Friday 23 November 2012

అంతా అనుకూలమైతే, అడ్డు ఎవరు?

తెలంగాణ ప్రాంత ఎంపీలు డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయాలని పార్లమెంటు ఆవరణలో నిరసన తెలుపుతున్నారు. అయితే వీళ్ల నిరసన పత్రికలకే పరిమితమవుతున్నది తప్ప ప్రయోజనం లేదు. ఎందుకంటే పార్లమెంటు లోపల సభా కార్యక్రమాలను అడ్డుకున్నప్పుడే వారు చేపట్టే నిరసన కార్యక్రమాలకు విలువ ఉంటుంది. తెలంగాణకు మద్దతు ఇస్తున్న పార్టీలు కూడా వారికి సంఘీభావం తెలుపుతాయి. అప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకానీ ‘కర్ర విరగకూడదు పాము చావకూడదు’ అన్నట్టు టీ ఎంపీలు వ్యవహరించడం వల్ల వీళ్లు అలసిపోవడం తప్ప వాళ్ల అధిష్ఠానం మాత్రం స్పందించే అవకాశాలు లేవు. అట్లాగే టీ. ఎంపీలు ఏమంటున్నారు? కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇవ్వము అని చెప్పలేదు కదా! అలా చెప్పినప్పుడు మా నిర్ణయం మేం తీసుకుంటాము అంటున్నారు. ఇంతకీ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని ఎప్పుడు చెప్పింది? (ఇది కాంగ్రెస్ పార్టీలోని సీమాంధ్ర నేతలే కాదు తెలంగాణ ప్రాంతంలోని కొంతమంది కూడా మీడియా ముందు చెబుతూనే ఉన్నారు). మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న కారణాలు, కాలయాపనల చూసినాక కూడా ఇంకా టీ. ఎంపీలకు తమ అధిష్ఠానం మీద ఇంకా నమ్మకం ఉంది అని అంటే అది వారి భ్రమే అవుతుంది. ప్రజలు మాత్రం విశ్వసించడం లేదు. ఆ పార్టీని విశ్వసించే అవకాశమూ లేదు. అలాగే ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే, చచ్చేది కూడా మేమే అని చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేది లేదు మీరు తెచ్చేది లేదు అనేది తేలిపోయింది. అందుకే  ఇక చచ్చే కంటే ప్రత్యేక కార్యాచరణ ఒకటి రూపొందించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణపై నినదించే టీ ఎంపీల సంఖ్య కూడా రోజురోజూకు తగ్గిపోతున్నది. ఇంత గోడ మీద పిల్లుల్లా ఉన్నవాళ్లు మెల్లగా జారుకుంటున్నారు.

పదవులు వచ్చాక తెలంగాణవాదానికి తిలోదకాలు ఇచ్చినవాళ్లు కొంతమంది అయితే భవిష్యత్ వచ్చే పదవుల కోసం మరికొంత మంది పాకులాడుతున్నారు. తెలంగాణ కోసం అంతా ఐక్యంగా ఉండాలంటున్న వాళ్లే స్వలాభం కోసం శత్రువుతో జతకట్టబోతున్నారు. అందుకే తెలంగాణ కోసం పార్లమెంటు గొంతు చించుకుంటున్న టీ ఎంపీలకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ మద్దతు పలికారు కానీ తెలంగాణే తమ ఎజెండా అన్న వాళ్లు అక్కడ కనిపించలేదు. కనిపించరు కూడా. ఎందుకంటే వాళ్లకు కావలసింది ‘అమ్మ’ కనికరం. అందుకే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల దృష్టిలో పడడానికి పరుగులుపెడుతున్న నేతలు తెలంగాణ తేల్చకుండా నాన్చివేత ధోరణిని అవలంబిస్తున్న వారిని మాత్రం ప్రశ్నించడంలేదు. ప్రశ్నిస్తే పదవులు పోతాయి అన్న సంగతి వాళ్లకు ఎరుకే! అందుకే ఇప్పటికీ ‘అమ్మ’ తెలంగాణ ఇస్తుంది అని నమ్మబలుకుతారు. ఈ మాట ఇప్పుడు కాదు మూడేళ్లుగా చెబుతున్నారు. వినివాళ్లు ఉంటే ఇంకా కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారు కూడా. అందుకే పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకున్న జగన్‌ను ప్రశ్నించకుండా అవసరమైతే ఆయనకు అండగా ఉంటామంటారు. తెలంగాణపై విషం కక్కిన వైఎస్‌కు మేము అభిమానులం అంటారు. ఇంత బానిస మనస్తత్వం ఉన్నవాళ్లు ప్రజల పక్షాన నిలబడి, తమ బాధ్యతను నెరవేర్చాలి అంటే ఎలా కుదురుతుంది? వాళ్ల ఆలోచనలు వేరు, ప్రజల ఆకాంక్ష వేరు.

ఇక చంద్రబాబు ఏమంటున్నడు. టీడీపీ అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాడట. ఈ చంద్రబాబు వల్లే ఇంత మంది బిడ్డలు బలిదానాలు చేసింది. మానవహక్కుల దినోత్సవం రోజు (డిసెంబర్ 10) ఈ ప్రాంత ప్రజల ప్రజాస్వామిక హక్కును కాలరాసింది ఈ చంద్రుడే. పెద్ద నిర్ణయమని, ఎవ్వరినీ సంప్రదించలేదని, ఆంధ్రప్రదేశ్‌ను విడదీయడానికి కర్నాటక వీరప్పమొయిలీ, తమిళనాడు చిదంబరం ఎవరని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టింది ఎవరు? ఇప్పుడు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాట్లాబోనని అంటే ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం నలభై రెండు రోజులు సకల జనులు సమ్మె చేస్తే సంఘీభావం తెలపని చంద్రబాబు ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి ఈ ప్రాంత టీడీపీ నేతలు ఆహా ఓహో అంటున్నారు.

వైఎస్ కూతురు, జగనన్న వదిలిన బాణం షర్మిల అంటున్నారు రాజన్న రాజ్యం వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయంటున్నారు. విజయమ్మ ఇంకో అడుగు ముందుకేసి వైఎస్, జగన్ ఎన్నడూ తెలంగాణను వ్యతిరేకించలేదన్నారు. నంద్యాలలో వైఎస్, పార్లమెంటులో జగన్ చర్యలు తెలంగాణ ప్రజల మరిచిపోలేదు. వైఎస్ తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకున్నారు అని చెప్పేవాళ్లు ఇప్పుడు తెలంగాణ గురించి వాళ్ల వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పడం లేదు. కానీ ఇచ్చే శక్తి తెచ్చే శక్తి లేదని ఎంత కాలం చెబుతారు. ఇవ్వండి అని ఎందుకు ప్రశ్నించరు. మీ ద్వంద్వ విధానం ఏమిటో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఈ ప్రాంత ప్రజలు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న జగన్నాటక సూత్రాధారులు ఏవరో తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే ఇంకా ఈ మాయ మాటలు నమ్మి మోసపోయే కాలం పోయింది. రాజకీయ అవసరాల కోసం తెలంగాణ అంటున్న ఈ ప్రాంత నేతలకైనా, ప్రాంతేతర నేతలకైనా ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజల నుంచి ఎదురయ్యేది ప్రతిఘటనే!

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home