Monday 20 August 2012

ఊళ్లను మాయం చేస్తున్న ఉత్పత్తి



ఉత్తర తెలంగాణ అంటే మనకు గుర్తుకువచ్చేది సింగరేణి. పారిశ్రామిక ప్రాంతంగా పేరు పొందింది. సింగరేణి బొగ్గుబావుల్లో కార్మికుల కష్టంతో బయటికి వస్తున్న బొగ్గుతో ఉత్తరాది రాష్ట్రాలకు కరెంటు ఉత్పత్తి అవుతోంది. ఒకప్పువు 1,20,000 మందితో విలసిల్లిన సింగరేణి ఇప్పుడు ఆ సంఖ్య సగానికి తగ్గింది. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి వేటలో ఉపాధిపై వేటు వేస్తున్నది. సంస్కరణల పేరుతో కార్మిక కుటుంబాలను సమస్యల సుడిగుండంలోకి నెట్టివేస్తున్నది. ఇప్పుడు సింగరేణి ప్రాంతమంతా ఓపెన్‌కాస్టుల విధ్వంసం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాదు, మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ ప్రాంతంలో ఇంకో దశాబ్దం తర్వాత మనిషి నివసించడానికి అనువుగా ఉండదు అంటే అతిశయోక్తి కాదు.

సింగరేణి యాజమాన్యానికి తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిపై ఉన్న ప్రేమ అక్కడి స్థానిక ప్రజలపై లేదు. ముఖ్యంగా రామగుండం పరిసర ప్రాంతంలో దుమ్ము, ధూళితో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు శ్వాసకోస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికంతటికి కారణం ఓపెన్ కాస్టులే. భూగర్భ జలాలు ఇంకిపోయి సాగునీటికి, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి వెలికితీస్తున్న అధిక ఉత్పత్తే అభివృద్ధి అంటే ఎలా? స్థానిక నాయకత్వం కూడా చేష్టలుడిగి చూస్తోంది. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసి, మనిషి అస్తిత్వాన్నే కోల్పోయి, ఉపాధి లేక ఊళ్లను వదలిపోయేలా చేస్తున్నా ప్రజాప్రతినిధులు మౌనంగా ఉంటున్నారు. ఎవరి అభివృద్ధి కోసం ఎవరి జీవితాలను నాశనం చేస్తున్నారని ఏనాడూ ప్రశ్నించడం లేదు.

ఏ యేటికి ఆ యేడు ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూపోతూ కార్మికులపై అధిక భారాన్ని మోపుతున్నారు. సంస్థలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన కార్మికులు రిటైర్‌మెంట్ అయ్యాక పట్టుమని పదేళ్లు కూడా బతకడం లేదు. అంటే ఇంత కాలం పనిచేసే చోట వాళ్లు ఎంత కాలుష్య బారిన పడ్డారో అర్థమవుతుంది. పదవీవిరమణ పొందిన కార్మికులు తమ శేష జీవితాన్ని రోగాలతో నెట్టుకొస్తున్నారు. ఆ వయసులో వారి పిల్లలతో జ్ఞాపకాలు పంచుకోవాల్సిన వారు మందులతో మనుగడ సాధిస్తున్నారు. దేశాభివృద్ధికి పరిశ్రమలు ఎంత తోడ్పాటును అందిస్తాయో.. వాటివల్ల పర్యావరణం కూడా అంతే దెబ్బతింటున్నది. అందుకే ఏదేని పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరుతో చేపట్టబోయే కార్యక్రమాల వల్ల సంస్థకు వచ్చే ఆదాయంతో పాటు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలి. పర్యావరణం దెబ్బతినకుండా ఉత్తత్తి సాధించాలి. అక్కడ నివసిస్తున్న స్థానిక ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి. అంతేగానీ పచ్చని పల్లెలో కాలుష్యకుంపటి పెట్టేది అభివృద్ధి ఎంత మాత్రం కాదు.  ఇప్పటికైనా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వాలు తమ తాత్కాలిక ప్రయోజనాలకు పక్కనపెట్టి ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలి. లేకపోతే కొన్ని దశాబ్దాల తర్వాత ఉత్తర తెలంగాణ మొత్తం బొందల గడ్డగా మారే ప్రమాదం ఉంది. ప్రకృత్తి వనరుల ఉనికే లేకుండా చేసే ఉత్పత్తితో ఉపయోగం ఎవరికో ఆలోచించాలి. భావి తరాలకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత పాలకులు ఈ దిశగా కృషి చేయాలి.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home