Saturday 17 November 2012

తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే!



తెలంగాణ ప్రజలకు ఇప్పుడు పరీక్షా సమయం. ఎందుకంటే రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం కొంతకాలంగా చూస్తున్నాం. ఇంతకీ ఎవరు ఎవరితో లాలూచీ పడ్డారు? పడుతున్నారు అనేది సమస్య. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. టీడీపీ తెలంగాణపై తేల్చడానికి వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానికి లేఖ రాసింది. దీన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాయలసీమ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో జంప్ అయ్యారు. నిజానికి వాళ్లు పార్టీని వీడడానికి, బాబు తెలంగాణపై ప్రధానికి లేఖ రాయడానికి సంబంధం లేదు. కానీ దీన్ని సాకుగా చూపి వాళ్లు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. అంటే వారి ఉద్దేశ్యం ఏమిటి? వైఎస్‌ఆర్‌సీపీ సమైక్యవాదానికే మొగ్గుచూపుతున్నదని దాని అర్థం. కానీ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చెబుతున్నదేమిటి? మేం తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నాం. అందుకే తెలంగాణలో జరిగిన గత ఉప ఎన్నికల సమయంలో మేం పోటీ పెట్టలేదు అంటున్నది. కానీ అప్పుడు ఆ పార్టీ పోటీ పెట్టి ఉంటే కాంగ్రెస్, టీడీపీలకు ఎదురైన చేదు అనుభవానికి భిన్నంగా ఏమీ ఉండేది కాదు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి మంత్రమే జపిస్తున్నాయి. కానీ ప్రజల ఆకాంక్ష గురించి మాట్లాడడం లేదు. దానిపై డిమాండ్ చేయడం లేదు. అధికార పార్టీకి చెందిన కొంత మంది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం నినదిస్తున్నా.. అన్నీ వారి అధిష్ఠానం కనుసన్నల్లోనే జరుగుతున్నది. ఇక తెలంగాణ టీడీపీ నేతలు అయితే టీఆర్‌ఎస్, ఉద్యమ నాయకత్వాన్ని తిట్టడమే ఉద్యమమని అనుకుంటున్నారు.

మూడేళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ పదవులను వదులుకోవడం లేదు. వీరికి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక కార్యాచరణ అంటూ ఏదీ లేదు. కాంగ్రెస్ నేతలది ఢిల్లీ చక్కర్లు, లేఖల ఉద్యమాలైతే.. టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారు. పైగా తెలంగాణ కోసం రాజీనామా చేసిన చోట్ల పోటీకి కూడా దిగారు. అదేమంటే ఒకరు తమది జాతీయ పార్టీ కాబట్టి పోటీకి దిగకపోతే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయి అంటారు. టీడీపీ కాంగ్రెస్ పోటీలో ఉన్నది కాబట్టి తామూ కూడా పోటీ పెడుతున్నట్టు చెబుతుంది. ఒక పార్టీ కాలయాపనతో కాలం వెళ్లదీస్తుంటే.. మరొక పార్టీ కబుర్లతో కాలక్షేపం చేస్తున్నది. ఇక టీడీపీ అంటున్న అఖిలపక్షం ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే ఇటీవలే కేంద్ర హోం మంత్రి తెలంగాణపై చర్చలు పూర్తయ్యాయి. అవసరమనుకుంటే అఖిలపక్షం పెడతామన్నారు. దీనికంటే ముందు టీడీపీ అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయాలని పట్టుబట్టాలి. నిజంగా ఆ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉన్నట్టయితే తీర్మానం సమయంలో ఎవరు తెలంగాణ ద్రోహులో తెలిసిపోతుంది. ఆ మధ్య ముఖ్యమంత్రి చెప్పినట్టు తీర్మానం వీగిపోతుందా? లేక నెగ్గుతుందా అనేది కూడా తేలుతుంది. అప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్‌ల వైఖరి కూడా బయటపడుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ పని చేయగలిగితే తెలంగాణపై ఏ పార్టీ ఎంత నిజాయితీగా ఉన్నదో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు వాళ్లే నిర్ణయించుకుంటారు ఏం చేయాలో?

మరో విషయం ఏమంటే ఎంఐఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నాక దీనిపై కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఎంఐఎం వైఎస్‌ఆర్‌సీపీతో జతకట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నది అధికార, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ అభిప్రాయం అడక్కరలేదు. ఎందుకంటే ఎంఐఎం అసెంబ్లీ వేదికగానే సమైక్యవాదాన్ని వినిపించింది. ఆ పార్టీ వైఎస్‌ఆర్‌సీపీతో జతకట్టబోతున్నదంటే రాష్ట్ర విభజనపై ఆ పార్టీ విధానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అందుకే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్టు మొన్నటి దాకా తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీల్లోనే భిన్న రాగాలుండేవి. ఇప్పుడు తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఆ జాబితాలో చేరింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది తెచ్చేది మేమే కాబట్టి మేం లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదంటుంది. టీడీపీ లేఖ ఇచ్చాము కాబట్టి అఖిలపక్షం పెట్టాలంటుంది. వైఎస్‌ఆర్‌సీపీ లేఖ రాయదు, అఖిలపక్షం పెట్టమని డిమాండ్ చేయదు. తెలంగాణపై తేల్చాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడి చేయదు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యపై పార్టీల ద్వంద్వ నీతి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  బయటపడింది. ఇక తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే!

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home