Wednesday 25 July 2012

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిందెవరు?



సంస్కరణలు ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలగా మార్చింది చంద్రబాబు. ఆయన పెట్టుబడిదారులకు కిటికీలు తెరిస్తే, వైఎస్ ఏకంగా తలపులే తెరిచారు. ఇప్పుడు రాష్ట్రంలో కులవృత్తుల వర్గాలు ఎదుర్కొంటున్న అవస్థలన్నింటికీ బాబే కారణం. దానికి కొనసాగింపు వైఎస్. ఇరువురు కలిసి ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంలోకి నెట్టారు. పైగా ఇప్పుడు ఒకరు బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే, మరొకరు మహానేత సువర్ణయుగ పాలనను అందిస్తామని వాగ్దానాలు గుప్పిస్తున్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి, పార్టీల మనుగడ అస్తిత్వంలో పడ్డప్పుడే రాజకీయ పార్టీలకు సంక్షేమం అనే మాట గుర్తుకు వస్తుంది. అధికారం కోసం ప్రజలు అడగని, ఆచరణలో సాధ్యం కాని ఎన్నో హామీలను గుప్పిస్తారు. ఏరుదాటినంక తెప్ప తగలేయడం రాజకీయ పార్టీలకు వెన్నెతో పెట్టిన విద్యే.  సరిగ్గా ఇప్పుడు అదే పని టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ అధినాయకత్వాలు చేస్తున్నాయి. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన ఈ ఘనులే నేత కార్మికుల కోసం దీక్షల పేరుతో దండయాత్రలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సమైక్య పార్టీల నేతలు దాన్ని అడ్డుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలో భాగంగానే  సిరిసిల్ల పర్యటనను చూడాలి. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయాయని వస్తున్న వార్తలు దీన్ని దృవీకరిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కిరణ్ విజయమ్మ పర్యటన విజయవంతం కావడానికి తన వంత సహకారం అందించారు. అందుకే హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వరకు ఈ ప్రాంత ప్రజలపై దమనకాండ చేయించారు. ఇంత చేసినా విజయమ్మ చేనేత దీక్ష అట్టర్ ప్లాప్ అయ్యింది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సభా వేదికను కాపాడుకోవడానికే నానా పాట్లు పడ్డారు. అట్లనే చేనేత సమస్యల గురించి దీక్ష చేయడానికి వచ్చిన విజయమ్మ తన ప్రసంగంలో జౌలు పరిశ్రమ అని పదే పదే పలికారు. అంటే చేనేతకు జౌళి పరిశ్రమకు ఉన్న తేడా ఏమిటో తెలియని స్థితిలో ఉన్నారు వైఎస్‌ఆర్‌సీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఎవరో రాసి ఇచ్చిన స్పీచ్‌ను చదివి అభాసు పాలయ్యారు.

అయితే సిరిసిల్ల ఉరిసిల్లగా మారడానికి కారణం ఎవరు? సీమాంధ్ర పాలకుల వల్లే అన్నది జగమెరిగిన సత్యం. 1997-2003 వరకు బాబు హయాంలో 127 మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాజన్న పాలనలో 215 మంది చనిపోయారు.  ఇవి కాకిలెక్కలు కావు..! అధికారిక గణాంకాలు..!  వైఎస్ జమానాలో సిరిసిల్లలో చోటుచేసుకున్న మరణమృదంగాలు..! నాటి వస్త్ర సంక్షోభం దెబ్బకు కార్మికులంతా ఒకరితర్వాత ఒకరు పిట్టల్లా రాలిపోయారు.  కనీసం వారిని  వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పరామర్శించలేదు. ఆత్మహత్యలకు పాల్పడ్డ బాధిత కుటుంబాలను అదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నామని 2006లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ ప్రకటించారు. ఇందుకోసం జీవో 46ను విడుదల చేశారు.అయితే పరిహారం ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు  విధించారు. దీంతో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దానికి సవరణగా 114జీవోను జారీ చేశారు. అయినా బాధిత కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనం. అధికారుల లెక్కల ప్రకారం, జిల్లాలో 1997- 2012 జూన్ వరకు 375 మంది చనిపోయారు. వీటిపై పై పరిశీలన జరిగింది. ఆయా నిబంధనల ప్రకారం 14 మంది మాత్రమే పరిహారం ప్యాకేజీకి అర్హులని అధికారులు తేల్చారు. మిగిలిన దరఖాస్తులను తిరస్కరించారు. ఏడు దరఖాస్తులు నేటికీ పరిశీలనలో ఉన్నాయి. అంటే చనిపోయిన వారిలో సగం కుటుంబాలకు కూడా పరిహారం అందలేదు . దీనికి వైఎస్ హయాంలో ఇచ్చిన జీవోల్లోని అడ్డగోలు నిబంధనలే కారణం. 2007-0 మధ్య కాలంలో సిరిసిల్లలో వరుస ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. నేతన్నల ఆత్మహత్యలపై దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రతిపక్షాలు విమర్శలతో సార్వత్రిక  ఎన్నికలు దగ్గర పడడంతో వైఎస్ హుటాహుటిన 200 అక్టోబర్ 12న సిరిసిల్ల నడిబొడ్డున బహిరంగ సభ పెట్టారు. ఏ ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించకుండా దాన్ని ఎన్నికల సభగా మార్చివేశారు. ‘కార్మికులారా.. మీకు అండగా ఉంటాం, ఆత్మహత్యలు వద్దు..’ అన్నారు. సిరిసిల్లను స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా మారుస్తామన్నారు. మరమగ్గాలపై తయారైన వస్త్రాల మార్కెటింగ్ కోసం సిరిసిల్లలో సకలసౌకర్యాలు కల్పిస్తామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలే నేరుగా వస్త్రాలు కొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. అప్పరెల్ పార్కు ఏర్పాటుకూ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 50 శాతం సబ్సీడీని 75 శాతానికి పెంచుతామనీ, వృద్ధ కార్మికుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామంటూ ఊదరగొట్టారు. ఇంకా ఎన్నోన్నో హామీలు గుప్పించారు. ఇందులో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఎన్నికల్లో గెలిచాక కనీసం రుణమాఫీని కూడా వర్తింపజేసిన పాపాన పోలేదు.

