Sunday 24 February 2013

బాంబు పేలుళ్లు, బాధితులు, బాధ్యతారాహిత్యం



నేషనల్ కౌంటర్ టెర్రరిసమ్ సెంటర్
ఇంకా పురుడు పోసుకోనే లేదు
‘నాట్‌గ్రిడ్’ ఇంకా మాటలే నేర్చుకోలేదు
‘ఆక్టోపస్’ గురక పెట్టి నిద్రపోతున్నది
‘రా’ గాలిలోనే సంచరిస్తున్నది
‘ఐబీ’ పరిస్థితి దానికే తెలియదు
అందుకే స్లీపర్‌సెల్స్
నిద్రపోవడం మానేశారు...
 పేస్ బుక్ లో ఓ మిత్రుడు పోస్ట్ ఇది. దిల్ సుఖ్ నగర్ లో జంట పేలుళ్ళ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతగాని తనాన్ని, సామాన్య జనాల  ఆవేదనను ఆ మిత్రుడు నలుగు ముక్కల్లో చెప్పాడు. నిజమే. ఎందుకంటే  అఫ్జల్ గురు ఉరిశిక్ష  అమలు తరువాత  దేశంలో ఉగ్రవాద దాడులు జరగచ్చు అని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్ర హోం అన్నిరాష్ట్రాలకు ఆ సమాచారాన్ని అందించింది. అయినా  రాష్ట్ర ప్రభుత్వం పేలుళ్ళ తరువాత ఇంటలిజెన్స్ సమాచారంపై ఇచ్చిన సమాధానం సర్కారు అలసత్వాన్ని చూపెట్టింది. చేతులు కాలాక ఆకులు  పట్టుకున్నట్టు.. ప్రభుత్వం హడావుడి చేసింది తప్ప ఈ ఘటనకు బాధ్యులు ఎవరో ఇప్పటికి కనిపెట్టలేక పోయింది. ఉగ్రవాద దాడుల తరువాత సహజంగానే అది మా పనే అని ఏదో ఒక సంస్థ ప్రకటించుకుంటుంది. కానీ అలాంటి ప్రకటన ఏది వెలువడలేదు. ఇండియన్ ముజాయుద్దిన్ ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు ముందే హైదరాబాద్ లో పలుచోట్ల రెక్కీ నిర్వహించినట్టు పొలీస్ విచారణలో తేలింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను,  లగడపాటి, టీజీ లాంటి వాళ్ళు కప్పిపెట్టి, దాన్ని తెలంగాణ వాదానికి ముడి పెట్టడం సిగ్గుచేటు

తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ ముష్కరుల అడ్డగా మారుతుంది అన్న చిన్న నీటి పారుదల శాఖా మంత్రి టీజీ వెంకటేష్ చిన్న మెదడు చితికినట్టు ఉన్నది. సమైక్య రాష్ట్రంలోనే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే, రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అంది తెగ బాధ పడిపోతున్న మంత్రి ఈ ఘటనలకు బాధ్యత ఎవరది? ఉమ్మడి రాష్ట్రంలోనే మక్కా మసీద్, గోకుల్ చాట్, లుంబిని పార్క్, ఇప్పుడు తాజా ఘటనలన్నీ జరిగిన విషయం మరిచి పోయారా? అఫ్జల్ గురు ఉరిశిక్ష తరువాత దాడులు జరగవచ్చు అని కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను తేలికగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నీలాంటి వాళ్ళు  ప్రజల భద్రత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. ఉగ్రవాద సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు అది అంతర్జాతీయ సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఈ రాష్ట్రం కంటే చిన్న దేశాలు కూడా ఉగ్రవాద నిర్మూలన కోసం, ప్రజలకు భద్రత కల్పించడానికి చిత్తశుద్ధి తో పనిచేస్తున్నాయి. అంతే కాదు వాళ్ళ నిఘా వ్యవస్థలను పటిష్టంగా ఉపయోగించుకుంటున్నారు. కాని ఈ రాష్ట్రంలో మన పోలీసులు నిఘా వ్యవస్థలను ప్రజా ఉద్యమాలను, ఉద్యమకారులను అణచివేయడం పై పెడుతున్నారే కాని ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టలేక పోతున్నారు, సమైక్య రాష్ట్రంలో రాజధాని భాగ్యనగరంలో ప్రజల భద్రత ఎలా ఉన్నదో ఇప్పటకే అనేక సంఘటనలు రుజువు చేశాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చిన్న రాష్ట్రాలతో ముడిపెట్టే నీలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉండడం తెలంగాణ ప్రజలకే కాదు రాయలసీమ ప్రజల దౌర్భాగ్యం. రాగద్వేషాలతో రాజధానిలో అశాంతి పెరగలేదు లగడపాటీ ...  మీ అవకాశవాద  రాజకీయాలతోనే ప్రజలకు ఈ దుస్థితి. చిన్న రాష్ట్రాలతో మత  కలహాలు, అశాంతి నెలకొంటుంది అని శ్రీ కుట్ర కమిటీ నివేదిక సూత్రధారులు ఎవరో ఆ కమిటీ  రహస్య నివేదికతో బయటపడింది. కాలం చెల్లిన కమిటీ నివేదికల గురించి కాదు అబద్ధాల ఆక్టోపస్ కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పు. మీ ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి బలైన వాళ్ళ కుటుంబాలకు, తీవ్రంగా గాయపడి కాళ్ళు, చేతులు కోల్పోయి  ఆస్పత్రుల్లో అవస్థలు పడుతున్న వాళ్ళను అడుగు నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు కు జవాబు దొరుకుతుంది. ఈ క్లిష్ట సమయంలో అంత  రాజకీయాలు అతీతంగా బాధితుల పక్షాన ఉంటే, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న టీజీ, లగడపాటిల వ్యాఖ్యలు సిగ్గుచేటు.  ఉగ్రవాద  సమస్యకు మూలాలు వెతకకుండా బోడి గుండికి మోకాలుకు ముడిపెట్టినట్టు తెలంగాణ  అంశాన్ని వాడుకుంటున్న మీ మానసిక స్థితి సరిగా లేదు అనడానికి మీ మాటలే ఇందుకు ఉదాహరణ.

Labels: , , ,

1 Comments:

At 27 February 2013 at 02:12 , Blogger rameshbudharam said...

anna very nice piece, though it very small . you just kicked off. you put it on janavakyam on jyothi with psudo name, so that it may reach a majority of the people.

Regards
RAMESH

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home