయన వ్యవస్థలోని అవస్థలను చూపించబోయి అభాసుపాలయ్యాడు. జాతీయ భావన పేరుతో ఒక జాతి ఆకాంక్షను అగౌరవపరిచాడు. ఈ సందర్భంగా ఆ మధ్య ఆయనే తీసిన పోకిరి సినిమాలో ఓ డైలాగ్ గుర్తుకు వచ్చింది. అందులో ప్రకాశ్‌రాజ్ మమైత్‌ఖాన్‌ను గిల్లితే గిల్లించుకోవాలి అంటాడు. అట్లాగే ఉన్నది పూరి వ్యవహారశైలి. తనకున్న అవగాహనో, అజ్ఞానమో తెలియదు కానీ ఓ సినిమాను తీసేసి అ సినిమాను ప్రదర్శనకు పెట్టి ప్రజల మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అంటున్నాడు.

ఇక్కడ ఈ సినిమా విడుదలకు ముందు పూరీ చెప్పిన కొన్ని విషయాలను గుర్తుచేసుకుంటే ఇది ఆయన కావాలనే తీసినట్టు అర్థమవుంది. ఈ సినిమా కథను నాలుగేళ్ల కిందట రాసుకున్నానని, అయితే ఇప్పటికి ఇప్పటికి మన వ్యవస్థలో వచ్చిన మార్పులేవీ లేవన్నారు. సినిమా చూస్తే ఎక్కడా మీకు అది నాలుగేళ్లనాటి కథ అనిపించదు అన్నారు. అంటే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నాలుగేళ్ల కిందట ఎలా ఉన్నదో ఇప్పటికీ అలాగే ఉన్నదన్నది సదరు దర్శకుని అభిప్రాయం. అందుకే కాబోలో ఆయన అక్కసు. అట్లాగే మరో విషయం కూడా చెప్పారు. ఈ కథ విన్న హీరో పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా కథ రాశావు అన్నారన్నారు. అంటే కథలో దర్శకుడు చెప్పబోతున్న అంతర్లీన అంశం విషం చిమ్మడంమే కనుక ఆయన మెచ్చుకున్నారు కావచ్చు. అంతేమరి నిమ్మచెట్టుకు తుమ్మకాయలు కాస్తాయా మరి? జగిత్యాలలో సామాజిక తెలంగాణ అని మారువేశం వేసిన చిరంజీవి తర్వాత సమైక్యవాదమన్నారు. ఇలా అవకాశవాదం వ్యవహరించిన అన్న వైఖరిని తమ్ముడు తప్పుపట్టలేదు. పూరి జగన్నాథ్ కూడా ఇది అన్యాయం అనిపించలేదు. కానీ ఇప్పుడు జాతీయ భావన గురించి తెగ బాధపడిపోతున్నాడు. అందుకే పవన్‌కు తెలంగాణపై తనకున్న ఆవేశాన్ని, పూరిలో ఉన్న అక్కసు జోడించి ఈ సినిమాను తెరముందుకు తెచ్చారు. దీన్ని పంపిణీ చేసిన ఈ ప్రాంత ప్రబుద్ధుడు దానికి వంతపాడాడు.  సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు కొంత అనుమానం వచ్చిందట కానీ దాన్ని అప్పుడు చెప్పలేకపోయారు పాపం. అందుకే ఇప్పుడు ఈ సినిమా నిర్మాత దానయ్య దీనికి వివరణ ఇవ్వడం లేదు కానీ దిల్ రాజు మాత్రం అన్నీ తానై సినిమా వివాద బాధ్యతలను తాను మోస్తున్నాడు. అయినా మహిళలను, వికలాంగులను గౌవరించాలన్న సంస్కారం లేని వాళ్లు సమాజానికి నీతులు చెప్పడమే ఇప్పటి విషాదం.

అట్లాగే మన సినిమా వాళ్లు మా కళాకారులకు ప్రాంతాలతో సంబంధం లేదు. మేము అన్ని ప్రాంతాల వారీని గౌరవిస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తరచుగా కనిపిస్తున్నదే. ఈ సినిమాపై తలెత్తిన వివాదాలకు దర్శకుడు, నైజాం ఈ సినిమా పంపిణీదారుడు వివరణ ఇచ్చారు, ఇస్తున్నారు. తమ తప్పును తెలుసుకుని క్షమాపణలు కోరుతున్నారు. కానీ సందట్లో సడేమియా లాగా తెలంగాణ అంటే ఒంటికాలిపై లేచే లగడపాటి ఇందులోకి ఎంటరయ్యారు. లగడపాటి ఈసినిమా ప్రచారాన్ని మోస్తున్నారు అంటేనే ఈ సినిమా ఉద్దేశం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. దర్శకుడు సినిమా బాగా తీశాడని ప్రశంసిస్తున్నారు. దర్శకుడు ఈ సినిమాలో జాతీయ సమైక్యత గురించి చక్కగా వివరించారని అంటున్నారు. మరి జాతీయ భావన గురించి చెప్పే వీరు మొన్న జీవవైవిధ్య సదస్సుకు ప్రధాన వచ్చిన సందర్భంలో ఒక ప్రాంత పాత్రికేయులను నిరాకరించినప్పుడు వీరు స్పందించలేదు. కలిసుందాం అంటూనే కలహాలు పెట్టే చర్యలు పూనుకుంటున్నారు. లగడపాటి అనుంగు శిష్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్ అయితే ‘జై బోలో తెలంగాణ’ సినిమాకు జాతీయ సమగ్రత’ అవార్డు ఇవ్వడాన్ని ఆక్షేపించారు. జైబోలో తెలంగాణ సినిమా ఆపడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారో అప్పుడే మరిచిపోయారా? ఆదీనిపై పునరాలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అప్పుడు మాట్లడలేదు ఈ జాతీయవాదులు. ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యభావన లేదనడానికి ఈ ఉదంతాలు చాలవా?

