Wednesday 2 January 2013

అల్వీ సాబ్ ఆచరణ కావలె



తెలంగాణపై రెండో ఎస్సార్సీ యే కాంగ్రెస్ పార్టీ విధానం అన్నవాళ్లు, అంటున్నవాళ్ళు అసలు విషయాన్ని దాచిపెడుతున్నారు. మొదటి ఎస్సార్సీ హైదరాబాద్ రాష్ట్రాన్ని (తెలంగాణ) ఆంధ్రా రాష్ట్రంతో కలపవద్దని సూచించింది. దాని తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, విదర్భ రాష్ట్రాల ఏర్పాటు విషయంలో మొదటి ఎస్సార్సీని గౌరవిస్తామని చెప్పింది. కాని తెలంగాణ ఏర్పాటుపై కేంద్రంలో ఏదైనా కదలలిక రాగానే సీమాంధ్ర మీడియా, ప్రజాప్రతినిధుల్లో కలవరం మొదలవుతుంది.అందుకే కొత్త  రాష్ట్రాలఏర్పాటుతో దేశ  సమాఖ్యకు ముప్పు వాటిల్లుతుందని సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టే ప్రచారం మొదలుపెడుతారు. గతంలో కూడా కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సీ వేయాలనే ప్రతిపాదన ఉన్నదని, దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నదని ఆ పార్టీ అధికార ప్రతినిధులు అన్నారు. అప్పుడు తెలంగాణ గురించి ప్రస్తావిస్తే దానికి కూడా రెండో ఎస్సార్సీ వర్తిస్తుందని చెప్పి, తరువాత నాలుక కరుచుకున్న ఉదంతాలు ఉన్నాయి. తెలంగాణ కు రెండో ఎస్సార్సీ ఏ సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ తాజాగా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల డిమాండ్లతో తెలంగాణ ను కలిపితే అది ఆంధ్రప్రదేశ్ లో అపార్థాలకు దారితీస్తుందన్నారు. అయ్యా అల్వీ గారు ఇదే విషయాన్ని విస్పస్తంగా మీ పార్టీ ఆంధ్రా నాయకులకు చెబితే బాగుంటుంది. ఎందుకంటే మీ పార్టీ ఎంపి ఆంధ్రా  ఆక్టోపస్ తెలంగాణపై మీడియా ముందు అడ్డదిడ్డంగా మాట్లాడేది ఈ ఎస్సార్సీ గురించే. అలాగే అఖిలపక్ష భేటీలో తెలంగాణ పై కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటని మిగిలిన పక్షాలు నిలదీసినప్పుడు... కాంగ్రెస్ రెండు రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నదన్న సురేష్ రెడ్డి అభిప్రాయానికి కట్టుబడి ఉన్నామని షిండే అన్నటు వార్తలు వచ్చాయి.(దీన్ని గాదె వెంకట రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఖండించారు)  నెలలోపు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామన్న షిండే వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరే అని రషీద్ అల్వీ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉంటామని ఒకవైపు చెబుతూనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. వీళ్ళను కట్టడి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్  హైకమాండ్ పై ఉన్నది. ఎందుకంటే మీ విధానం ఏమిటో మీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు తెలిసినా...  తెలియనట్టు నటిస్తూ...ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఎన్నో ప్రకటనలు చేసింది. అందులో అనుకూల, ప్రతికూల ప్రకటనలూ ఉన్నాయి. అందుకే తెలంగాణ పై రోడ్ మ్యాప్ ప్రకటించకుండా ఇలా పూటకో ప్రకటన చేస్తే సమస్య తీరదు. మాటల్లో చెప్పేవి ఆచరణలో చూపితేనే... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసిన వారవుతారు.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home