Saturday 26 January 2013

బానిస నేతల బాధ్యతారాహిత్యం



సమరదీక్షకు కిరణ్ సర్కార్ అనుమతి ఇవ్వదట. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందట. సమైక్య రాష్ట్రంలో మా బతుకులకు భద్రత లేదు బాబు..మేము విడిపోతాం అంటే లేదు మా కింద బానిసల్లా బతకాలి అంటారు బలుపెక్కిన వేషంతో రాజమండ్రి వేదిక నుంచి. అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రా ప్రాంత ప్రతినిధిగా వెళ్లి అక్కడ సమైక్య రాగం వినిపించాను చెప్పాడు గుంటూరు గాదె. హస్తినలో తెలంగాణ పై అధిష్టానం ఏ  నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అని ప్రకటించాడు. తీరా ఆంధ్రలో అడుగుపెట్టగానే అబద్ధాలు మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకరించే ప్రసక్తే లేదు అంటాడు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నా తెలుగు వారంతా కలిసే ఉండాలని ఆంధ్రా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. విజయవాడలో విభిన్న వేషాలు వేస్తూ.. అర్థనగ్న ప్రదర్శనలు ఇస్తూ ఇదే సమైక్యవాదం అంటాడు ఆంధ్రా ఆక్టోపస్. వీళ్ళ నటనను చూస్తూ నవ్వుకుంటుంటే...నన్ను మరిచిపోతారా? అంటూ సత్తిబాబు సమైక్య సుత్తి పట్టుకుని బయలుదేరాడు. రాజమండ్రి సభలో తెలంగాణ పై రంగులు మార్చే ఊసరవెల్లి కంటే మిన్న ఉండవల్లి అబద్ధాలు ఆలకించడానికి అతిథి అయ్యాడు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మీరు ఆ సభకు వెల్లడమేంటి అంటే నా ప్రజాస్వామ్య హక్కు అంటాడు. మొన్న రాష్ట్ర రాజధానిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే సత్తిబాబు సంకుచిత బుద్ధి బయటపడ్డది. తెలంగాణ అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అంటే సత్తిబాబు అక్కసు, అలసత్వం, ఆక్రోశం అన్ని కనిపించాయి. అప్పుడే ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలకు అర్థం కావాల్సింది సమైక్య సత్తిబాబు సీమాంధ్ర బాబు అని. తెలంగాణ వాదులను తిట్టడమే సమైక్యవాదం అంటూ సభలు పెట్టుకోవడానికి అడ్డురాని శాంతిభద్రతలు...తెలంగాణ సభలకు, నిరసనలకు వర్తిస్తాయి. ఇంత నిస్సిగ్గుగా మూడేళ్ళుగా తెలంగాణ ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్న వలసపాలకుల విధానాలకు ఈ ప్రాంత బానిస నేతలు వంత పాడడమే ఇప్పటి విషాదం. మన సభలకు, సమావేశాలకు, సమరదీక్షలకు పర్మిషన్ ఇప్పించలేని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్వ రాష్ట్ర సాధన కోసం ఏ  త్యాగానికైనా సిద్ధం అంటారు.  తెలంగాణ ప్రకటనను అడ్డుకోవడాని హస్తినలో ఆంధ్రా లాబీయింగ్ చూపిన ఐక్యత తరువాత.. ఆజాద్ అసంబద్ధ ప్రేలాపనల తరువాత, రాజమండ్రి సభ తరువాత...కూడా  మన (సారి.. సీమాంధ్ర నేతల తాబేదార్లు) ప్రాంత కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలుగదు. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ సంఖ్యా బలాన్ని చూసి కాకుండా ...ఈ ప్రాంత నేతల బలహీనతలు చూసి, బలుపెక్కిన ఆంధ్రా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. మన నేతలు మేల్కోనంత కాలం మన ఆకాంక్షను అణచివేయడానికి అన్ని శక్తులు కూడగడతాడు. అర్థ సత్యాలు, అబద్ధాలు, అంకెల గారడీ చేస్తూనే ఉంటాడు. అదే అభివృద్ధి అంటాడు. అందుకే  స్వరాష్ట్ర కల సాకారం కావాలంటే... ఆంధ్రా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం ఒక్కటే కాదు.. ఈ ప్రాంత బాధ్యతారాహిత్య నేతలను బజార్లో నిలబెట్టాల్సిన సమయము, సందర్భం ఆసన్నమైంది.


     

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home