Thursday 20 June 2013

సమావేశాలతో సమయం వృథా



తెలంగాణపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో షిండేతో జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత నెలరోజుల్లో తెలంగాణపై తేలుస్తామన్నారు. ఆ గడువు పోయి చాలా కాలం అయింది. అప్పుడు తెలంగాణపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నదని మీడియా కోడై కూసింది. (సారీ... ఒక వర్గం మీడియా సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు పురమాయించింది అని చెప్పాలి) ఆ సమయంలో మంత్రి టీజీ వెంకటేశ్ లాంటి వాళ్లు కూడా తెలంగాణ ఇచ్చేటట్టు ఉన్నారని కూడా ప్రకటించారు. దీంతో అధికారపార్టీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అంతా సమైక్యంగా ఆజాద్‌తో కలిసి నెల గడువును తూచ్ అనిపించారు. దీంతో కథ మొదటికి వచ్చింది. అప్పుడూ ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నోరు మెదపలేదు. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తెలంగాణపై నాన్చివేత ధోరణిని తప్పుపడుతూ సమరదీక్ష సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలపై తెలంగాణ ఉద్యమ నాయకత్వం విమర్శలు చేసింది. సీమాంధ్ర నాయకత్వం తెలంగాణను అడ్డుకుంటే చచ్చిన పాముల్లా ఉన్న ఈ ప్రాంత నేతలు తెలంగాణ ఉద్యమ పార్టీని,  నాయకత్వాన్ని నల్లారి వారు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే వారికి బాసటగా నిలిచి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.

మొన్నటికి మొన్న చలో అసెంబ్లీ సందర్భంగా కిరణ్ ప్రభుత్వం తెలంగాణవాదులపై దమనకాండను ప్రయోగించింది. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి పార్టీలకు అతీతంగా సీమాంధ్ర నేతలు కుయుక్తులు పన్నుతుంటే కుక్కిన పేనులా ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణకు భారీ ప్యాకేజీ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు మళ్లీ సమావేశాలు  మొదలుపెట్టారు. తెలంగాణ తప్పా మరే ప్రత్యామ్నాయాన్ని అంగీకరించం అంటున్నారు. సోనియాగాంధీకి లేఖ రాయాలని, నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో భారీ మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ కోసం వెయ్యిమందికిపైగా బలిదానాలకు పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున్న ఉద్యమం జరుగుతున్నది. వలస ప్రభుత్వ నిర్బంధాలను అధిగమిస్తూ శాంతియుతంగా ప్రజలు స్వరాష్ట్ర ఆకాంక్షను హస్తినకు చాటిచెప్పడానికి ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పలేని వీళ్లు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తేవడానికి త్వరలో హస్తినకు వెళతారట! హైదరాబాద్‌లో కిరణ్ ప్రభుత్వం చలో అసెంబ్లీ సందర్భంగా ఒక ప్రాంత ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుంటే ప్రేకక్ష పాత్ర వహించారు. తెలంగాణ కోసమని సమావేశాలు పెట్టి తెలంగాణను అడ్డుకున్న ఆజాద్‌కు ధన్యవాదాలు తెలిపి, దిగ్విజయ్‌సింగ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసి తాము కూడా రాష్ట్ర సాధన కోసం ఏదో చేస్తున్నామనే భ్రమలు కల్పిస్తున్నారు.

ఐదున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ ఒక్క డిసెంబర్ 9న తప్ప మరెప్పుడు గౌరవించలేదు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు కామెడీ కామెంట్లు చేశారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఎక్కడ తెలంగాణపై సానుకూల ప్రకటన వస్తుందో అని సీమాంధ్ర నేతలు మూకుమ్మడిగా మూడురోజులు హస్తినలోనే మకాం వేసి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నారు. షిండే పెట్టిన నెల గడువుకు ఆజాద్‌తో కొత్త అర్థాలు చెప్పించారు. ఇలా వచ్చిన తెలంగాణను డిసెంబర్ 9 తర్వాత అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారితోనే వేదికలు పంచుకుంటూ ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టిన ఈ ప్రాంత నేత నేతలు ఇప్పుడు మీటింగులు పెట్టి సోనియాగాంధీకి విన్నపాల లేఖ రాస్తే ఒరిగేది ఏమిటి? ఈ ప్రాంత విముక్తి కోసం వీరంతా ఒక్కతాటిపై నిలబడి ఉండి ఉంటే కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంపై ఇంత అణచివేతను ప్రయోగించేవాడా? అందుకే ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు తెలంగాణ కోసం ఎప్పుడు సమావేశాలు పెట్టినా వాటిని టీ, బిస్కెట్ సమావేశాల లాగానే ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రానికి ప్యాకేజీలు పరిష్కారం కాదని మాటల్లో చెబితే ఢిల్లీ పెద్దలకు చెవికి ఎక్కదు. సమావేశాలతో సమయం వృథా తప్ప ఫలితం ఉండదనే విషయాన్ని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు తెలుసుకుంటే మంచిది.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home