Wednesday 30 January 2013

రాజీ'నామాల డ్రామాలు





తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరగాల్సి ఉన్నది దీనికి కాలపరిమితి లేదని ఆజాద్ షిండే ల ప్రకటనల్లో స్పష్టత, సంతృప్తి మొన్న జానారెడ్డికి కనిపించాయి. కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం కాదన్న ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాటలు మధు యాష్కీకి రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా కనిపించాయి. అఖిలపక్ష సమావేశం తరువాత తెలంగాణపై కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ లోనే యుద్ధం జరుగుతున్నది. సమస్యను పరిష్కరించాల్సిన పార్టీలోనే ఈ అంశంపై సిగపట్లు మొదలయ్యాయి. దీనికి ఆజ్యం పోసింది ఆజాద్. అక్కడ (సీమాంధ్రలో) ఉద్యమం లేదని వయలార్, ఆజాద్ లు సీమాంధ్ర నేతలతో అన్నట్టు ఆ ప్రాంత నేతలే మీడియా ముందు చెప్పారు. అందుకే కేవీపీ ఆ ప్రాంత నేతలను ఒక్క తాటిపైకి తెచ్చి కేంద్రంపై ఒత్తిడి చేసి షిండే పెట్టిన గడువులోగా తెలంగాణ పై నిర్ణయం రాకుండా అడ్డుకున్నారని తెలంగాణ  కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ జనవరి 28న తెలంగాణపై  ఆజాద్ మాటల మంటలు, షిండే మరింత సమయం ప్రకటన ఈ ప్రాంత ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్నకోపం నిరసన రూపంలో సమరదీక్ష సభలో నేతల మాటల్లో వ్యక్తమయ్యింది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై అవలంబిస్తున్న సాచివేతకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ, నెహ్రు కుటుంబాల కు విధేయులు గా ఒక్కటై ఉద్యమ నాయకత్వంపై ఒంటి కాలుమీద లేస్తున్నారు. రాజమండ్రి సభ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో ఈ ప్రాంత నేతలు భాగస్వాములు అయ్యారు. అసలు విషయాన్ని పక్కనపెట్టి గాంధీ, నెహ్రు కుటుంబాలపై వచ్చిన విమర్శల సాకు తో ఉద్యమాన్ని, ఉద్యమ నాయకత్వాన్ని నిర్మూలించే కిరణ్ కుట్రలకు ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు బాసటగా నిలుస్తున్నారు. ఇంతకాలం తెలంగాణ కు ఎవరు అడ్డుపడుతున్న వాళ్ళ గురించి ఈ ప్రాంత ప్రజలకు చెప్పి, ఇప్పడు వాళ్ళతోనే చేతులు కలిపి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే టీఅర్ఎస్ విలీన అంశాన్ని తెరమీదికి తెస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ  ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు, టీఅర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తే రేపే తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తాము అన్నట్టు మధు యాష్కీ, వీహెచ్ లు బీరాలు పలుకుతున్నారు. ఒక పత్రిక కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ మరింత మసాలా జోడించి ఓ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ ఇస్తే తమ పార్టీని బేషరతుగా విలీనం చేస్తాము అని టీఅర్ఎస్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. కెసిఅర్ తో హస్తినలో కాంగ్రెస్ పెద్దలు ఈ ప్రతిపాదన చేశారని, అందుకు తము అంగీకరించినట్టు కూడా కరీంనగర్ లో చెప్పారు. అయినా స్పందించని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదికి ఎందుకు తెస్తున్నది? విభజించు పాలించు సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అందుకే  తెలంగాణ ఉద్యమం, ఉద్యమ నాయకత్వంపై రాజమండ్రి సభ నుంచి మొదలైన కాంగ్రెస్ మార్కు  విష ప్రచారానికి కొనసాగింపుగానే ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ పై  కారణాలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సమరదీక్ష సభను సాకును చూపి ఈ ప్రాంత ఆ పార్టీ నాయకుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేసి, కొంత వరకు సఫలమయ్యింది. అందుకే ఆజాద్ వ్యాఖ్యల ఆగ్రహం కొంత మంది ఎంపీలను రాజీనామాల వైపు నడిపిస్తే, చాకో మాటల సాకు మధు యాష్కీని అధిష్టానం తో 'రాజీ' చేయిస్తున్నది. చూశారా మన ప్రాంత కాంగ్రెస్ నేతల సంతృప్తి నాటకం వాళ్ళ అధిష్టానానికి ఊరట.. మన బిడ్డల ఊపిరి ఆగిపోవడానికి కారణం అవుతున్నాయి. తెలంగాణ  కోసం ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు
రాజీనామాలు చేయకపోయినా  పరవాలేదు కానీ మీ 'రాజీ' నామాల డ్రామాలు ఆపితే మంచిది.      

Labels: , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home