Saturday 16 June 2012

పరకాల చెప్పిన పాఠాలు

టీఆర్‌ఎస్‌: స్వల్ప మెజారిటీతో పరకాలలో విజయం సాధించింది. ఇది తెలంగాణ ప్రజల ఉద్యమ చైతన్యానికి నిదర్శనం. పరకాల ప్రజల పరిణతికి అద్దం పడుతున్నది. పాలమూరు పరాజయం తర్వాత కొంత ఆలస్యంగానైనా మేల్కొన్నది. తెలంగాణ ఉద్యమ వారసత్వ నాయకత్వం పరకాల ప్రజలు టీఆర్‌ఎస్‌లో పెట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేలా కార్యాచరణ రూపొందించాలి. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి అన్ని ఓట్లు సాధించడం విశేషమే. పరకాలలో కొండా దంపతులకు గట్టి పట్టున్న నియోజకవర్గం. ఇరవై వేల మెజారిటీ వస్త్తుందన్న టీఆర్‌ఎస్‌ ఈ స్వల్ప మెజారిటీపై సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేతలు వివిధ పార్టీలలో ఉన్నారు. వారందని ఏకతాటిపైకి తెచ్చి వారిని కూడా ఉద్యమంలో భాగస్వామ్యంలో చేయాల్సిన బాధ్యత కూడా టీఆర్‌ఎస్‌, జేఏసీలపై ఉన్నది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పిన పార్టీలకు తెలంగాణలో స్థానం లేకుంటా చేయాలంటే ఐక్యంగా నడవాల్సిన సమయం ఇది.
 వైఎస్‌ఆర్‌సీపీః పరకాలలో నియోజకవర్గంలో పదిహేను ఏళ్లుగా తమ ప్రాబల్యం నిలుపుకుంటూ వస్తున్న కొండా దంపతులు తెలంగాణ వాదం ముందు చితికిల పడ్డారు. గెలిచిన అభ్యర్థి ఫలితాలు చూపుతాడు, ఓడిన అభ్యర్థి కారణాలు చెబుతాడు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమే. కానీ తెలంగాణపై 2009 డిసెంబర్‌ 9 ప్రకటన తర్వాత ఈ ప్రాంతంలో పరిస్థితులు మారిపోయాయి. 2004 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో మహామహులు కూడా తెలంగాణ వాదం ముందు నిలవలేకపోయారు. ఈ విషయం కొండా దంపతులకు తెలుసు. కొండా సురేఖ అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యారు. కానీ ఆమె తెలంగాణ కోసం నేను రాజీనామా చేశానని బుకాయించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ మాటకు కట్టుబడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. కానీ పరకాల గడ్డమీద వైఎస్‌ఆర్‌ను పొగుడుతూ.. తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డు పట్టిన జగన్‌ను ముఖ్యమంత్రి చేస్తానని సురేఖ ప్రకటించారు. ఇది సగటు తెలంగాణవాదికి మింగుడు పడని అంశం. తెలంగాణ ఇచ్చే, తెచ్చే శక్తి తమకు లేదని తప్పించుకుంటే మునుముందు కూడా వైఎస్‌ఆర్‌సీపీ ఇలాంటి ప్రతికూల పవనాలనే ఎదురుకోవాల్సి వస్తుంది.
 టీడీపీః పరకాలలో టీడీపీకి డిపాజిట్‌ దక్కినప్పకీ, దీనితోనే మేము సరిపెట్టుకుంటామంటే చెప్పేది ఏమీ ఉండదు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, నేను ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని చంద్రబాబు పరకాల ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అయినా తెలంగాణ ప్రజలు టీడీపీనీ ఎందుకు విశ్వసించడం లేదో ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. రెండు కండ్ల సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న ఆ పార్టీ ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో మూడో స్థానానికి పరిమితమైంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే ఆ పార్టీ మనుగడ కష్టమే అన్నది సుస్పష్టమే. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే చాలామంది నేతలు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణపై తేల్చాల్సింది కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పి తప్పించుకోవాలనుకుంటే తెలంగాణ తమ్ముళ్లు మునుముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ ఫోరం చంద్రబాబుతో స్పష్టమైన ప్రకటన చేయిస్తే తప్ప, తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని పొందలేరు. వారు డిపాజిట్ల కోసమే ఎన్నికల్లో పోటీచేయాల్సి ఉంటుంది.
