Saturday 3 February 2024

రాజయ్య రాజీనామా ఊహించిందే!


 బీఆర్‌ఎస్‌కు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా చేశారు. పార్టీ  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు ఆ లేఖను చూపెట్టారు.అంతకు ముందే ఓ మీడియాఛానల్‌తో మాట్లాడుతూ పార్టీలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అన్నారు. నిజానికి రాజయ్యకు టికెట్‌ నిరాకరించినప్పుడే ఆయన పార్టీ మారుతారని అనుకున్నారు. కానీ పార్టీ మారినా స్టేషన్‌ ఘన్‌పూర్ టికెట్‌ వస్తుందనే విశ్వాసం ఆయనకు లేదు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ త్యాగం చేసినందుకు 2023 అక్టోబర్‌ 5న ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి (రైతుబంధు) ఛైర్మన్‌గా నియమించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే రాజయ్య పదవిలో కొనసాగేవారు. ప్రభుత్వం రాకపోతే తన పదవి పోతుందని తెలుసు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగులను మారుస్తారనే టాక్‌ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వరంగల్‌ సీటును ఆశించారు. కానీ అది కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇస్తారని సమాచారం. అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. 


తెలంగాణ ఉద్యమ సమయంలో రాజయ్య కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2012లో రాష్ట్ర సాధనలో భాగస్వామి కావడం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై ఆరోపణలతో కేసీఆర్‌ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. 2018లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్న ఎన్నికల్లో ఆయనపై సర్పంచ్‌ నవ్వ చేసిన ఆరోపణ కారణంగా టికెట్‌ నిరాకరించారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం. ఆ పార్టీ నుంచి వరంగల్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజీనామా సందర్భంగా ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో తాను 15 ఏళ్ల పాటు పనిచేశానని, ఆ పార్టీలో ఉండే తాను తెలంగాణ కోసం కొట్లాడనని చెప్పుకొచ్చారు. అయితే రాజయ్య రాజీనామా ఊహించిందే!

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home