Saturday 16 March 2013

‘చంద్రకిరణాల’ విశ్వాసం



రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీ, వామపక్షాలు, లోక్‌సత్తా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి కొనసాగుతున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి సమస్య తెలంగాణ. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ. ఇప్పటికిప్పుడు అధికార పార్టీ పడిపోయి, ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీలకు లబ్ధి చేకూరుతుందని, అందుకే చంద్రబాబు అవిశ్వాస తీర్మాన సమయంలో తటస్థంగా ఉన్నారు. ఇది బాబు వ్యూహాత్మక వైఖరి అని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్ల మొన్న ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నట్టు ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దాడి అన్నట్టు ఆయన పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు దాడితే మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక సమయంలో, ఇప్పుడు అసెంబ్లీలో పార్టీ వైఖరి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయి. ఈ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగితే సాధారణ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉన్నది కదా, అప్పటికి టీడీపీ చారిత్రక తప్పిదాలను జనం మరిచిపోతారు అని చంద్రబాబు ఆలోచన అయి ఉంటుంది. కానీ ఆ ఎన్నికల కంటే ముందు ఇప్పుడు అధికార పార్టీ విప్‌ను ధిక్కరించిన తొమ్మిది మంది, ప్రతిపక్ష పార్టీ విప్‌ను ధిక్కరించిన ఆరుగురిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు తప్పవు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్వహించాలని చూస్తోంది. దీంతో పదిహేను శాసనసభ స్థానాల, స్థానిక సంస్థల ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీల ముందున్నాయి. అలాగే ఈ పదిహేను స్థానాల ఎన్నికలు సీమాంధ్రలోనే జరగుతాయి. గతంలో జగన్ కోసం రాజీనామా చేసిన పదిహేడు స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అధికార పార్టీకి చావుతప్పి కన్నులొట్టబోయినట్టు రెండు స్థానాలను దక్కించుకున్నది. అయితే అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి స్థితి వేరు. ఎందుకంటే విప్ ధిక్కరించిన అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమయినట్టే. వారిపై అనర్హత వేటు వేయాలని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు స్పీకర్‌ను కోరుతామని ప్రకటించాయి.

