Sunday 1 July 2012

సంక్షేమాన్ని మింగుతున్న సంక్షోభం!



మాయా మోహన జాలం. ఇది మన్మోహన్, మాంటెక్ సింగ్‌ల కాలం. సంస్కరణల పేరుతో వీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో కూరుకుపోతున్నారు. వీరి పాటలకు ఆటలాడుతున్నది రాష్ట్ర సర్కారు. దేశంలో ఇప్పటికీ నలభై కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఆకలేస్తే ఆకాశం వైపు చూసే అభాగ్యులు,  దాహం వేస్తే నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచే నిరుపేదలు కోట్లాది మంది ఉన్నారు. వీరి సమస్యలు ఏవీ ఈ కార్పొరేట్ పాలకులకు పట్టడం లేదు. దేశంలో కొంత కాలంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూపాయి రోజురోజుకు  పతనమవుతున్నది. యూరప్ దేశాల్లో తలెత్తిన సంక్షోభం మునుముందు మన దేశాన్ని చుట్టుముట్టినా ఆశ్చర్యం లేదు. మన ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఆపదేమి లేదని మన్మోహన్, మాంటెక్‌సింగ్, ప్రణబ్ ముఖర్జీ, రంగరాజన్‌లు ప్రకటిస్తున్నా.. ముంచుకొచ్చే ముప్పును మాత్రం వీరు తప్పించలేరు. మన దేశంలో డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.  వీరి సంక్షేమం, సమస్యల గురించి మన్మోహన్ అండ్ కో ఆలోచించరు. వ్యవసాయానికి ఎలాంటి ప్రోత్సాహం అందించారు.   ఆ మధ్య సుప్రీంకోర్టు గోదాముల్లో పేరుకుపోయిన ఆహారనిల్వలను ప్రజల కోసం వినియోగించాలని సూచిస్తే కుదరన్నారు మన మన్మోహన్. ఇవాళ దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆకలి చావులు నమోదవుతున్నాయి. వీటిని పూర్తిగా నివారించకున్నా... అందుకోసం కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదు. మార్కెట్ శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న మన్మోహనుడికి మనుషుల గురించి మానవత్వం గురించి ఎందుకు?

మన్మోహన్ సర్కార్ నిర్ణయాల వల్ల పేదల బతుకు బాగుపడకపోగా, మరింత భారంగా తయారయ్యాయి. కానీ యూపీఏ సర్కార్ ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తామంటోంది. దీనికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక చట్టం చేయడమే మిగిలింది.  అయితే అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ద్రవ్యలోటును తగ్గించుకోవాలని సూచించింది. ద్రవ్యలోటు తగ్గాలంటే ప్రభుత్వ అందిస్తున్న సబ్సిడీ లను తగ్గించాలి లేదా పూర్తిగా  తప్పుకోవాలి. దీన్ని మన ఏలికలు అమలు చేయాలని చూస్తున్నారు. కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ వ్యయాన్ని  జీడీపీలో రెండు శాతం, వేచ్చే ఆర్థిక సంవత్సరం 1.7 శాతం దిగువస్థాయికి తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరి ఈ సమయంలో ప్రజల సంక్షేమం గురించి ఇక ప్రభుత్వాలు ఎందుకు ఆలోచిస్తాయి? అందుకే మన్మోహన్ కాలంలో మన బతుకులకు భద్రత లేదు. ఉండదు కూడా. ముఖ్యంగా రాజ్యాంగం ప్రకారం ప్రజలకు అందించే మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం నుంచి తప్పుకోవాలనుకుంటున్నది. ఇందులో భాగంగానే కార్పొరేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ పాఠశాలలకు ద్వారాలు తెరుస్తున్నది. యిప్పుడు మన దేశం ఎదురుకుంటున్న ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రెండు లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రధాని ఈ మధ్యే ప్రకటించారు. అయితే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులన్నీకార్పోరేట్ వ్యవస్థకు కాసులు కురుపించేవే కానీ కామన్ మ్యాన్ కష్టాలు తీర్చేవి కావు. ఇదే ఈ ఎనిమిదేళ్ళలో మన్మోహన్ సర్కార్ సాధించిన మానవాభివృద్ధి. అందుకే ఆఫ్రికా ఖండంలోని చిన్న దేశాల్లో నివసిస్తున్న ప్రజా జీవన ప్రమాణం మన దేశ పౌరుల కంటే మెరుగ్గా ఉన్నది. 

పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోల్లో వారు అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, ప్రణాళికలను పొందుపరుస్తాయి. ఈ దేశంలో వాటిని తు.చ. తప్పకుండా అమలు చేస్తారని ఎవరూ భావించడం లేదు. కానీ ప్రజలకు పట్టెడు అన్నం అందించే పథకాలు కావాలని కోరుకుంటున్నారు. పారదర్శకమైన పాలనను ఆశిస్తున్నారు. అయితే ఇలాంటి మాటలు మనం మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికి తప్ప ఆచరణలో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉన్నది. బహుశా అప్పటి వరకు ఈ దేశ ప్రజలు సంక్షేమం, సబ్సిడీ అనే మాటలు మరిచిపోవలసిందే.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home