Tuesday 22 January 2013

మీ ఆందోళన మా ఆకాంక్షను తీర్చదు



తెలంగాణపై చంద్రబాబు లేఖ రాశాడనో, టీ కాంగ్రెస్ ఎంపీలు ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో ఒత్తిడి వల్లనో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మూడేళ్ల కిందట తెలంగాణ ప్రకటన తర్వాత పార్టీలు తీసుకున్న యూటర్న్‌లో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అన్నది మొన్నటి సమావేశంలో తేలింది. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణపై రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కానీ మొన్నటి అఖిలపక్ష సమావేశం గతంలో కంటే భిన్నమైంది. సమైక్యవాదాన్ని బలంగా కాదు కదా నామమాత్రంగానైనా ఏ పార్టీ వినిపించలేదు. (సీపీఎం భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతాన్ని, ఎంఐఎం మూడు ప్రతిపాదనలు, కాంగ్రెస్ రెండు వాదనలు, టీడీపీ గతంలో ఇచ్చిన లేఖను చూపింది) ఫైనల్‌గా అన్ని పార్టీలు ఈ సమస్యను త్వరగా తేల్చాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాయి. దానికి అనుగుణంగానే షిండే కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక గడువు విధించారు. ఆ సమావేశంలో వ్యక్తుల అభిప్రాయాలు ఏవైనా పార్టీల నిర్దిష్ట అభిప్రాయాన్నే ఆయన పరిగణనలోకి తీసుకుని రికార్డు చేసుకున్నారు. షిండే అభిప్రాయమే కాంగ్రెస్ అభిప్రాయం అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు దిగ్విజయ్‌సింగ్ అయినా వాయలార్ రవి అయినా, ఆజాద్ అయినా అదే చెబుతున్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా మొన్న వాయలార్ రవిని, ఆజాద్‌లను కలిసిన సీమాంధ్ర మంత్రులకు చెప్పారు. అయినా ఇంకా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వితండవాదం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వీళ్లు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముందు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం మినహా చేయగలిగింది ఏమీ ఉండదు. అఖిలపక్ష సమావేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే రెండు వాదనలు వినిపించాయి. గాదె వెంకటరెడ్డి తాను సమైక్యవాదాన్ని వినిపించాను అని ఇది వరకే ప్రకటించారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని షిండేకు చెప్పామని ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారు. అయినా ఇప్పుడు సీమాంధ్ర నేతలు హస్తిన పర్యటనలతో ఆ పార్టీ అభిప్రాయంలో మారుతుందేమో కానీ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మాత్రం మారుతుంది అనుకోవడం వారి భ్రమే అవుతుంది. తెలంగాణ అనుకూలంగా తమకు సంకేతాలు అందుతున్నాయి అంటున్న సీమాంధ్ర నేతలు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రజలు అంతా ఈజీగా విశ్వసించలేరు. ఎందుకంటే నరంలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పేరుతో అడ్డదిడ్డంగా ఏదైనా మాట్లాడగలరు. అందుకే ఒకరోజు తెలంగాణపై సానుకూలంగా మరోరోజు వ్యతిరేకంగా వారి వ్యాఖ్యలు మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికంతటికి కారణం ఇప్పుడు హస్తినలోహడావుడి చేస్తున్న సీమాంధ్ర నేతలే.  అయితే తెలంగాణ ప్రజలు మాత్రం హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ బిల్లు పార్లమెంటు పెట్టి, ఆ బిల్లు పాస్ అయి అది గెజిట్ రూపంలో బయటికి వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. అంతేగానీ ఇప్పుడు సీమాంధ్ర నేతలు పడుతున్న ఆందోళనలు మీడియాకు వార్తలు అవుతాయి తప్ప, తెలంగాణవాదుల ఆకాంక్షను తీర్చేవి కావు.

Labels: , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home