Saturday 2 March 2013

సహకార ఫలితాలు-ప్రమాద సంకేతాలు

పార్టీ రహితంగా జరిగే సహకార ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. ఒకటి రెండు చోట్ల మినహా అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులు ‘చేతి’కి చిక్కాయి. గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలో జరిగిన  ఉప ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత సహకార ఎన్నికలు కిరణ్ సర్కార్‌కు కొంత ఉపశమనం కలిగించాయి అనుకోవచ్చు. రాష్ట్ర జనాభాలో ఐదు శాతం ఓటర్లు పాల్గొనే ఈ ఎన్నికలే ప్రభుత్వ పనితీరుకు గీటురాయి కాదని ఎవరికి వారు సమర్థించుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే ఎన్నికలే. అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా పార్లమెంటు ఎన్నికలైనా పార్టీల బలాబలాలు మాత్రం తెలుస్తాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పుడు జరిగిన సహకార ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు పరీక్షే! సహకార ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు జరిగే అద్భుతాలు ఏవీ లేకున్నా, అధికార పార్టీ రాష్ట్రంలోని ప్రధాన సమస్య అయిన తెలంగాణపై ఇప్పుడే తేల్చకుండా మరికొంత కాలం నాన్చే అవకాశాన్ని మాత్రం కల్పించింది అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వయం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దిగజారుతున్నదని అటు ప్రతిపక్షం నుంచి ఇటు స్వపక్షం నుంచి వస్తున్న ఆరోపణలకు సహకార ఫలితాలు కొంత ఊరట కలిగించాయి. అలాగే హస్తినలో కిరణ్ పరపతి కూడా కొంత పెరిగిందని రాజకీయ విశ్లేషకుల వాదన.

ఇక ఈ సహకార ఎన్నికల్లో నిజామాబాద్‌లో డీసీసీబీ అధికార పార్టీ హస్తగతం కాగా, డీసీఎంఎస్ పదవి వైఎస్‌ఆర్‌సీపీ, టీఆర్‌ఎస్‌లు కలిసి చేజిక్కించుకున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే ఫలితాలు వెల్లడైన రెండు రోజులకే సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో డీసీఎంఎస్ పదవిని టీఆర్‌ఎస్ దక్కించుకున్నది. అలాగే వరంగల్‌లో అధికార పార్టీలోనే రెండు వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యమంత్రి సూచించిన వ్యక్తి దొంతి మాధవరెడ్డి కాకుండా జంగా రాఘవరెడ్డి డీసీసీబీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని అంతా అనుకున్నారు. జంగాపై కేసులున్నాయనే పేరుతో దొంతి మాధవరెడ్డి వర్గీయుల ఫిర్యాదుతో కథ అడ్డం తిరిగింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ డీసీసీబీ ఎన్నికల చెల్లదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత అధికారి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించినా నామా, తుమ్ముల వర్గీయుల మధ్య ఆధిపత్య పోరుతో అక్కడ తెలుగు తమ్ముళ్ల అనైక్యత బహిర్గతమైంది. దీంతో అక్కడ డీసీసీబీ అధ్యక్షుని ఎన్నికపై టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కడపలో కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీల మధ్య పెద్ద హైడ్రామా నడిచింది. డీసీసీబీ ఎన్నికల సమయంలో వీరశివారెడ్డి వాహనంపై చెప్పులు విసరడంతో అక్కడ ఎన్నిక రసాభాసాగా మారింది. దీంతో అక్కడ అధ్యక్ష ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అధికార పార్టీపై ఆరోపణలు చేశారు. జిల్లాలోని మంత్రులు రామచంద్రయ్య, డీఎల్‌ల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఎమ్మెల్యే వీరశివారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో కడప జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వైరుధ్యాలు వీధికెక్కాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ల ఎన్నికపై రోజుకో మలుపు తిరిగి, చివరికి అధికార పార్టీకి వైఎస్‌ఆర్‌సీపీ డైరెక్టర్లు మద్దతు ఇచ్చినా అక్కడ రెండు పదవులు టీడీపీ వశమయ్యాయి. రాష్ట్ర సహకార శాఖామంత్రి కాసు క్రిష్ణారెడ్డి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడడం అధికార పార్టీ నేతలకు రుచించడం లేదు. ఎలాగైనా అక్కడ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను లొంగదీసుకుని డీసీసీబీ పీఠం దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ కల తీరలేదు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే పార్టీ రహిత ఎన్నికలు కాస్తా .. కొత్త పొత్తులకు దారితీశాయి. ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా టీఆర్‌ఎస్+కాంగ్రెస్, కాంగ్రెస్+వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ+ టీఆర్‌ఎస్,  ఒకరికొకరు సహకార ఎన్నికల అధ్యక్ష పీఠాలను దక్కించుకోవడానికి సహకరించుకున్నాయి. సహకార ఎన్నికల్లో పార్టీల్లో పార్టీల జోక్యం ఉండకూడదు అని ఆశించిన వారికి ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలదన్నే విధంగా పొత్తులు, డైరెక్టర్లతో రహస్య క్యాంపులు  జరిగాయి.

ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రకటించాయి. కానీ ఈ సహకార ఎన్నికలు అందుకు విరుద్ధంగా జరిగాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శ్వాశ్వత మిత్రులు ఉండరు అనడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ. ఆధిపత్యం కోసం పార్టీలు తమ వైఖరులు ఎలా మార్చుకుంటాయో వివిధ జిల్లాల్లో ఆయా పార్టీలు కలిసి డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ పదవులను దక్కించుకోవడం చూస్తే అర్థమవుతుంది. సుప్రీంకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని హైకోర్టు తీర్పుతో ఇంత కాలం వాయిదా పడిన ఎన్నికలు తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ అడ్డంకులు అన్ని తొలిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కూడా ప్రకటించారు. దీంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలు కాబోతున్నది. ఈ ఎన్నికలపై పార్టీల గుర్తులపై జరుగుతాయా లేదా అనే చర్చలు జరుగుతున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. త్వరలో దీనిపై ఒక స్పష్టత రానున్నది. సహకార ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా  ఇటు టీఆర్‌ఎస్, అటు వైఎస్‌ఆర్‌సీపీలు క్లీన్‌స్వీప్ చేస్తాయి అని విశ్లేషణలు, వాదనలు పటాపంచలయ్యాయి. అధికార పార్టీ ఈ ఎన్నికల్లో తన హవా కొనసాగించడం, తర్వాత స్థానంలో టీడీపీ నిలవడం ఆయా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల్లో నైరాశ్యాన్ని నింపాయి. ఈ ఎన్నికలను తమ పార్టీ సీరియస్‌గా తీసుకోలేదని ఆయా పార్టీల నేతలు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోప మాత్రం కలవర పడుతున్నారు. మేల్కోకపోతే మునిగిపోతామనే భయం ఈ రెండు పార్టీల నేతల్లో నెలకొన్నది. సహకార ఎన్నికల ఫలితాలను తెలంగాణ వ్యతిరేకులు తమకు అనుకూలంగా మలుచుకున్నారనేది స్పష్టమే. ఆ ఎన్నికలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉద్యమకారులు వాదించినా, దీనిపై సమీక్షించుకోవాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతమైతే పరిస్థితి ఏమిటి అన్న బెంగ ఇటు టీఆర్‌ఎస్‌లోనూ అటు వైఎస్‌ఆర్‌సీపీలోను ఉన్నది. ఎందుకంటే జగన్ జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతారో చెప్పలేని స్థితి. దీంతో ఆ పార్టీ మనుగడపై అనేక సందేహాలు వస్తున్నాయి. కార్యకర్తలో ఉత్సాహం నింపేందుకు షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నా.. జగన్‌లేని లోటు ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక టీఆర్‌ఎస్ మొన్న ఉప ఎన్నికల్లో, అలాగే సింగరేణి, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటినా సహకార ఎన్నికల్లో మాత్రం డీలా పడిపోయింది. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే సహకార ఎన్నికల ఫలితాల్లో నామమాత్రపు పోటీని కూడా ఇవ్వలేదని వాదనలు వినపడుతున్నాయి. ఎంత శాతం మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా లేకపోతే ఏం జరుగుతుందో ఈ ఎన్నికలు రుజువు చేశాయి. వైఎస్‌ఆర్‌సీపీని కూడా ఇదే సమస్య వెంటాడుతున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద నేతలు బయటికి వచ్చినా ద్వితీయ శ్రేణి నేతలు ఇంకా ఆ పార్టీలను పట్టుకునే ఉన్నారు. అంతేకాదు ఇప్పటికీ కాంగ్రెస్, టీడీపీలకు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీల బలం చెక్కుచెదరలేదు అనేది వాస్తవం. అందుకే సమైక్య పార్టీలకు తెలంగాణలోనే చోటులేదని మీడియా ముందు చెప్పడం కాదు, అది వాస్తవం రూపం దాల్చలంటే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి. సహకార ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకోవాలి.

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home