Tuesday 5 February 2013

'ప్రాదేశిక మండలి' ప్రచారమే!



తెలంగాణకు బోడోలాండ్ తరహా ప్రాదేశిక మండలి ని ఏర్పాటు చేస్తారనే వార్తలు ఆంగ్ల మీడియాలో కొంత కాలంగా పుంఖానుపుంకాలుగా వస్తున్నాయి. అయితే తెలంగాణకు ప్రాదేశిక మండలి ఏర్పాటు చేయాలనుకుంటే ఆ బిల్లు పాస్ కావడానికి  పార్లమెంటులో 2/3 మెజారిటీ కావాలి.  ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వానికి అంత బలం లేదు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఒప్పుకుంటే తప్ప ఆ బిల్లు ఆచరణలో ఆమోదం పొందదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కావాలనే కొన్ని వర్గాలు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే  పార్లమెంటులో సాధారణ మెజారిటీ  సరిపోతుంది. తెలంగాణ సమస్య పరిష్కారానికి సులువైన మార్గాన్ని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ సంక్లిష్టమైన ముళ్ళ బటను ఎంచుకుంటుందని అనుకోలేము. తెలంగాణకు ప్రత్యామ్నాయం ప్రత్యేక రాష్ట్రం మినహా .. ప్యాకేజీలు, ప్రాదేశిక మండళ్ళు పరిష్కారం కావు. ఎందుకంటే ఈ ప్రయోగాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం సమయంలోనే ఒప్పందాలతో ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో  తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలన్నీ ఉల్లంఘించబడ్డాయి. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రానికి ఈ ప్రాంత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసినా తెలంగాణ అభివృద్ధి చెందదు అనేది చరిత్ర రుజువు చేస్తున్నది. కనుక ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం మినహా మరే ప్రత్యామ్నాయం తమకు ఆమోదయోగ్యం కాదని  ఈ ప్రాంత ప్రజానీకం నినదిస్తున్నది. అందుకే ఆంగ్ల పత్రికల్లో వస్తున్న కథనాలు చూసి కలత చెందాల్సిన పని లేదు. ఇంగ్లిష్ మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని ఆంధ్రా మీడియా వాటి సాధ్యాసాధ్యాలు పట్టించుకోకుండానే... తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రాదేశిక మండలి ఏర్పాటుకు తనకు అభ్యంతరం లేదు అని అధిష్ఠాన పెద్దలకు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణపై కిరణ్ అభిప్రాయం అదే అయితే దీనికి సంజాయిషీ ఇవ్వాల్సింది ఈ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తమకు ఉందని వీళ్లు చెబుతున్నారు. ఒకవేళ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని బీరాలు పలికారు మన నేతలు.
 ఇక సహకారా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను  కాంగ్రెస్ పార్టీ బలుపును చూసి వాపు అనుకుంటున్నది. రాష్ట్ర వ్యాప్తంగా  పార్టీలకు సంబంధంలేని అన్నికల్లో మూడు శాతం  మంది ఓటర్లు ఇచ్చే తీర్పును ఆధారంగా చేసుకుని ఆంధ్రా ఆక్టోపస్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి అని జోస్యం చెబుతున్నాడు. రాజగోపాల్ ఎంత అల్ప సంతోషి అనేదానికి సహకార ఎన్నిక ఫలితాల తరువాత అతని మాటలను బట్టి తెలుస్తున్నది. మొన్న రాష్ట్రంలో జరిగిన ఒక పార్లమెంటు, 1 అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం అంటే స్వీకరించలేదు. సింగరేణి, ఆర్టీసి, జీహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా స్వీకరిస్తారా అంటే సమాధానం లేదు. కానీ సహకార ఎన్నికలను చూసి సంబరపడిపోతున్నాడు. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో కిరణ్ కుమార్‌రెడ్డికి తన పాలనా పనితీరును, బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నదని చెప్పుకోవడానికి,  లగడపాటి రాజగోపాల్  వంటి వాళ్లు మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టి అదే సమైక్యవాదం వాళ్లకు వాళ్లు సంతృప్తి చెందడానికి సహకార ఎన్నికల ఫలితాలు ఉపయోగపడతాయి. అందుకే సహకార ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదు. అలాగే తెలంగాణపై ప్రాదేశిక మండలి అనే వార్తలు కూడా ప్రచారానికే తప్ప పరిష్కార మార్గం కాదు.

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home