Thursday 24 January 2013

ఆజాద్ వ్యాఖ్యలే అంతిమం కాదు



తెలంగాణపై  తాజాగా ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఆనందాలు (రాష్ట్రంలో నెలకొన్న అస్థిరత తొలిగిపోవాలని కోరుకునే వారికి ఈ పదం వర్తించదు), ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆజాద్ మాటలతో ఇప్పుడే మన మనసులు గాయపడలేదు. ఇప్పటికి ఎన్నోసార్లు ఆయన తెలంగాణ పై అడ్డదిడ్డమైన కామెంట్లు చేశాడు. ఆజాద్ తెలంగాణ కు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడాడు కూడా. ఎందుకంటే షిండే గడువు గురించి ఈమధ్య కాలంలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయి. అవి చూస్తే ఆజాద్ ఆంతర్యం ఏమిటో? అతను ఎవరి పక్షమో తెలుసుకోవడం కష్టమేమి కాదు. ఆజాద్ ఒక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడే మాటల్లో పొంతన ఉండదు. ప్రజలతో, ప్రసారమాధ్యమాల ప్రతినిధులతో వాళ్ళ మాటలతో  మైండ్ గేమ్ ఆడడం చూస్తూనే ఉన్నాం. అన్న హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలు మొన్నటి అమానత్ అత్యాచార ఉదంతం దాకా ప్రజాగ్రహంపై కాంగ్రెస్ పెద్దల వైఖరి చూస్తే..మనకుండే భావోద్వేగాలు వాళ్ళకు ఉండవు. అంతేకాదు సమస్యల పరిష్కారంపై బాధ్యతగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కనుక ఆజాద్ వ్యాఖ్యలతోనే తెలంగాణ సమస్య సమసిపోదు, సమైక్య రాష్ట్రం  నిలబడదు. తెలంగాణ పై  షిండే విధించిన గడువు అయినా.. దానిపై కేంద్ర ప్రభుత్వం వెలువరించే నిర్ణయం వాయిదా పడినా అన్ని కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లోనే కొనసాగుతాయి. తెలంగాణ ప్రజల తెగువ, సహనం ప్రపంచ ఉద్యమాల్లో ఎక్కడా కనిపించవు. ఎందుకంటేఆధునిక యుగంలో  ఇంత శాంతియుతంగా, ఇంత సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉద్యమం ఒక్క తెలంగాణ ఉద్యమమే. అందుకే మనం సీమాంధ్ర లోని సామాన్య ప్రజల, ప్రజాస్వామిక వాదుల మన్ననలను పొందగలిగాము. గుప్పెడుమంది పెట్టుబడిదారులు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను తాత్కాలికంగా అడ్డుకున్నా..అదే అంతిమ నిర్ణయం కాదు. అంతేకాదు ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏమిటి అనేదే! ఆ నిర్ణయం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించేది అయితే సంబురం లేకపోతే సమరమే అని మనం అనుకుంటున్నదే కదా. కనుక తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి  కాంగ్రెస్ చెబుతున్న కారణాలు ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో కాలగర్భంలో కలిపివేస్తాయి.   

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home