Friday 25 January 2013

ఉండవల్లి ఏందీ నీ లొల్లి



అధికార దాహంతోనే చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చాడు అంటాడు మంత్రి శైలజానాథ్. మరి వీళ్ళ వాదనే కరెక్ట్ అనుకుంటే తెలంగాణను సీమాంధ్ర లోని 170 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు అని ఊసరవెల్లి ఉండవెల్లి ఎలా చెబుతారు? అంతే కాదు 175 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఉంటే  రాష్ట్ర విభజన తీర్మానం ఎలా సాధ్యం అవుతుంది అన్నారు ఉండవల్లి గారు. నిజమే. మరి 119 మంది తెలంగాణ  ఎమ్మెల్యేలు లేకుండా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో చెబితే బాగుండేది. తెలంగాణ ప్రాంత ప్రతినిధులు లేకుండా అది ఆంధ్రప్రదేశ్ ఎట్లా అవుతుంది? జై ఆంధ్రప్రదేశ్! జై జై ఆంధ్రప్రదేశ్!! అని అంటివి. ఎంతమంది ఉన్నారు మీ స్టేజిమీద తెలంగాణ ప్రాంత నేతలు? మొదట జై ఆంధ్ర ఉద్యమం ఏమైంది అని పత్రికల్లో ప్రచారం చేసి, తరువాత జై ఆంధ్రప్రదేశ్ సభగా దాన్ని మార్చి...ఒక ప్రాంత ప్రజాప్రతినిధులు లేకుండా సభ పెట్టుకొన్న ఉండవెల్లి తెలంగాణ ఉద్యమ నాయకత్వం పై విషం చిమ్మడమే సమైక్యాంధ్ర ఉద్యమం అంటాడు. మనిషి అన్న వాడు మాట మీద నిలబడాలి. అది ఆంధ్రా  నాయకుల అలవాటే లేదు. అందుకే తెలంగాణ పై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే ఏ  నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్న నేతలు ఒక్కరైనా ఉన్నారా రాజమండ్రి సభా వేదికపై ఉన్నవాళ్ళలో? రాష్ట్ర విభజన అధికారికంగా జరగక ముందే మీకు మీరే విభజన రేఖ గీశారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ అనువాదకుడిగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. రాజమండ్రి సభతో ఆయన అబద్ధాల కోరు అని, అహంకారి అని కూడా అర్థమయ్యింది. ఎందుకంటే తెలంగాణ ప్రస్తుతం  కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో లో లేదు అని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామో లేదో వచ్చే  మ్యానిఫెస్టోలో పెడతామని టీజీ వెంకటేష్ అంటాడు. మరి అరుణ్ కుమార్ ఏమో కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రసంగాన్ని అనువాదకుడిగా తెలంగాణ మా  మ్యానిఫెస్టోలో ఉందని, ఈ అంశం తమకు అత్యంత ప్రధాన్యమైనదని తెలుగులో తర్జుమా చేసి వినిపించాడు.  ఇప్పుడు చెప్పు ఉండవల్లి మిమ్మల్ని అబద్ధాల కోరు అనకుండా.. ఏమనాలో? అదొక్కటేనా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి? అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని ఎందుకు అడగలేదని సోనియా గాంధీ హిందీ ప్రశ్నకు తెలుగు అనువాదం చేసింది మీరే కదా!అప్పుడు గుర్తుకు రాలేదా  సమైక్యవాదం? ఇంతకాలం అంధకారంలో ఉన్న ఈ అనువాదకుడు ఇప్పుడే మేల్కొని సమైక్య సందేశం ఇవ్వడానికి రాజమండ్రి నుంచి కొత్త సారి.. సారి.. చెత్త రాగాలు మొదలుపెట్టాడు. పోలవరం వాళ్ళ గిరిజనులు నష్టపోతారు. అభివృద్ధి కావాలంటే కష్టాలు తప్పవు అనేది ఉండవల్లి గారి ఉద్భోద. గిరిజనం అంటే పట్టని మీకు సమైక్యత కోరుకునే హక్కు ఉందా?  తెలంగాణపై అరుణ్ కుమార్ అక్కసు... ఆజాద్ అసంబద్ధ వ్యాఖ్యలు అన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలం తోనే జరుగుతున్నాయి. అందుకే సత్తిబాబు రాష్ట్ర పీసీ సీ అధ్యక్షుడిని అని మరిచిపోయి రాజమండ్రిలో సమైక్య సన్నాయి లు నొక్కాడు. ఉండవెల్లి మంచికో చెడుకో రాజమండ్రి సభ ద్వారా తెలంగాణ  ప్రజలకు ఒక సత్యాన్ని చెప్పాడు. సభ ఆద్యంతం తెలంగాణ ఉద్యమ  నాయకత్వాన్నే టార్గెట్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత నేతలు ఎంత బానిసలో కూడా తెలియజేశారు. అందుకే ఉండవల్లి తెలంగాణ  ఉద్యమ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే తెలంగాణ ఉద్యమం సుదీర్ఘ కాలంగా శాంతియుతంగా  కొనసాగుతున్నది. తమరు ప్రదర్శించిన వీడియో లలో కొత్త విషయాలు  ఏమీ లేకపోయినా దింపుడు కళ్ళెం ఆశ మాత్రం కనిపించింది. ఎన్నిచేసినా సమైక్య ఉద్యమం బలపడం లేదనే ఆవేశం కనపడింది. అందుకే ఉద్యమ నాయకత్వాన్ని విరుచుకుపడితే కొంత గురింపు వస్తుంది అనుకున్నాడు అరుణ్ కుమార్. మద్రాస్ నుంచి ఆంద్ర రాష్ట్రం విడిపోయినప్పుదు తమరు ఎన్ని ఘన కార్యాలు చేసారో చరిత్ర చెబుతున్నది. సామరస్యంగా విడిపోయే రాష్ట్రాన్ని రాజధాని కోసం పొట్టి శ్రీరాములును పొట్టన పెట్టుకున్న చరిత్ర మీది. అందుకే రాష్ట్ర విభజన జరిగితే విద్వంసం సృష్టిస్తామని ఒకరు, మానవబాంబులం అవుతాం, ,మంత్రిగా ఉంది తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఒక ఫోర్స్ ను తాయారు చేస్తానన్న మాటలన్నీ తమ ప్రాంత ప్రతినిధుల నుంచే వచ్చాయి. ఎవరు ఎవర్ని రెచ్చ గొడుతున్నారో అర్థమయ్యిందా అరుణ్ కుమార్!  

Labels: , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home