వారిపై అనర్హత వేటు పడి, ఎన్నికలు ఖాయమైతే ఇవి అధికార, ప్రతిపక్ష పార్టీలకే కాదు వైఎస్‌ఆర్‌సీపీ కూడా కీలకమే. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ పదిహేను స్థానాలను నిలబెట్టుకుంటే సీమాంధ్రలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తన పట్టును నిరూపించుకోవచ్చు. అలాగే అధికార పార్టీని కాపాడుతున్నది ప్రధాన ప్రతిపక్ష పార్టీయే అనేది అవిశ్వాస తీర్మానంతో బయటపడింది. దీనికి టీడీపీ నేతలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సంస్కృతికి తమ పార్టీ దూరం అని, అందుకే అవిశ్వాస తీర్మానం సమయంలో తటస్థంగా ఉన్నామని సమర్థించుకోవచ్చు. కానీ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకం అన్నా,  సభలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉండే. కానీ దాన్ని కూడా టీడీపీ ఉపయోగించుకోలేకపోయింది. రాష్ట్రంలో విద్యుత్ సమస్య వల్ల పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు కుంటుపడ్డాయి. దాదాపు తొమ్మిది వేల చిన్నా చితకా కంపెనీలు మూతపడ్డాయి. కిరణ్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభ తలెత్తింది అనేది సుస్పష్టమే. ఎందుకంటే ఏడాది కాలంగా విద్యుత్ సమస్య ఉన్నది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలను కిరణ్ సర్కార్ వెతకలేదు. ఈసంక్షోభాన్ని గట్టెక్కించలేదు కానీ సర్‌చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి వినియోగదారుల నడ్డివిరిచింది. మరోసారి వడ్డనకు సిద్ధమవుతున్నది. కరెంటు కోతలు విధిస్తూ చార్జీలు పెంచిన ఘనత కిరణ్ సర్కార్‌దే. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కళ్లముందే కనిపిస్తున్నది. ఈ అసమర్థ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్న బాబు అవిశ్వాస తీర్మానం విషయంలో ఎందుకు తటస్థంగా ఉన్నారో వారికే తెలియాలి. పాదయాత్ర సమయంలో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. అవిశ్వాసం వల్ల కొన్ని పార్టీలకు ప్రయోజనం కలుగుతుంది అంటున్న టీడీపీ నేతల వాదన సహేతుకంగా లేదు. ఎందుకంటే టీఆర్‌ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగడుతూనే, ప్రజా సమస్యలను కూడా ప్రస్తావించింది. జయప్రకాశ్ నారాయణ అన్నట్టు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే తెలంగాణ చరిత్ర ముందు కాంగ్రెస్ దోషిగా మిగులుతుంది. తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పామని టీడీపీ, దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి అని చంద్రబాబు, కిరణ్‌లు చెబుతున్నారు. ఇది వాదన ఒకే విధంగా ఉన్నది. అయితే ఈ అనిశ్చితి తొలగించాలని అధికార పార్టీకి లేఖ రాసి, అవిశ్వాస తీర్మాన సమయంలో టీఆర్‌ఎస్ కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతున్నప్పుడు కనీస స్పందన కూడా లేదు. అంటే తెలంగాణపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని రుజువైంది. అలాగే టీఆర్‌ఎస్ తెలంగాణ కోసం ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు ఇవ్వడాన్ని నిరసించిన మంత్రి శైలజనాథ్ వ్యాఖ్యలను తిప్పికొట్టకపోవడం ఈ ప్రాంత కాంగ్రెస్ నేతల చేతగాని తనం. ఎందుకంటే తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమన్న నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఒంటికాలిపై లేచినా వీళ్లు మౌనంగా ఉన్నారు. తెలంగాణపై సభలో సీమాంధ్ర మంత్రి మాటలను తిప్పికొట్టలేని వీళ్లు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తామంటే విడ్డూరంగా ఉన్నది.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలు వేరైనా, తెలంగాణపై చిత్తూరు బాబు వైఖరి ఏమిటో ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు వస్తే ఉద్యమపార్టీకి మేలు జరుగుతుందనే చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలం అయ్యాడనడానికి మరో ఉదాహరణ ఆ పార్టీ విప్‌ను ఆరుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించారు. అయితే వీళ్లు డబ్బు సంచులకు అమ్ముడుపోయారు అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నా, బాబు నాయకత్వంపై వాళ్లకు నమ్మకం లేదని తేలిపోయింది. బాబు ప్రజలకు కాదు, కనీసం ఆ పార్టీ నేతల్లో కూడా విశ్వాసం పెంపొదించలేకపోతున్నారని గడిచిన కొంతకాలంగా ఆ పార్టీ వీడుతున్న నేతలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎంతమంది పార్టీ వీడినా నష్టం లేదంటూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బాబు, దాన్ని నివారించడంలో విఫలమవుతున్నారు. ఈ పరిస్థితి తెలుగు తమ్ముళ్లను ఆందోళనకు గురిచేస్తున్నది. ఎందుకంటే రేపు జనంలోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రజల నుంచి వ్యక్తమయ్యే నిరసనకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తూనే, దానికి కారణమైన ప్రభుత్వాన్ని కాపాడారు అనే అపప్రద టీడీపీ మూటగట్టుకున్నది. ఇది ఆ పార్టీ ఇప్పుడు చేసిన నష్టం కంటే భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుంది. ఇక అధికార పార్టీ అవిశ్వా తీర్మానంలో సాంకేతికంగా నెగ్గినా, మైనార్టీలో పడ్డట్టే. టీడీపీ దయాదాక్షిణ్యాలపైనే కిరణ్ సర్కార్ మనుగడ ముడిపడి ఉన్నది. బాబు సహకారంతో నెగ్గిన కిరణ్‌బాబు నేను దేనికీ భయపడే వాడిని కాదు అనడం వింతగా ఉన్నది. నారా, నల్లారి వారు కలిసి నడుస్తున్న నడక అధికార పార్టీని ప్రస్తుతానికి గట్టెక్కించినా, అధికార పార్టీ ఐసీయూపై ఉన్నట్టే లెక్క!

Labels: , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home