Sunday 1 July 2012

మట్టి మనుషుల విజయం


తెలంగాణ ఉద్యమంలో మరో మైలురాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెరాస అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)  విజయం సాధించింది.విశేషం ఏమంటే పోటీలో మిగిలిన సంఘాలతో పోలిస్తే టీబీజీకేఎస్ అంత పటిష్టమైన నాయకత్వ నిర్మాణం లేదు. అయినా తెలంగాణవదనికే పట్టం కట్టారు కార్మికులు. కోల్ బెల్ట్ ప్రాంతంలో  ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందునుంచే తెలంగాణ వాదం బలంగా ఉన్నది. 1969 తెలంగాణ ఉద్యమంలో గని కార్మికులు ప్రధాన పాత్ర పోషించారు. దశాబ్దకాలంగా ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న పోరులోనూ వీరు అగ్రభాగానే ఉంటూ వస్తున్నారు. అందుకే  స్వరాష్ట్రం కోసం చారిత్రక సకల జనుల సమ్మెలో పాల్గొని  ఉద్యమానికి ఊపు అందించారు సింగరేణి కార్మికులు. దశాబ్దాల తరబడి సింగరేణిలో ఆంధ్ర అధికారుల ఆధిపత్యాన్ని ఎదిరించిన సందర్భం అది. సమ్మె సమయంలో కార్మికులు చూపిన ఉద్యమ స్ఫూర్తి అభినందనీయం, ఆదర్శనీయం. వలస పాలకుల, అధికారుల కుట్రలను తిప్పికొట్టి తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలేల చేశారు ఈ భూమి పుత్రులు.సింగరేణిలో  నూతన పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిన తరువాత ఉద్యోగులపై పని భారం పెరిగింది. ఉత్పత్తి వేటలో ఉపాధి పై వేటు వేసింది సింగరేణి యాజమాన్యం.1998 నుంచి   ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా పనిచేసిన చంద్రబాబు హయంలో దేశంలో ఎక్కడలేని గుర్తింపు సంఘం ఎన్నికలను సింగరేణిలో ప్రవేశపెట్టారు. దీని వెనుక బాబు కుట్ర దాగి ఉంది. అప్పటి వరకు సింగరేణిలో డెబ్బై పై చిలుకు సంఘాలు పనిచేస్తూ ఉండేవి. అనేక పోరాటాల ద్వారా కార్మికులు తమ హక్కులు సాధించుకున్నారు. దీంతో సింగరేణిలో సంస్కరణలు అమలు చేయాలంటే కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని బాబు భావించాడు. దీనికి జాతీయ కార్మిక సంఘాలు కూడా పరోక్షంగా సహకరించాయి. సింగరేణిలో పనిచేసే 1,20,000 వరకు ఉండేవారు.  గుర్తింపు సంఘం ఎన్నికల వరకు ఆ సంఖ్య 96,000 కు పడిపోయింది. అప్పటినుంచి సింగరేణిలో ప్రవేశ పెట్టిన నూతన విధానాల్లో భాగంగా సంస్థలో వీ ఆర్ ఎస్ పేరుతో, మస్టర్ల పేరుతో కార్మికుల సంఖ్యను 63,000 కు కుదించారు. ఇదీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అదేసమయంలో 98 వరకు సింగరేణిలో ముప్పై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగేది. అది నేడు 52 మిలియన్ టన్నులకు చేరింది. సమ్మె కాలంలో కూడా కార్మికులు ఈ ఏడాది సంస్థ నిర్ణయించిన ఉత్పత్తి లక్ష్యాన్ని వారం రోజుల ముందుగానే సాధించారు. ఒకవైపు స్వరాష్ట్రం కోసం ఉద్యమిస్తూనే సంస్థకు లాభాల పండిచారు. సింగరేణి యాజమాన్యం  ఏటేటా ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ కార్మికులను కష్టాల పాలు చేసినా సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు. సింగరేణి సాధించిన లాభాలు ఆ ప్రాంత ప్రగతికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. పారిశ్రామిక ప్రాంత ప్రాంతాల్లో ఆ సంస్థలు గడించే లాభాల్లో కొంత భాగాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలనే నిబంధనలు తుంగలో తొక్కారు ఆంధ్ర అధికారులు. ఈ రెండున్నర ఏళ్ల తెలంగాణ ఉద్యమం ఏటికి ఎదురీదింది. అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది. అయినా నాలుగున్నర కోట్ల ప్రజానీకం ఆత్మవిశ్వాసం సన్నగిల్ల లేదు. వలస పాలకుల కుట్రలను, తెలంగాణ ఉద్యమ ద్రోహులను తిప్పికొట్టారు. జాతీయ పార్టీలతోనే తెలంగాణ వస్తుందన్న వాదనలు పరకాల ఎన్నికల్లో పటాపంచలయ్యాయి. ఆయా పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారు ఈ ప్రాంత ప్రజలు. ప్రాంతీయ స్పృహ లేని పార్టీలను పాతర పెట్టారు. అదే చైతన్యం బొగ్గు బావుల్లోను వెల్లివిరిసింది. అందుకే జాతీయ సంఘాలను కాదని స్థానిక సంఘాలకు పట్టం కట్టారు. ఈ ప్రాంత పర్యావరణాన్ని, జీవన విధ్వంసాన్ని అడ్డుకోకుండా సింగరేణి సంస్థ యాజమాన్యంతో సాగిలాపడిన సంఘాలకు గుణపాటం నేర్పారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్నిగెలిపించుకొని తమ ఆకాంక్షను మరోసారి తెలియజేశారు కార్మికులు. నిజంగా ఈ విజయం ఈ ప్రాంత మట్టి మనుషుల విజయమే. యిప్పుడు గెలిచిన గుర్తింపు సంఘం గత సంఘాలు చేసిన చారిత్రక తప్పిదాలు చేయకుండా.. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలి. వారి హక్కులను కాపాడాలి. ఆ ప్రాంత ప్రజల జీవన భద్రతకు భరోసా ఇవ్వాలి. పచ్చని పంటపొలాలను, పచ్చని బతుకుల్లో చిచ్చు పెడుతున్న ఓపెన్ కాస్ట్ లను వ్యతిరేకించాలి.సింగరేణిని కాపాడుకోవాలి. డిపెండెంట్ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలి.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home