Tuesday 29 January 2013

ఆడలేక మద్దెలు ఓడు



ముఖ్యమంత్రి గారు టి అర్ ఎస్ పార్టీని ఉప ప్రాంతీయ పార్టీ అన్నారు. 2009లో మీకు వచ్చింది పది సీట్లే అని ఎద్దేవా చేశారు. నిజమే. మరి 2004లో మీరు రాష్ట్రంలో ఏ జాతీయ పార్టీతో కలిసి పోటీ  చేశారు? 2009 డిసెంబర్ తరువాత ఈ ప్రాంతంలోజరిగిన ఉప ఎన్నికల్లో  ఈ పార్టీ (అదే జాతీయ పార్టీ) ఎన్ని సీట్లు గెలిచింది? అంతెందుకు జగన్ మీ పార్టీని వీడిన తరువాత మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీ పార్టీ ఏమి చేసిందో గుర్తు లేదా? ఇప్పటికే మీ పార్టీలోని సీమాంధ్ర  ప్రాంతానికి చెందిన ఐదుగురు శాసనసభ్యులు రాజీనామా చేశారు. వాటిని ఆమోదిస్తే మీ సామర్థ్యం, మీ మంత్రుల సామర్థ్యం ఏమిటో తెలుస్తుంది. రెండు దశాబ్దాల కిందటే ఈ దేశంలో సంకీర్ణ యుగం ప్రారంభమైంది.నాటినుంచి ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో అధికారం చెలాయించే మీకు ప్రాణవాయువు అందిస్తున్నాయి.  నెహ్రు కుటుంబ త్యాగాలను కొనియాడిన మీకు ఒక ప్రాంత ప్రజల ఆకాంక్ష కోసం వెయ్యి మంది ప్రాణ త్యాగాలు చేశారు. వాటిని గుర్తించడానికి నిరాకరిస్తున్నది మీ జాతీయ పార్టీ. వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రస్టు పట్టించిన చరిత్ర మీ పార్టీకి ఉన్నది. సమస్య పరిష్కారానికి సమయం కోరడం తప్పా? ప్రశ్నిస్తున్నారు. తప్పులేదు కానీ సంప్రదింపుల పేరుతో సాగదీయడమే తప్పు. అధికారం ఉంది కదా అని ప్రజల ప్రజాస్వామిక హక్కులను  కాలరాయడం తప్పు. తమరు ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ  ఉద్యమకారులపై దమనకాండను ప్రయోగించినా, టియర్ గ్యాస్ ప్రయోగించి ప్రాణాలు తీసినా.. ఈ ప్రాంత ప్రజల పక్షాన కాకుండా.. పార్టీ విధేయులు గానే ఉన్నారు మీ (మా) మంత్రులు. తెలంగాణ పై సీమాంధ్ర లోని గల్లీ  నేతల నుంచి ఢిల్లీ లోని మీ పెద్దల వరకు అడ్డదిడ్డంగా మాట్లాడినా అడ్డుకోలేని అసహాయులు ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు.అయినా ఎక్కడా సహనం కోల్పోలేదు ఈ ప్రాంత ప్రజానీకం. కానీ తెలంగాణ ను అడ్డుకోవడానికి మీతో మొదలు, మీ పీసీసీ అధ్యక్షులు, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కరేమిటి అంత ఏకతాటిపైకి వచ్చినా... ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా  ఎన్నడూ మా పక్షాన నిలబడలేదు. దాని ప్రశ్నిస్తున్నది మా ప్రజానీకం. తెలంగాణ  ఇచ్చేది, తెచ్చేది మేమే అన్నా ఈ ప్రాంత ప్రజలు నమ్మలేదు. కానీ ఉండవల్లి లాంటి వాళ్ళు సంఖ్యా బలాన్ని చూపి సవాల్ చేసిన సందర్భంలో అయిన స్పందిస్తారు అనుకున్నాం.  ఆ పని చేయలేదు. ఎంతటి త్యాగాలకైనా సిద్ధమన్న వీళ్ళు ప్రాణం పోయిన పదవీ త్యాగం చేయము అని మొన్న జానారెడ్డి మాటలతో.. నిన్న మీడియా సమావేశంలో, నేడు ముఖ్యమంత్రి మద్దతు తో ఉద్యమ నాయకత్వంపై విమర్శలు చేయించడం తో పూర్తిగా అర్థం అయ్యింది. పాపం ఇది తెలియక మధు యాష్కీ  లాంటి వాళ్ళు ఇంకా వీళ్ళు వాళ్ళతో కలిసి వస్తారని ఆశిస్తున్నారు.
ఇక ఉండవల్లి వైఎస్ చెప్పిన పాట పాటనే ఇప్పుడు పాడుతున్నాడు. తెలంగాణ రావాలనే దేశం మొత్తం ఒప్పుకోవాలట. దేశం మొత్తం అనేదానికి కాంగ్రెస్ పార్టీలో ఏమి పర్యాయ పదం ఉన్నదో తెల్వదు కానీ  ఉండవల్లి దేశంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలలో ఇప్పటికే ముప్పై పైచిలుకు పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు రాశాయి. మరో జాతీయ పార్టీ పార్లమెంటులోనే స్పష్టంగా మద్దతు ప్రకటించిది. మీరు మొన్న రాజమండ్రి సభలో పేర్కొన్న విధంగానే 2001 నుంచి ఈ అంశంపై క్లారిటి  లేనిది ఒక్క కాంగ్రెస్ పార్టీకే. నాటి  కేంద్ర హోం మంత్రి  తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను పరిశీలించాలని మీ పార్టీ అధినేత్రి లేఖ రాసి దశాబ్దం దాటినా మీ సంప్రదింపులు, చర్చలు పూర్తీ కాలేదు. అవి ఎప్పటికి పూర్తవుతాయో కాలపరిమితి లేదని ఆజాద్ చెప్పే ఉన్నాడు.ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు .. మీ పార్టీలో ఇన్ని అవలక్షణాలు పెట్టుకుని, రాష్ట్ర విభజనపై  పక్కవాణ్ణి విమర్శిస్తే పరిష్కారం దొరుకుతుందా?

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home