Saturday 20 October 2012

అన్నింటికి అతనే



గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది లగడపాటి రాజగోపాల్ వైఖరి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. డెంగీ మరణాలు, విద్యుత్ కోతలు, చేనేత సమస్యలు, ఇలా ఒక్కటేమిటి సకల జనుల సమస్యలన్నీ సచివాలయంలో పేరుకుపోయాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఈ లగడపాటి ఏనాడూ లేఖ రాయలేదు. రాయడు కూడా. కానీ తెలంగాణ అన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా ఆయనకు చిర్రెత్తుకొస్తుంది. సీమాంధ్ర మీడియా కూడా తెలంగాణపై మాట్లాడడానికి, ఉద్యమకారులపై విమర్శలు చేయడానికి ఆయనకే పేటెంట్ హక్కు ఇచ్చినట్టు ఉన్నాయి. అందుకే తెలంగాణ అనగానే లగడపాటి వచ్చి వాలుతాడు. అయితే తెలంగాణ ఉద్యమంపై ఆయనకు అవగాహన ఉన్నదా? లేక రాజకీయాల్లో తలపండిన నేతా అంటే పొరపాటే సుమా! ఆయనకు తెలిసిందల్లా వాస్తవాలు లేని వితండవాదమే తప్ప దేనికి సరైన ఇవ్వడు. మొన్నటికి మొన్న కేసీఆర్ హైదరాబాద్‌లేని తెలంగాణ ఇవ్వమని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరాడని, దీనికి ఒప్పుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు, ఇతర ముఖ్యులకు ఫోన్ చేశాడని అర్థంలేని ఆరోపణలు చేశాడు. దీనికి రుజువులు ఉన్నాయా అంటే ఏవీ లేవు. ఆరోపణలు చేసిన వ్యక్తే ఏమంటాడు అంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గుండె మీద చెయ్యి వేసుకుని తన ఆరోపణలు వాస్తవమో, అవాస్తమో చెప్పమంటాడు. సదరు సీమాంధ్ర మీడియాకు లగడపాటి చేస్తున్న జగడం ఏమిటో అర్థమయ్యాక కూడా మళ్లీ మళ్లీ అతని అభిప్రాయమే సర్వరోగ నివారణి అన్నట్టు మైకు తీసుకెళ్లి ఆయన ముందు పెడతారు.

ఇప్పుడు తాజాగా కెమెరామెన్ గంగాతో రాంబాబు విషయంలోనూ తలదూర్చి ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశాడు. ఈ విషయంలో ఉద్యమకారులపై ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతాడు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఈ సినిమా వివాదంపై అందులో అభ్యంతరాలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చినట్టు ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ సభ్యులు కూడా ఇందులో తొమ్మిది చోట్ల అభ్యంతరాలు ఉన్నట్టు ప్రభుత్వానికి నివేదించారు కూడా. అయినా లగడపాటికి ‘రాంబాబు’మత్తు వదలలేదు. ఆ సినిమా డైరెక్టర్ పేరు కూడా సరిగ్గా తెలియని రాజగోపాల్ ఇవ్వాళ ఆ సినిమాలో సమైక్యత గురించి గొప్ప సందేశముందని లెక్చర్లు దంచుతున్నాడు. దీనికి ఓ సీమాంధ్ర మంత్రి, మరో రాయలసీమ నేత కూడా వంత పాడుతున్నారు. అంటే వీళ్ల ప్రభుత్వం నియమించిన కమిటీయే ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే వీళ్లు మాత్రం ఓ హీరోను పల్లకిలో మోసే పనిలో ఉన్నారు. అంతేమరి ప్రభుత్వాధినేత పనితీరు బాగుంటే వీళ్లు ఇంత కులాసాగా ఉందుకుంటారు. ముఖ్యమంత్రి ముందు సమస్యలు లేవనెత్తితే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. పరిష్కారం చూపమంటే పక్కవాడి మీద నెట్టేస్తారు. అందుకే యథారాజ తథా ప్రజా అన్నట్టు ఉన్నది రాష్ట్ర ప్రభుత్వ పాలన! కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యను పరిష్కరించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాన్న ఉద్దేశ్యం ఉన్నట్టు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అలజడులను చూస్తూ హస్తినలో పెద్దలతో పూటకో మాట పలికిస్తున్నది. ఈ పరిస్థితిని ఇంకా ఎంతకాలం ఏకాభిప్రాయం పేరుతో  కొనసాగిస్తారో వారికే తెలియాలి.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home