Monday 5 November 2012

రాంలీల మైదానంలో వాల్ మార్ట్ రాగం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావి ప్రధానిగా భావిస్తున్న రాహుల్‌గాంధీకి ఈ దేశ సమస్యలపై పూర్తి అవగాహన లేదని అనేక సందర్భాల్లో వెల్లడైంది. రాంలీల మైదానంలో కాంగ్రెస్ పార్టీ బలనిరూపణ కోసం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్థించడానికి ఏర్పాటు చేశారు. మన్మోహన్ సర్కార్ తీసుకుంటున్న సంస్కరణలు మరింత వేగవంతం చేయడానికి వేదిక చేసుకున్నారు. అలాగే పరోక్షంగా ముందస్తు ఎన్నికల కోసం కార్యకర్తలను సమాయత్తం చేశారు. చిల్లర వర్తకంలోకి విదేశీపెట్టుబడులను ఆహ్వానిస్తూ మన్మోహన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ముక్తకంఠంతో అందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన్మోహన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని ఆయనకు అభయహస్తం అందించడానికి సోనియా, రాహుల్ గాంధీలు ముందుకొచ్చారు.  ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తున్న ప్రధాన ప్రతిపక్షాన్ని విమర్శించడానికి రాహుల్ గాంధీ మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టారు. కార్గిల్ యుద్ధ సమయంలో అప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నాము. అయినా జాతి ప్రయోజనాల దృష్ట్యా మేము ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపామన్నారు. పక్క దేశం దురక్రమణకు పాల్పడితే మన దేశ సైనికలు  సాహసోపేత పోరాటంతో దాన్ని ప్రటిఘటించారు. ఆ సమయంలో యావత్ భారత దేశం  కేంద్ర సైనిక సర్కార్ తీసుకున్న సైనిక చర్యకు సంఘీభావం తెలిపింది. దానికి ఎప్‌డీఐలకు ముడిపెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఏమిటో ప్రజకలు అర్థమయ్యే ఉంటుంది. ఆ సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ దీనిపై చర్చిండానికి నాటి భారత ప్రధాని వాజపేయిని ఆహ్వానిస్తే తిరస్కరించారు. కానీ ఇప్పటి ప్రధాని మన్మోహన్ మాత్రం దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే విధంగా అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ వామపక్షాలు యూపీఏ-1 ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తే, వారిని అభివృద్ధి నిరోధకులుగా ప్రచారం చేశారు. ఈ దేశ ప్రజలు ఎన్ని పాట్లు పడ్డా అమెరికా అభిమానాన్ని పొందడానికి మన్మోహన్ ఎంతటికైనా సిద్ధపడతాడు అనడానికి ఈ ఉదాహరణ చాలు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తమది అని చెప్పుకుంటున్న వీళ్లు తమ కాళ్లమీద తాము బతికే అభాగ్యుల పొట్టకొట్టి పెద్దలకు పంచేందుకు వాల్‌మార్ట్‌లకు వెల్‌కమ్ చెబుతున్నారు. అలాగే త్వరలో ఆహార భద్రత బిల్లు తెస్తామని కూడా రాంలీల మైదాన్‌లో ఘనంగా ప్రకటించారు. అయితే కొన్ని విషయాలు ప్రజాప్రతినిధులు మరిచిపోయినంత తొందరగా ప్రజలు మరిచిపోరు. ఆ మధ్య సుప్రీంకోర్టు గిడ్డంగుల్లో మూలుగుతున్న బియ్యాన్ని పేదలకు పంచాలని ఆదేశించింది. కానీ మన మన్మోహన్ గారు దానికి ఒప్పుకోలేదు. పైగా కోర్టు తీర్పును తప్పుపట్టారు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే యూపీఏ1, యూపీఏ2 ప్రభుత్వాలు ప్రజలకు మిగిలింది కష్టాలు, ప్రజాప్రతినిధులు కుంభకోణాల్లో కూరుకుపోతున్నారు.

అలాగే తమపై అవినీతి బురదచల్లేవారే కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. అవినీతి నిర్మూలనలో కాంగ్రెస్ పార్టీకి ఎవరూ సాటిరారని సోనియా, రాహుల్‌లు అన్నారు. నిజమే. అవినీతికి ఏ పార్టీ అతీతం కాదు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయ వేదికలకు మద్దతు పలుకుతున్నారు. అది అన్నాహజారే, కేజ్రీవాల్ ఎవరైనా కావొచ్చు. ప్రజలు అవినీతిని అంగీకరించడం లేదు. దానికి అడ్డుకట్టవేయాల్సిందేనని నినదిస్తున్నారు. అందులో ఏ పార్టీకి, ఏ ప్రజాప్రతినిధికి మినహాయింపు లేదు. చేసే పనిని మాత్రం చిత్తశుద్ధితో చేయాలి అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా తామే పోరాడుతున్నట్టు సమాచార హక్కుచట్టం గురించి, లోక్‌పాల్ బిల్లు గురించి గొప్పలు చెప్పుకుంటున్నది. లోక్‌పాల్ బిల్లు రాజ్యసభలో పాస్ చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రధాన ప్రతిపక్షం అడ్డుకున్నది అంటోంది. కాంగ్రెస్ పార్టీ తేవాలనుకున్న లోక్‌పాల్ బిల్లుతో అవినీతి అంతం కాకపోగా, అది మరింత పెరిగే అవకాశముందనే ఆరోపణలు వచ్చాయి. ఇక సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ విధానాలు. కానీ ఆ హక్కు చట్టం లక్ష్యాలు ఇంకా నెరవేరడం లేదు. ప్రజల్లో దీనిపై ఇంకా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.

మార్పు కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పిన రాహుల్‌గాంధీ మన్మోహన్ మనసును మార్చలేకపోతున్నారు. అందుకే మన్మోహన్ అండ్ కోల విధానాలకు వంత పాడుతున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల అభిప్రాయం ప్రకారం ఈ దేశంలో పేదలు అధికారిక లెక్కల్లో కనిపించరు. కానీ వీళ్లు మాత్రం అధికారం కోసం ఇంకా ఆమ్ ఆద్మీ ప్రవచనాన్ని మాత్రం వదలడం లేదు. అందుకే ఇప్పటికీ భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణింపబడుతున్నది. అది అభివృద్ధిలో కాదు.. అవినీతిలో, కుంభకోణాల్లో, ప్రజా వ్యతిరేక విధానాల్లో.. సో... భద్రతలేని జీవుల్లారా బహుపరాక్!
-రాజు

Labels:

1 Comments:

At 5 November 2012 at 12:33 , Blogger Anil Dasari said...

రిలయన్స్ వంటి సంస్థలు చిల్లర వ్యాపారంలోకి అడుగుపెడితే రాని ముప్పు వాల్‌మార్ట్‌తో వస్తుందా? ముప్పంటూ ఉంటే అది అంబానీలూ, బిర్లాలూ, టాటాలూ నడిపే గొలుసు దుకాణాలకే. కాబట్టి ఈ వాల్‌మార్ట్ వ్యతిరేకత వెనకున్న శక్తులేవో ఊహించుకోండి.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home