Thursday 3 January 2013

ప్యాకేజీ ప్రయోగం ఫలించదు



తెలంగాణపై తేల్చడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నదని, దీనిపై మీడియా లో చర్చల మీద చర్చలు. అయితే ప్రత్యేక రాష్ట్రమా, లేదా ప్యాకేజీనా అనే అంశాలపై మాత్రమే ప్రధానంగా ఈ చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ పై చిదంబరం ప్రకటన తరువాత మూడేళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అఖిలపక్షం తరువాత ముప్పై రోజుల్లో ఈ అంశాన్ని తెలుస్తామన్న షిండే హామీ, అయన ప్రకటన కాంగ్రెస్ వైఖరే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ ప్రకటన దీనికి కొంత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే అఖిలపక్ష సమావేశంలో ఒక్క సీపీఎం తప్ప ప్రధాన రాజకీయ పార్టీలేవీ సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించలేదు.అది కూడా తెలంగాణ పై కేంద్రం నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ రెండు వాదనలు, టిడిపి, వైఎస్అర్ సిపీ అస్పష్ట వైఖరి మినహా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నేరుగా వ్యతిరేకించలేదు. తాజాగా విజయవాడలో పీసీసీ అధ్యక్షులు తలపెట్టిన ప్రాంతీయ సదస్సుకు ఆజాద్ ఆదేశాలు అడ్డుకట్ట వేశాయి. రాష్ట్రం పై కీలక నిర్ణయాలు వెలువడే సందర్భంలో...హస్తిన సంకేతాలను ఎవరికీ వారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పందాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత హక్కులు అన్ని ఉల్లంఘనలకు గురయ్యాయి అనేది తెలంగాణవాదుల వాదన. 610 జీవో వచ్చి 27 ఏళ్ళు పూర్తి అయిన ఇప్పటికి అది అమలు కాలేదు. వైఎస్ హయంలోనూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమని ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టడం కోసమే జరిగింది. ఆ ప్రాంతీయ ముఖ్యంగా తెలంగాణకు ఎన్ని  నిధులు కేటాయించారో విదితమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి ప్రవేశపెట్టిన ప్యాకేజీ ప్రయోగాలు విఫలమయ్యాయి. ఇప్పుడు మళ్లీ ప్యాకేజీ అంటే తెలంగాణ ప్రజలు అందుకు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అంతేకాదు కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని వెనుకబడిన ప్రాంతాలకు ప్రకటించిన ప్యాకేజీ, రాజ్యాంగ రక్షణలు తెలంగాణ విషయంలో సాధ్యం కాదు. ఎందుకంటే కేంద్రం ప్రకటించే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలంటే పార్లమెంటులో 2/3 మెజార్టీ కావాలి. అంటే దాదాపు 365 సభ్యుల మద్దతు అవసరం. కేంద్ర ప్రభుత్వం నుంచి తృణమూల్ వైదొలిగిన తరువత యూపీఏ బొటా బోటీ మెజార్టీ తో కొనసాగుతున్నది. ఎఫ్ డీఐల ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎంత కలవరపాటుకు గురైందో మనకు తెలిసిందే. అయినా కాంగ్రెస్ ప్యాకేజీ ప్రయోగం మరోసారి చేయాలంటే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహకారం తప్పని సరి. దీనికి బీజీపీ ససేమిరా ఒప్పుకోదు. అదే తెలంగాణ పై పార్లమెంటులో బిల్లు పెడితే సాధారణ మెజారిటీ చాలు. ఇప్పటికే జాతీయస్థాయిలో తెలంగాణకు అనుకూలంగా ముప్పై పైచిలుకు పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సులువైన మార్గాన్ని పక్కన పెట్టి సమస్యను సంక్లిష్టం చేస్తుందని భావించలేము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యను మరింత కాలం సాగతీయడానికి ఏవైనా కారణాలు చెబితే తప్ప తెలంగాణ అంశాన్ని పక్కనపెట్టలేని స్థితి. అలాగే తెలంగాణ పై ఇదే చివరి సమావేశమని షిండే ఇప్పటికే స్పష్టం చేశారు. మరో అంశం ఏమంటే గాదె వెంకట రెడ్డి చెప్పినట్టు రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదన్నా. అంతిమంగా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్పారు. రాజ్య సభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్  చెప్పినట్టు రాష్ట్ర విభజన అంశం అఖిలపక్ష సమావేశం తరువాత రాష్ట్ర పరిధి నుంచి కేంద్రం కోర్టులో చేరింది. కాబట్టి లగడపాటి చెబుతున్న ఏకాభిప్రాయం, కావూరి శాస్త్రీయ విభజన అనేవి కాంగ్రెస్ పార్టీ సమస్యలు. వాటిపై కాంగ్రెస్ పార్టీ తేల్చుకుని తెలంగాణపై తేల్చాల్సిన సమయం, సందర్భం ఆసన్నమైంది.    

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home