Wednesday 31 October 2012

బాటలు-బీటలు

చంద్రబాబు ఒకవైపు ‘వస్తున్నా మీ కోసం’ అంటూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్తున్నాం జగన్ కోసం అంటూ బాబుకు నిస్తేజాన్ని నింపుతున్నారు. ముప్ఫై ఏళ్ల తెలుగుదేశం పార్టీని ఈ మూడేళ్లలో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. హైటెక్ ముఖ్యమంత్రిగా అంతర్జాతీయ ప్రశంసలు పొంది ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోయిన బాబును తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి ఇప్పుడు సమర్థవంతమైన నాయకుడు కావాలి, అది చంద్రబాబే అని ఆ పార్టీ ప్రచారం చేస్తుంటే.. ఆ పార్టీ అసమ్మతి నేతలు మాత్రం బాబు నాయకత్వ వైఫల్యం వల్లే తాము పార్టీని వీడుతున్నామంటున్నారు.

2009 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి పేరుతో టీడీపీ 92 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఆ సంఖ్య 7 కి చేరింది. ఇందులో పన్నెండు మంది ఆ పార్టీకి దూరం కాగా మరో ఇద్దరు అదే బాటలో ఉన్నారు. వీళ్లే కాదు మునుముందు మరికొంత మంది పార్టీని వీడుతారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. నిజానికి అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత ప్రధానప్రతిపక్షానికి లాభించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నా పైకి మాత్రం ఆ పార్టీ నేతలు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నది. రోశయ్య తర్వాత అంధకారంలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌కు వెలుగు ‘కిరణం’ అవుతాడునుకున్న ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడల వల్లే ఆ పార్టీ కూడా నానాటికీ బలహీనపడుతున్నదని ఆ పార్టీ నేతల బహిరంగంగా విమర్శిస్తున్నారు. చిత్తూరు బాబులిద్దరు జనంలో ఉంటే వారి పార్టీ ఎమ్మెల్యేలు జగన్ వెంట నడుస్తామంటున్నారు.

అధికార పార్టీ పరిస్థితికి వారి అధిష్ఠానం చేస్తున్న తప్పిదాల స్వయంకృతపరాధం ఒక కారణమైతే ఆ పార్టీలో అంతర్గత ఆధిపత్యపోరు మరో కారణం. కానీ చంద్రబాబు పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధం. టీడీపీలో ఆయనే కర్త, కర్మ, క్రియ. కానీ బాబు నాయకత్వంపై నీలినీడలు ఎందుకు కమ్ముకుంటున్నాయి? బాబు పాదయాత్ర సక్సెస్ అని ఒకవైపు ప్రకటిస్తూనే..మరోవైపు పార్టీతో విభేదిస్తున్న ఎమ్మెల్యేపై సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఈ ముంచుకొస్తున్న ముప్పును చంద్రబాబు ఎలా అధిగమిస్తారు అనే ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం దొరకడం కొంచెం కష్టమే. ఎందుకంటే పార్టీని వీడుతున్న ఎమ్మెల్యే చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో బాబు పాదయాత్ర చేస్తూ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదు అని గొంతెత్తి అరుస్తుంటే ఆ పార్టీని వీడుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు మాత్రం సమైక్య ఉద్యమానికి ఊతమిచ్చింది బాబేనని మీడియా ముందు వెల్లడిస్తున్నారు. అయితే ఈ విమర్శలను టీడీపీ నేతలు సూటికేసులకు అమ్ముడుపోయి బాబుపై నిందలు వేస్తున్నారన్నా వారి వ్యాఖ్యల ప్రభావం ఆ పార్టీపై తప్పకపడుతుంది. ఎందుకంటే టీఆర్‌ఎస్ పార్టీ,  నాగం జనార్ధన్‌రెడ్డి వంటి నేతలు ఇప్పటికే సమైక్య ఉద్యమాన్ని నడిపించింది బాబేనని చాలా కాలంగా ఆయనను కార్నర్ చేస్తున్నారు. దాని ఫలితమే తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల మాత్రం డిపాజిట్ దక్కించుకోగలిగింది. ఇప్పుడు తాజా మాజీ టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు తెలుగుతమ్ముళ్లు. అందుకే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి మళ్లీ లేఖ రాసినా ఈ ప్రాంత ప్రజలు విశ్వసించడం లేదు. కానీ బాబు లేఖను బూచిగా చూపిస్తు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్నారు. నారా నందమూరి కుటుంబాల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ బాబు పాదయాత్రతో సద్దుమణుగుతుందని అంతా భావిస్తున్న ఈ సమయంలో ఆ పార్టీలో కొత్త సంక్షోభాలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే మునుముందు ఎలా ఉంటుందో చెప్పలేం.

ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎలా చూస్తున్నారో ప్రత్యేక రాష్ట్రంపై స్పష్టత ఇవ్వని టీడీపీని అలాగే చూస్తున్నారు. ఇందుకు వైఎస్‌ఆర్‌సీపీ కూడా మినహాయింపు కాదు. ఇచ్చేది మేమే తెచ్చేది మేమే ఒకరు, ఇచ్చే శక్తి గానీ తెచ్చే శక్తి గానీ తమకు లేవని మరొకరు, తెలంగాణపై తేల్చాంది కేంద్రమే అని ఇంకో పార్టీ వీరి వాదనలు ఏవైనా వాస్తవాలను మాత్రం ప్రజలు గ్రహిస్తున్నారు. ఇచ్చేది కేంద్రమే తేల్చాల్సింది రాష్ట నేతలే అని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఆశపడుతున్న అశావహులు కూడా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో రెండు పార్టీల్లో ఆనందం మరో పార్టీలో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే అన్ని పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తెలంగాణపై ఒక అభిప్రాయానికి రావాలి. అప్పుడు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం అసాధ్యమేమీ కాకపోవచ్చు.
-రాజు

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home