Tuesday 11 December 2012

కావూరి కట్టుకథలు

అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే అదే ప్రాతిపదికన దేశంలోని చాలా రాష్ట్రాలను ముక్కలు చేయాల్సి వస్తుంది. అసలు కేంద్రం ఏ ప్రాతిపదికన తెలంగాణ ఇవ్వాలని చూస్తోందో అర్థం కావట్లేదని, అసలీ విషయాన్ని మూడేళ్లుగా ఎందుకు నానబెడుతున్నది? కేంద్రంలోని అధికారపక్ష నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఈ వివాదానికి ఎప్పుడో ఫుల్‌స్టాప్ పెట్టేవాళ్లు. తెలంగాణ నాయకులకు రాష్ట్రాభివృద్ధి ము ఖ్యం కాదు. సామాజిక న్యాయం అంతకంటే కాదు. విద్యార్థుల భవిష్యత్తు కూడా వారికి అవసరం లేదు. ప్రత్యేక రాష్ట్రం వస్తే హైదరాబాద్‌ను దోచుకుని పందుల్లా మెక్కవచ్చనే ఆశతో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. స్వార్థం, అవినీతి పెరిగిపోయిన రాజకీయ నేతలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని ముక్కలు చేయగలిగే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇవన్నీ శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ఏలూరు ఎంపీ సాంబశివరావు ఆవేదనతో... సారీ ఆవేశంగా మాట్లాడారు.

నిజంగా కావూరికి రాష్ట్రాభివృద్ధిపై ఎంత ప్రేమ ఉందో! దాని కోసం ఆయన ఎంతగా తపిస్తున్నారో? హైదరాబాద్‌లో టోల్‌గేట్ల దగ్గర పైసలు వసూలు చేస్తూ దాన్ని కూడా అభివృద్ధిలోనే భాగంగా చూస్తున్నారు ఈ ఉదారవాది. ఇక కావూరి వారు సామాజిక న్యాయం గురించి కూడా తెగ లెక్చర్లు దంచేశారు. దేశంలో ఎఫ్‌డీఐ వల్ల చిల్లర వర్తలకులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ కావూరి మంత్రి పదవి రాలేదని ఎంపీ పదవికి రాజీనామా చేసి,  దాన్ని జనవరి వరకు ఆమోదించవద్దని స్పీకర్‌ను వేడుకొని ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటు వేశారు. అదీ సామాజిక న్యాయం అంటే? అలాగే తెలంగాణ సమస్యను కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా ఎందుకు నానబెడుతున్నదని కావూరి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుతున్నది కూడా అదేగదా. కేంద్రం ఈ సమస్యను నానబెట్టడానికి కారకుల్లో మీరు కూడా ఒకరు కాదా? ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాలని చూస్తున్నదని కావూరికి అనడం గురువింద సామెతను గుర్తుచేస్తున్నది. ఈ ప్రశ్న 2001లో తమ నాయకుడు వైఎస్ 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కావాలని సోనియాగాంధీకి లేఖ రాయించినప్పుడు అడగాల్సింది. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నప్పుడు అడగాల్సింది. మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లేవనెత్తాల్సింది. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పెట్టినప్పుడు ప్రశ్నించాల్సింది. రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టినప్పుడు నిలదీయాల్సింది. అంతేందుకు తెలంగాణ గురించి 2009 డిసెంబర్ 10న ఉభయ సభల్లో ప్రణబ్, చిదంబరం హామీ ఇచ్చినప్పుడు ప్రస్తావించాల్సింది. మరీముఖ్యంగా రాష్ట్రపరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు అడ్డుకోవాల్సింది. ఇన్ని జరగుతున్నా ఇంత కాలం కళ్లున్న కబోదిలా నటించిన, నటిస్తున్న కావూరి వారు ఇప్పుడు స్వార్థం, అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడిన వారు పదవులు రాగానే మిన్నకుండి పోయారన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం కేంద్ర మంత్రి పదవిని, ఎంపీ పదవిని వదులుకున్న కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కావూరికి లేదు. ఎందుకంటే ఇదే కావూరి గారు కేంద్రంలో మంత్రిపదవి రాలేదని అలక వహించి ఎంపీ పదవి రాజీనామా చేసి, దాని ఇంకా కట్టుబడి ఉన్నానంటూనే... దాన్ని ఆమోదించుకోకుండా, అధికార పార్టీకి అండగా ఎఫ్‌డీఐలకు అనుకూలంగా ఓటు వేసి వచ్చారు. ఇలాంటి వాళ్లు విద్యార్థులకు నీతులు చెప్పి తమకు మాత్రం అవి వర్తించవు అన్నట్టు వ్యవహరించడమే నేటి విషాదం.

Labels: , ,

1 Comments:

At 11 December 2012 at 08:16 , Blogger Unknown said...

చాలా బాగా రాసారు..

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home