Friday 18 January 2013

సీమాంధ్ర నేతల కుయుక్తులు అర్థం చేసుకోవాలె



రాష్ట్ర విభజనపై  సీమాంధ్ర నేతల వాదన వింతగా ఉన్నది. ఓట్లు సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తరా అని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. దీన్ని సీమాంధ్ర  మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం స్టేట్ విభజన చేయడానికి పూనుకుంటున్నట్టు ప్రచారం మొదలు పెట్టింది. తెలంగాణ సమస్య ముందుకు వచ్చినప్పుడల్లా టీ అర్ ఎస్ గెలుచుకున్న సీట్లతో ముడిపెట్టినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. ప్రజల ఆకాంక్షను పార్టీలకు వచ్చిన సీట్లతో ముడిపెట్టి.. అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి అహంకారంగా అడ్డదిడ్డంగా మాట్లాడినప్పుడు వీళ్ళెవరు అడ్డుకోలేదు. అఖిలపక్ష సమావేశంలో పార్టీలలో సీపిఎం, ఎంఐఎం (ఎంఐఎం కూడా మూడు ప్రతిపాదనలు కేంద్ర ముందు ఉంచింది. అందులో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వదలుచుకుంటే హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందే అని కుండ బద్దలు కొట్టింది) తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ రెండు అభిప్రాయాలు చెప్పినప్పటికీ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ తరఫున పాల్గొన్న ప్రతినిధులు స్పష్టం చేశారు. కాని అప్పుడు అలా  మాట్లాడిన గాదె వెంకట రెడ్డి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. సమైక్యవాదాన్ని తాను బలంగా వినిపించాను అని చెప్పిన గాదె ఇప్పుడు మాట మారుస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబుతున్నదని సీమాంధ్ర మంత్రులే మీడియా ముందు వెల్లడించారు. వాళ్ళ వాదనను వినిపించడానికి వెళ్ళిన వీళ్ళను కాంగ్రెస్ పెద్దలు అడిగిన ప్రశ్నలకు మేము సరైన సమాధానం చెప్పలేక పోయామని వీళ్ళే చెప్పారు. అధిష్టాన పెద్దలు అడిగిన ప్రశ్నల్లో ఓట్లు సీట్లు ఒక అంశం మాత్రమే. ఇప్పుడు పార్టీ హైకమాండ్ వైఖరిని తప్పుపడుతున్న నేతలు తమ బంధు గణాన్ని జగన్ పార్టీలోకి పంపి సీమాంధ్ర  ప్రాంతంలో పార్టీని భ్రష్టు పట్టించారని ఆ పార్టీ పెద్దల ప్రధాన ఆరోపణ.  నిజానికి తెలంగాణపై ఓట్లు, సీట్ల రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్, టిడిపి, వై ఎస్అర్ సీపీ. ఈ పార్టీలే రాష్ట్ర విభజనపై ద్వంద్వ విధానాలను అవలంబిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సమైక్యవాదానికి 270 స్థానాలు వస్తాయి అని లగడపాటి చేసిన, చేస్తున్న వితండ వాదాన్ని ఎందుకు తప్పు పట్టలేదు. బాబు పాదయాత్ర సమయంలో కరీంనగర్ లో ఆ పార్టీ కార్యకర్త తెలంగాణ పై స్పష్టత ఇవ్వాల్సిందే అని నిలదీస్తే... ఆయన చెప్పిన సమాధానం ఏమిటి? ఇక్కడ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అక్కడ (సీమాంధ్రలో) పార్టీ పోతుంది అన్నప్పుడు మీడియాకు కనిపించలేదు. చంద్రబాబు వైఖరి కరెక్టుగానే కనిపించింది. తెలంగాణ అనగానే సీమాంధ్ర నేతలు, మీడియా అనేక అంశాలను తెర ముందుకు తెస్తాయి. రాయలసీమ, మన్యసీమ, హైదరాబాద్. ఇలా కాలుకు వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలుకు అన్న చందంగా అసలు అంశాన్ని పక్కదోవ పట్టించే కుట్రలు తెరలేపుతారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్న నేతల్లోనే సఖ్యత లేదన్నది మొన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలోనే స్పష్టమైంది. అంతే కాదు వీళ్ళు ఏమి కోరుకుంటున్నారో క్లారిటీ కూడా లేదు. సమైక్య వాదాన్ని పక్కన పెట్టి హైదరాబాద్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అంటారు. రాష్ట్రాన్ని విభజిస్తే అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలపాలని కొందరు వాదిస్తారు. కనుక సీమాంధ్ర ప్రజానీకం ఇప్పటికైనా అర్థం చేసుకోవలసింది మీ ప్రజాప్రతినిధులుగా చెప్పుకుంటున్న వాళ్ళ వాదనలు వారి ప్రయోజనాల కోసమే తప్ప..మీకోసం కాదు. హైదరాబాద్ లో ఒక్క సీమాంధ్ర ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో కాలంగా ఉంటున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఇక్కడే ఉంటారు. ఎవరికీ అభద్రతా భావం అక్కర లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశంలో పార్టీల అభిప్రాయం మేరకే తీసుకుంటుంది. అంతే గాని సీట్ల కోసమో, సొంత ప్రయోజనాల కోసమో తీసుకుంటుంది అనుకోవడం అపోహ మాత్రమే. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలు రాష్ట్రంలో నెలకొన్నఅస్థిరతను తొలగించాలని కేంద్రాన్ని కోరాయి. సమస్యను పరిష్కరించాలని చెప్పిన వాళ్ళు... నిర్ణయం తీసుకునే సందర్భంలో సమస్యలు సృష్టిస్తున్న సీమాంధ్ర నేతల కుయుక్తులను అర్థం చేసుకోవాలె.  

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home