ఇంత జరిగినా కొందరు సినీ పండితులు మాత్రం సినిమాను సినిమాలా చూడాలి అంటారు. తప్పుచేసి దానికి మీడియా ముఖంగా దానికి తెలంగాణ ప్రజలను కోరుతుంటే కొందరు మిత్రలు మాత్రం ఫేస్‌బుక్‌లో ఇంకా సినిమాను సమర్థించడం సబబు కాదు. అందుకే దీనికి మనం ఇచ్చే సమాధానం కూడా పూరీ ‘నేనింతే’ సినిమాలో చెప్పిన డైలాగ్‌ను వారికే గుర్తు చేద్దాం. అందులో హీరోపై విలన్ ఉమ్మేస్తాడు. దానికి హీరో స్పందన ఎలా ఉంటుంది అంటే తుడుచుకుంటే పోతుంది అంటే వందసార్లు తుడుచుకోవడానికైనా నేను రెడీ. మరి నేనే పోతాను అనుకుంటే దానికంటే ముందు నువ్వుపోతావు అంటాడు. మరి మనం ఏం చేద్దాం. అందుకే తెలంగాణ సహనాన్ని గిల్లవద్దు. జాతీయభావన గురించి నీతులు చెప్పేవాళ్లు ఒక జాతి ఆకాంక్షపై విషం గక్కడం ఎంత వరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి?వినోదాన్ని పంచుతామనే పేరుతో వివాదాలు సృష్టిన్తున్న ఇలాంటి వారికి రాయితీలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలి.  అలాగే పూరీ అండ్ కో తెలుసుకోవాల్సిన మరో విషయం ఉన్నది. సినిమా బాగుంటేనే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ప్రజల ఓపికను పరీక్షిస్తే అప్పుడు పూరీ తీసిన సినిమా క్లైమాక్స్‌లో గ్రాఫిక్స్‌లా ఉండవు గర్జనలే ఉంటాయి. అప్పుడు ఆ సౌండ్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది.

3 Comments:

At 20 October 2012 at 05:35 , Blogger Praveen Mandangi said...

Camera man gangato cinema even ridiculed women. They showed feminists as swallowers of pan and gutka.

Simultaneously, they also targeted TDP by naming villain cum opposition leader as Jawahar Naidu.

సినిమాని సినిమాలాగ చూడాలని అనుకుంటే ఆ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రకి "చంద్ర శేఖరరెడ్డి" అనీ, విలన్ పాత్రకి "జవహార్ నాయుడు" అనీ నిజ జీవితంలోని వ్యక్తుల పేర్లని పోలి ఉన్న పేర్లు పెట్టడం అవసరమా? అది ఆ సినిమావాళ్ళు ఇంటెన్షనల్‌గా చేసిన పని.

 
At 20 October 2012 at 07:09 , Blogger Praveen Mandangi said...

ఆ సినిమాలో తెలంగాణా ఉద్యమాన్ని డైరెక్ట్‌గానే దూషించారు. రానా నాయుడు (లోకేష్) తెలుగు ఉద్యమం అనే ఉద్యమం పెట్టి హైదరాబాద్‌లో స్థిరపడిన కేరళీయులు, తమిళులూ & మార్వాడీలపై దాడులు చెయ్యిస్తున్నట్టు చూపించారు. తెలంగాణా వస్తే హైదరాబాద్‌లో ఉన్న కోస్తావాళ్ళపై దాడులు జరుగుతాయనే భావన కలిగించడానికే ఆ సన్నివేశాలు పెట్టారని సినిమా చూసినవాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. జవహార్ నాయుడు (చంద్రబాబు నాయుడు) & రానా నాయుడు (లోకేష్) తెలుగువాళ్ళ ఆత్మహత్యలని ప్రోత్సహిస్తున్నట్టూ, కిరోసీన్ పోసుకున్నవాళ్ళ మీదకి వెనుక నుంచి వెలిగిన అగ్గిపుల్ల విసురుతున్నట్టూ చూపించారు. అందుకే ఈ సినిమాపై తెలంగాణావాదులు అభ్యంతరాలు చెప్పారు.

 
At 20 October 2012 at 07:33 , Blogger Praveen Mandangi said...

The director may delete these scenes at any time to prevent opposition from people of Telangana and also from activists of Telugu Desam Party. So, I request you to watch the cinema before they edit scenes of the original print.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home