Tuesday 22 May 2012

పరకాలలో కిరణ్ పలుకులు ప్రమాద సంకేతాలే!
పరకాల వేదికగా తెలంగాణ ఉద్యమం పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తేలికగా తీసుకోరాదు. మొన్నటి సీమాంధ్ర లో ఓట్ల లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన కిరణ్ అండ్ కో బృందం యిప్పుడు తెలంగాణ గడ్డపై అవే పలుకులు పలుకుతున్నాయి.ఇదంతా పథకం ప్రకారమే జరుగుతున్నది. అంటే శ్రీ కృష్ణ కమిటీ రహస్య నివేదిక అమలవుతున్నది. సమయం దొరికినప్పుడల్లా కిరణ్ సర్కార్ తెలంగాణ ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నది. రెండున్నర సంవత్సరాలలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క స్థానం గెలవకపోయినా ఉద్యమ తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా తెలంగాణాలో టీఆర్ఎస్ బలంగా ఉన్నది. అట్లనే సీమాంధ్ర ప్రాంతంలో జగన్ ప్రభావం అంతే ఉన్నది. (ఈ మాట కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు) ఇప్పటి దాక జరిగిన ఎన్నికల్లో జయాపజయాలు కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికలని తప్పించుకున్నారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో అలాంటి చేదు అనుభవమే ఎదురైతే ప్రభుత్వ మనుగడ కష్టమే. అందుకే ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకే కాదు కిరణ్ సర్కార్ కు కత్తి మీద సాములా తయారయ్యాయి. జగన్ అక్రమాస్తుల కేసుపై ఉచ్చుబిగుస్తూనే.. తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్ముతున్నది. మీడియా, పొలిటికల్ మేనేజ్ మెంట్ ను అమలు చేస్తున్నది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది అసెంబ్లీ, ఒక్క పార్లమెంటు స్థానంలో ఉప ఎన్నికలు జరగనుండగా పరకాల ఎన్నికపైనే ఫోకస్ చేస్తుండడం విశేషం. అక్కడ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల ఉనికి లేకున్నా బిజెపి, టీఆర్ఎస్ ల మధ్య వచ్చిన భేధాభి ప్రాయలను సీమాంధ్ర మీడియా నొక్కి చెబుతున్నది. వైఎస్ నేతృత్వంలో బొటాబొటీ  మెజారిటీతో రెండో సారి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ  పాలనను అంపశయ్య పై సాగిస్తున్నది. వైఎస్ చనిపోయాక చోటుచేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి. జగన్ పై వస్తున్న అవినీతి ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకునే ప్రమాద ఉన్నది. అందుకే ఇటు తెలంగాణ, అటు జగన్ ప్రభావం తగ్గిస్తేనే కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుందని కాంగ్రెస్ పెద్దలు అభిప్రాయానికి వచ్చారు. ముందుగా అధికార పార్టీ నేతలను ఉద్యమానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. (చంద్రబాబు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్యలకే మద్దతు ఇస్తున్నారు) అందుకే తెలంగాణ కోసం ఇన్ని వేదికలు, ఇన్ని సంఘాలు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నే కార్నర్ చేస్తున్నారు. బీజేపి కూడా టీఆర్ఎస్ పై దాడి చేస్తుండడం గమనార్హం. టీఆర్ఎస్ ను బలహీన పరిస్తే తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేయవచ్చు అనేది దీని అంతర్యం. అందుకే కిరణ్ పరకాలలో తెలంగాణ నినాదం తాత్కాలికమే, అభివృద్దే శాశ్వతం అని వ్యాఖ్యానిస్తే దానిపై ఒక్క టీఆర్ఎస్ మాత్రమే స్పందించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది వాస్తవమే. అభివృద్ధి మాటల్లో కానీ చేతల్లో కాదనేది స్పష్టమే. కానీ పదే పదే అభివృద్ధి అని ఎందుకు చెబుతున్నారు. ఐదున్నర దశాబ్దాల ప్రజల ఆకాంక్షను ఎందుకు నిరాకరిస్తున్నారు? ఉప ఎన్నికల తరువాత తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతూనే ఉన్నారు. ప్రాంతీయ మండలి అంశం తెరమీదికి వస్తున్న సందర్భం. తెలంగాణ కోసం ఎంతటి త్యాగాల కైనా సిద్ధమే అన్న నేతలు పదవులు రాగానే అధిస్థానం ముందు జీ హుజూర్ అంటున్న వేళ.. ఈ నేతలు తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయనున్నారు. అందుకే చిత్తూరు బాబులు తెలంగాణ పై ఎంత అక్కసును వెళ్లగక్కుతున్నా మిన్నకుండి పోతున్నారు. ముఖ్యమంత్రి తో వేదికలు పంచుకోవడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఒక్క సీటు కోసం బీజేపి కూడా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నది. ఇది శత్రువుకు ఆయుధాన్ని అందించేదే కానీ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేది కాదు. ప్రాంతీయ పార్టీలు లేకుండా దశాబ్డంన్నర కాలంగా కేంద్రంలో జాతీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. అయినా జాతీయ పార్టీలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం అనే వింత వాదనలు చేస్తున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేదే. ఇవ్వాళ కిరణ్, చంద్రబాబులు చేస్తున్న తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారంటే తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ఈ సంఘాన్ని, ఏ వేదికను వాళ్ళు పరిగణనలో తీసుకోవడం లేదు. తెలంగాణ అంటే టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అని వారు ఒప్పుకుంటున్నారు. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ఈ కుట్ర ను  తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న పార్టీలు భాగస్వామ్య పార్టీలు, సంఘాలు తిప్పి కొట్టకుండా మౌనంగా ఉంటే అది తెలంగాణ ప్రజలు మరణ శాసనమే అవుతుంది!
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home