 బీజేపీః పాలమూరులో విజయం సాధించిన తర్వాత ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. కానీ పాలమూరుకు పరకాలకు మధ్య చాలా తేడా ఉన్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించలేకపోయారు. తెలంగాణ జాతీయ పార్టీలతోనే సాధ్యమంటున్న ఆ పార్టీకి పాలమూరులో ఎందుకు పట్టం కట్టారో? పరకాల ప్రజలు డిపాజిట్‌ దక్కకుండా ఎందుక చేశారో ఆ పార్టీ నేతలు విశ్వసించాలి. నిజానికి బీజేపీ పరకాలలో తాజా మాజీ ఎమ్మెల్యేపై కాకుండా కేవలం టీఆర్‌ఎస్‌ను నిలువరించాలనే ఉద్దేశంతో పోటీ చేసినట్టు కనిపించింది. అందుకే ఆ పార్టీకి పరకాల ప్రజలు వారి చేయాల్సింది చాలా ఉందని మార్గనిర్దేశనం చేశారు. ఇవ్వా తెలంగాణ ఉద్యమంలో కుల, మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొంటున్నారు. కానీ బీజేపీ పాలమూరు గెలవాడనికి ఏం చేసింది మనకు తెలిసిందే. ఆ వ్యూహాన్ని పరకాల ప్రజలు తిప్పికొట్టారు. కాబట్టి బీజేపీ ఇప్పటికైనా కాకినాడ తీర్మానానికి కట్టుబడి ఒక ఓటు రెండు రాష్ట్రాలు నినాదాన్ని తెలంగాణతో పాటు ఆంధ్రలో అమలు చేయాలి. అలా కాకుండా సీమాంధ్రలో 17 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరిగినా బీజేపీ అక్కడ దృష్టి పెట్టకుండా కేవలం పరకాలలోనే పాగా వేయడాన్ని ప్రజలు గమనించారు. తమది జాతీయ పార్టీ అని చెప్పుకునే వారు ఈ ఫలితంపై లోతైన విశ్లేషణ చేసుకుని తెలంగాణపై కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఆ పార్టీపై ఉన్నది.
 కాంగ్రెస్‌: తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామేనని ఎన్ని మాయ మాటలు చెప్పినా ఆ పార్టీకి రెండున్నర ఏళ్లుగా తెలంగాణ ప్రాంతంలో పరాభవమే ఎదురవుతున్నది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వమని చెప్పుకుంటూ వస్తున్న ఆ పార్టీ నేతలు కిరణ్‌కుమార్‌ రెడ్డి పరకాల ప్రచారంలో తెలంగాణ కంటే అభివృద్ధే ముఖ్యమన్న వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు. టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసినప్పుడు శాసనసభ్యుల్లో నలభై మంది దానిపై గట్టిగా నిలబడి ఉండి ఉంటే ఇవ్వాళ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష సాకారమయ్యేది. కానీ వారు సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారనే భావన ఈ ప్రాంతంలో బలంగా ఉన్నది. తెలంగాణపై ఐదున్నర దశాబ్దాలుగా కమిటీలు, కమిషన్లు, పెద్ద మనుషుల ఒప్పందాల పేరుతో కాలయాప చేస్తున్నది ఆ పార్టీ. తెలంగాణపై పూటకో మాట మాట్లాడుతూ ఇరు ప్రాంతాల ప్రజల్లో వైరుధ్యాలు పెంచి లబ్ధి పొందాలని చూస్తున్నది కాంగ్రెస్‌ పార్టీ. అయినా తమ అధిష్ఠానంపై ఇంకా తమకు నమ్మకం ఉన్నదని అంటున్న టీ కాంగ్రెస్‌ నేతలు పరకాలలో డిపాజిట్‌ దక్కకపోగా, ఐదో స్థానానికి దిగజారిపోవడంపై ఆలోచించుకోవాలి. ఈ సమస్యను ఇంకా నానిస్తే వారికే నష్టం అన్నది గుర్తించాలి. డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలే ఒత్తిడి తేవాలి.
 జేఏసీః పరకాలలో తెలంగాణవాదం గెలవడానికి జేఏసీ కూడా తన వంతు పాత్ర పోషించినందుకు ముదావహం. కానీ ఇది సరిపోదు. రాజకీయ పార్టీలకు ఓట్లు, సీట్లే ముఖ్యం. కానీ జేఏసీ రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తూనే... తెలంగాణవాదులను ఐక్యం చేసి, ఉద్యమాన్ని ముందుకు తీసుకునిపోవాలి. గమ్యాన్ని ముద్దాడే క్రమంలో తెలంగాణ కావాలనుకునే ప్రతివ్యక్తిని కలుపుకుని పోవాల్సిన బాధ్యత జేఏసీ పై ఉన్నది. పాలమూరు, పరకాల ఎన్నికల సందర్భంగా జేఏసీ భాగస్వామ్య పక్షాల్లో వచ్చిన విభేదాలు ఉద్యమానికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని తెలంగాణవాదులు భయడ్డారు. అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home