Friday 12 May 2023

పవన్‌ నిలకడలేని నిర్ణయాలు.. ప్రశ్నార్థకంలో ఆ పార్టీ మనుగడ


పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలకు ముందు కూటములుగా ఏర్పడటం, పొత్తులు పెట్టుకోడం సహజమే. కానీ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే పొత్తులు పెట్టుకుంటామనడమే ఆశ్చర్యంగా ఉన్నది. ఆయన పొత్తులపై మాట్లాడుతూ..' వైసీపీ నుంచి రాష్ట్రాన్ని రక్షించి  అధికారాన్ని చేజిక్కించుకోవడం, కూటమి ద్వారా తిరిగి ప్రజలకు దక్కాలి' అన్నారు. పొత్తులపై కొందరు అంగీకరించకపోవచ్చని, వాస్తవ గణాంకాలు చూపి ఒప్పిస్తామని, ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చిన తర్వాత ఇదే చెప్పాం. తన నిర్ణయం మారదు' అన్నారు.


అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే పవన్‌ వ్యాఖ్యల ప్రకారం చూస్తే.. వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలి. మొత్తం 175 స్థానాల్లో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే సీట్ల విషయంలో అన్నిపార్టీలు రాజీపడాలి. జనసేన అధినేతగా పవన్‌ ఆధేశాల ప్రకారం వాళ్ల నేతలు అంగీకరిస్తారు అనుకుందాం. మరి బీజేపీ, టీడీపీ ల నేతలు పొత్తులో భాగంగా సీట్లు త్యాగాలు చేయడానికి సిద్ధపడుతారా? మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏపీలో బీజేపీ కంటే వామపక్షాల బలమే ఎక్కువ. విపక్ష కూటమిలో బీజేపీ ఉంటే వామపక్షాలు వారితో కలిసి వస్తాయా? భిన్న సిద్ధాంతాలు, భావజాలాలు ఉన్న పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామని, అందుకు కొంతమంది అంగీకరించకున్నా ఒప్పిస్తానని పవన్‌ అనడం హాస్యాస్పదం. 


ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందని ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. కానీ ఐదేళ్లలో బాబు ఏం చేశారో అనుభవంలో ఉన్నదే. అలాగే టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలతో విసిగిపోయిన జనాలు జగన్‌కు జై కొట్టారు. గడిచిన నాలుగేళ్లుగా ఆయనేం చేస్తున్నారో చూస్తున్నాం. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వంటివి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మరో ప్రభుత్వం రావాలనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఉన్నది. ఆ అవకాశం పవన్‌ పార్టీ లేదా ఇతర పార్టీలకు ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందే పొత్తుల కోసం పాలకులాడుతున్న పవన్‌ తానకు సీఎం కావాలనే కోరిక లేదని, ఆ పదవి వరించి రావాలి కానీ.. మనం కోరుకుంటే అయ్యేది కాదన్నారు. దీంతో పవన్‌ లక్ష్యం బాబు ను మళ్లీ సీఎం చేయడమే అన్నది స్పష్టమైంది. దీన్నిరాజకీయ ప్రయోజనాల దృష్ట్యా జనసేన, బీజేపీ అంగీకరించినా ప్రజలు దాన్ని ఆమోదిస్తారా? అన్న గ్యారెంటీ ఏమీ లేదు. అంతేకాదు పవన్‌ టీడీపీకి బీ టీమ్‌ అన్న వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. రాజకీయాల్లో పవన్‌ నిలకడలేని నిర్ణయాలు ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థం చేస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ప్రజల ఆకాంక్షలు తొమ్మిదేళ్లైనా ఇప్పటికీ నెరవేరలేదు. ఈ వైఫల్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల పాత్ర ఉన్నది. కానీ పవన్‌ ఈ విషయాన్ని మరిచి తిరిగి బీజేపీ, టీడీపీ పొత్తులు పెట్టుకునేలా తాను కృషి చేస్తానని చెబుతుండటంపై ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. అందుకే వైసీపీ నేత సజ్జల పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ నీటి బుడగ అని,చంద్రబాబు పల్లకి మోయడమే ఆయన నైజం అని,బలం లేదని పవన్‌ అంగీకరించారని కౌంటర్‌ ఇచ్చారు. పొత్తులపై పవన్‌కు అంత తొందర ఎందుకో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 



Labels: , , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home