Friday 25 May 2012

మొన్నముప్ఫై ఎనిమిది.. నేడు ఎనభై.. రేపు వంద!
యూపీఏ -2 సర్కార్ మూడో వార్షికోత్సవ జరుపుకున్న తెల్లారే ప్రజల నెత్తిపై పెట్రో మంట పెట్టింది. 2011-12 మూడు సార్లు పెట్రో ధరలు పెంచి ఆమ్ ఆద్మీ అంటే ఏమిటో సామాన్యునికి అర్థమయ్యేలా చేసింది. ప్రజల కష్టాల సంగతేమో గానీ కార్పొరేట్ వ్యవస్థను మాత్రం కంటికి రెప్పల కాపాడుతోంది మన్మోహన్ సర్కార్. సామాన్యుల ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని యూపీఏ -2 ప్రభుత్వం వాగ్దానం చేసింది. మూడేళ్ళ కిందట ప్రజలకు ఇచ్చిన ఆ హామీలన్నీ శుష్క వాగ్దానలే అని తేటతెల్లమైంది. మన్మోహన్, అహ్లువాలియాల మాయాజాలానికి సామాన్యులే సమిదలవుతున్నారు. యూపీఏ ఎనిమిదేళ్ళ పాలనలో సామాన్యులు మోయలేని విధంగా ఎడాపెడా పన్నులు పెంచేసింది.మన్మోహన్ అండ్ కో లకు అమెరికాతో చేసుకునే అణు ఒప్పందం మీద ఉన్న ప్రేమ పేదల అవస్థలపై లేదు. అందుకే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం నుంచి ఇంకా దిగిరాలేదు. కానీ ఈ ఇప్పటికి ఈ ఏలికలు పెరిగిన ధరల తగ్గించడమే తమ ముందున్న లక్ష్యమని పునరుద్ఘాటిస్తున్నారు. 2004 లో 38 రూపాయలు ఉన్న  లీటరు పెట్రోల్ ధరను ఈ ఎనిమిదేళ్ళలో 80 రూపాయలకు పెంచిన ఘనులు ఈ దేశ ప్రధాని పీఠంపై కూరుచున్న బ్యురోకాట్లు. యూపీఏ పాలకులు చెబుతున్న ప్రగతి.. ప్రజలు పడుతున్న పాట్లకు పొంతన కుదరడం లేదు. యూపీఏ పెద్దలు అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే చూస్తున్నారు కానీ ప్రజల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తుచ తప్పకుండ అమలుచేస్తున్నది. పెట్రోధరల పెంపు వల్ల కేంద్రానికి ఏట వ్యాట్ రూపంలో దాదాపు 309 కోట్ల ఆదాయం రానున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాట్ శాతాన్ని కొంత తగ్గిస్తే ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుంది. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మకం పన్ను తగ్గిస్తే ప్రజకు కొంత భారం తగ్గుతుందని వాత పెట్టిన కేంద్రమే వెన్న పూయాలని రాష్ట్రాలకు సూచించింది. దీనిపై ఉత్తరాఖండ్ రాష్ట్రం 25 వ్యాట్ తగ్గించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించినా కిరణ్ సర్కార్ మాత్రం దీనిపై స్పందించడం లేదు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలతో పాటు యూపీఏ భాగస్వామ్య పక్షాలు తప్పుపడుతున్నాయి. యూపీఏలో ప్రధాన భాగస్వామ్య పక్షం తృణమూల్ ఈ చర్యను తీవ్రంగా నిరసిస్తున్నా ఈ సాకుతో సర్కారును కూలదోయమని ప్రకటించింది. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో ఈ సమయానికి ఏమి జరుగునో అని కాంగ్రెస్ పెద్దలు యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ చీఫ్ ములాయంను కాకా పట్టే పనిలో ఉన్నారు. పెంచిన పెట్రో ధరలను ములాయం మూడేళ్ళ  యూపీఏ-2  ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కనుక అని వ్యంగ్యంగా అభివర్ణించారు. అయితే కేంద్రంలో రెండో దఫా అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కుంభ కోణాలు వెలుగు చూస్తున్నాయి. యూపీఏ మొదటి దఫా అప్పుడు అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఎస్పీ కావడం గమనార్హం. అప్పుడు కేంద్రానికి మద్దతు విషయంలో కీలక పాత్ర పోషించిన అమర్ సింగ్ పరిస్థితి ఏమిటో విదితమే. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ.. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటూ .. అవసరం తీరగానే వాటిని పక్కన పెట్టడంలో కాంగ్రెస్ పెద్దలు అన్ని పార్టీల కంటే ఎప్పుడు ముందుంటారు.అందుకే ఈ ఎనిమిదేళ్ళలో యూపీఏ భాగస్వామ్య పక్షాలు మారాయి. కానీ ప్రజల బాధలు మాత్రం తీరలేదు. తీరవు కూడా. పెట్రో ధరలు  మొన్నముప్ఫై ఎనిమిది.. నేడు ఎనభై.. రేపు వంద అయినా ఆశ్చర్యపోనక్కర లేదు .
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home