కానీ ఆయన వారసురాలిగా విజయమ్మ మాత్రం చేనేత సమస్యలపై  జగన్ బాబు దీక్ష చేయమన్నారని సభావేదిక చెప్పడం హాస్యాస్పదం. రాజన్న పాలన త్వరలో వస్తుందని వైఎస్‌ఆర్‌సీపీ అంటుంటే జనం నవ్వుకుంటున్నారు. బాబు, వైఎస్‌ల వల్లే రాష్ట్రం యాభై ఏళ్లు వెనక్కిపోయింది. వారివురు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టినా కేవలం అది ప్రజలను మభ్య పెట్టేడానికే! అంతర్గతంగా ఇద్దరూ తెలంగాణ వ్యతిరేకులే. అందుకే ఎన్డీఏ హయాంలో బాబు, యూపీఏ హయాంలో వైఎస్ తెలంగాణ రాకుండా అడ్డుపడ్డారనేది విదితమే. వైఎస్ ఆశయాలు నెరవేరుస్తానని హామీ ఇస్తున్న జగన్ మిగతా వాటి సంగతి ఏమో కానీ తెలంగాణపై తండ్రి అక్కసునే పార్లమెంటులో జగన్ ప్రతిబింబించాడు. అందుకే మానుకోట ప్రజలు ఆయన ఓదార్పు యాత్రపై ధిక్కార స్వరం వినిపించారు. ఈ గడ్డపై కాలుపమోపకుండా అడ్డకున్నారు. మానుకోటలో జగన్ కోసం ఈ ప్రాంత ప్రజల రక్తాని చవిచూసిన కొండా దంపతులకు పరకాల పరాజయాన్ని కానుకగా అందించారు. అయినా వారు సిరిసిల్లలో గొంతు చించుకుని ఆరిచారు. చేనేత సమస్యలను గాలికి వదిలేసి టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. సీమాంధ్ర నేతల వైఖరి ఎలా ఉంటుంది అంటే కత్తి వారిదే అయినా పొడిచేది మాత్రం మనోడే. ఇలాంటి రాజకీయ బానిసలు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీల్లో ఉండబట్టే తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కోసం పదిహేడు మంది రాజీనామా చేస్తే, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన దాదాపు పదిహేను వందల మంది ఆకాంక్ష కోసం ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు పట్టుమని పది మంది కూడా రాజీనామా చేయలేదు. పైగా తెలంగాణ ఉద్యమ నాయకత్వంపైనే విమర్శలు చేస్తారు. ఈ పరాన్న జీవులున్నంత కాలం ఈ ప్రాంత ప్రజలకు లాఠీల, తూటాల దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఈ ప్రాంత అస్తిత్వం పై ఆధిపత్యం చెలాయిస్తున్న సీమాంధ్ర గూండాగిరి ని అడ్డుకుంటేనే మన ఆకాంక్ష నెరవేరుతుంది. అందుకు మనకు కావలసింది రహెమున్నిసా చూపిన తెగువే ఆదర్శం.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home