Thursday 24 January 2013

రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది?



 ప్రభుత్వ విప్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి  మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నిరాజీనామా చేశారు. త్వరలో ఆయన  వైసీపీలో చేరనున్నారు. ఇప్పటికే బొబ్బిలి ఎమ్మెల్యే సజయ కృష్ణ రంగారావు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, చింతలపూడి ఎమ్మెల్యే ఎం.రాజేశ్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరణ తరువాత  కిరణ్ సర్కార్ అరకొర మెజారిటీతో కొనసాగుతున్నది. అయితే ఈ ఐదుగురి రాజీనామాలు ఇంత వరకు ఆమోదం పొందలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని వీడుతామని...జగన్ కు అండగా ఉంటామని స్పష్టంగా చెప్పినా వీళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ధైర్యం చేయలేని స్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలే బయట పడ్డారు. కానీ సీమాంధ్రలో చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో  వైసీపీ తరఫున పోటీ చేయడానికి ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. తమ వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నారు. దీనికి సమైక్యవాదానికి సంబంధం లేదు.   అందుకే మొన్న రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది అని సీమంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షక్షుడు వయలార్ రవితో అన్నప్పుడు ఆ విషయం మాకు తెలుసు అన్నారు. ఎన్నికలు పెడతాం అన్నారు.  అంతేకాదు మీ కుమారులను, బంధువులను  వైసీపీలో పంపారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారు. పొతే పొండి అన్నటు వార్తలు వచ్చాయి. ఓట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తారా? రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది అని ఇంటెలిజెంట్స్ నివేదికలు...అన్నీ అబద్ధాలే! రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్ ఇప్పటికే చాల సార్లు విఫలయత్నం చేశాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ పీ అర్ పీని విలీనం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాత్కాలికంగా కాపాడగలిగింది. ఇక్కడ కిరణ్ సర్కార్ ఘనత గాని.. సమైక్య నేతల సామర్త్యం గాని లేదు. అధికారం కోసం, అవకాశవాద రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కిరణ్ వచ్చాక అవి మరింత ఎక్కువయ్యాయి. అందుకే కిరణ్ సర్కార్ పని తీరు బాగా లేదని ప్రతిపక్షాలే కాదు స్వపక్ష నేతలే పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా సీమాంధ్ర లో కాంగ్రెస్ పార్టీని కాపాడే నాయకుడు లేదు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పుడో అర్థమయ్యింది. అందుకే రెండుచోట్ల పార్టీని ఎందుకు దెబ్బ తీసుకోవాలి అనే అభిప్రాయం వాళ్ళలో ఉన్నది. అలాగే అఖిలపక్ష సమావేశంలో వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెడితే తెలంగాణ పై ఒకటి రెండు పార్టీలు మినహా వ్యతిరేకత అంతగా కనిపించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై తేల్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకే తెలంగాణకు అనుకూలంగా సంకేతాలు వస్తున్నాయని సీమాంధ్ర నేతలే మీడియా ముందు హడావుడి చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే ఏదో జరిగిపోతుంది అని లేనిపోని అపోహలు వల్లే సృష్టిస్తున్నారు. వీళ్ళ ఒత్తిడి వల్లే ఆజాద్ నెల గడువుపై తన అక్కసును మీడియా ముందు వెళ్ళగక్కాడు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ లోనే కాదు టిడిపి, వైసీపీలోను వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా, అవుతున్నా.. అవి తాత్కాలికమే. ఈ అంశంపై పార్టీల అభిప్రాయమే ఫైనల్ అని తెలంగాణ వ్యతిరేకులు తెలుసుకోవాలి.

Labels: , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home