Saturday 13 May 2023

కర్ణాటకలో కుదిరింది.. కానీ తెలంగాణలో కష్టమే!


కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమౌతాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దీంతోపాటు సోషల్‌మీడియాలో ఇదే విషయంపై చర్చ జరుగుతున్నది. అయితే నిజంగా తెలంగాణలో ఆ పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ కాంగ్రెస్‌ లేదా బేజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదా? కేసీఆర్‌ ఢీ కొట్టగలిగే రాష్ట్ర స్థాయి నేత ఇరు పార్టీల్లో ఉన్నారా? అంటే అంత ఈజీ కాదనే సమాధానమే వస్తుంది. కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ సమస్య, నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం, కుల, మత రాజకీయాలు, బొమ్మై సర్కారు అవినీతిపై అక్కడి నేతలు సమిష్టిగా పోరాడారు. అక్కడ సీఎం సీటు కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ల మధ్యే పోటీ ఉన్నది. ఎన్నికల సమయంలో వారిద్దరి మధ్య విభేదాలు కాంగ్రెస్‌ పార్టీ పరిష్కరించింది. వారు కూడా ముందు పార్టీ గెలుపు తీరాలకు తీసుకెళ్లాలి. ఆ తర్వాత సీఎం సీటు సంగతి చూసుకుందామనే అభిప్రాయంతో ముందుకు వెళ్లారు. సిద్ధరామయ్య సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఐదేళ్లు సీఎంగా, అంతకు ముందు రెండుసార్లు డిప్యూటీ సీఎంగా, అత్యధిక సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆర్థికమంత్రిగా ఆయనకు రాష్ట్రమంతా పట్టున్నది. బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేసి జైలుకు పంపినా పార్టీ కోసం గట్టిగా డీకే నాయకత్వ ప్రతిభ కూడా కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపునకు ఉపకరించాయి. అలాగే కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడించలేరు, ఆ పార్టీ నేతలే ఓడిస్తారనే నానుడిని కర్ణాటక నేతలు నిజం చేయలేదు. రాహుల్‌ భారత్‌ జోడోయాత్ర ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో ఉన్నది. 


 సంకీర్ణ ప్రభుత్వాలతో విసిగిపోయిన ఆ రాష్ట్ర ప్రజలు సుస్థిర ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. అందుకే పార్టీలు కులం, మతం ఆధారంగా సీట్లు ఇచ్చినా... వాటినే ప్రచారం చేసినా అన్నివర్గాల, అన్ని మతాల ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతోనే గంపగుత్తగా ఓట్లు వేశారు. సాధారణ మెజారిటీనే కాదు భారీ మెజారిటీని కాంగ్రెస్‌కు కట్టబెట్టారు. ప్రజల చైతన్యానికి అనుగుణంగా కర్ణాటక ప్రజాప్రతినిధులు పరిణతి ప్రదర్శించారు. ఐటీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా బెంగళూరు లాంటి సిటీ బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వ మూడేళ్ల  పాలనలో కాలంలో మత రాజకీయాలతో మసకబారింది. దీన్ని కూడా ప్రజలు నిరసించారు. కొవిడ్‌ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చూస్తున్నారు. వాటిని కల్పించడానికి కృషి చేయాల్సిన పాలకులు మతం పేరుతో శాంతిభద్రతల సమస్యలు సృష్టించ చూసిన వారిని కూడా చిత్తుగా ఓడించారు. హిజాబ్‌ వంటి సున్నిత అంశాన్ని తెరమీదికి తెచ్చి వివాదాస్పదం చేసిన  విద్యాశాఖ మంత్రి ఓటమే దీనికి ఉదాహరణ. 


కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉండొచ్చు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దించే పరిస్థితులు మాత్రం లేవు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక సీనియర్లు, బైటి నుంచి వచ్చిన వారు పార్టీలో పెత్తనం చేస్తున్నారనే రచ్చ ఆ పార్టీలో జరుగుతున్నది. ఫలితంగా ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీ వీడగా.. సీనియర్లు రేవంత్‌ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. అయితే వాళ్లు పార్టీని గెలిపించగల స్థితిలో లేరు. కానీ వాళ్లను పక్కనపెట్టి అధికారపార్టీపై పోరు చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్లంతా వారి వారి నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న నేతలే. ఎన్నిలకు ఇంకో ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉన్నది. నేతల మధ్య సయోధ్య కుదిరి అంతా ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ అంతర్గత కుమ్ములాటలు ఇలాగే కొనసాగితే అంతిమంగా అది అధికారపార్టీకే మేలు చేస్తుంది. 


ఇక గత ఎన్నికల్లో 100 పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నది. అయితే తెలంగాణలో ఆ పార్టీకి అంత సీన్‌ లేదనే అంటున్నారు. కేసీఆర్‌ లేదా రేవంత్‌రెడ్డి లపై అసంతృప్తితో బీజేపీలో చేరిన వారే ఎక్కువ. అలాంటి వారు ఆ పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయలేరు. అలాగే బండి సంజయ్‌ ఏకపక్ష నిర్ణయాలు కూడా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి నచ్చడం లేదు. కర్ణాటక ఫలితాల తర్వాత కొత్తగా బీజేపీలోకి చేరాలనే ఆలోచన ఉన్నవారు తమ అభిప్రాయం మార్చుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బీఆర్‌ఎస్‌తో అధినాయత్వంతో రాజీ పడలేక బీజేపీలో కొనసాగలేక సతమతమవుతున్న నేతలు కూడా కాంగ్రెస్‌ వైపు చూడొచ్చు అంటున్నారు.


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాల సంగతి ఎలా ఉన్న సంక్షేమ పథకాల అమలు, సాగునీరు, ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా వంటివి ఆపార్టీకి సానుకూల అంశాలు. కేసీఆర్‌ నాయకత్వం కంటే స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉండొచ్చు. గడిచిన రెండు ఎన్నికల్లోనూ కేసీఆర్‌ నాయకత్వానికే ప్రజలు జైకొట్టిన సంగతి రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పై బీజేపీ ఎన్ని విమర్శలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు ఇస్తున్న అవార్డులు, ప్రభుత్వ పనితీరుపై నీతి ఆయోగ్‌ విడుదల చేస్తున్న సూచీల్లో సంతృప్తి వ్యక్తం చేస్తుండటం బీఆర్‌ఎస్‌ కు లబ్ధి చేకూర్చవచ్చు. రాజకీయంగా విభేదాలు ఎలా ఉన్నా రాహుల్‌గాంధీపై అనర్హత వేటును తప్పుపడుతూ.. అందరికంటే ముందుగా కేసీఆరే స్పందించారు. అయితే తెలంగాణ ఇచ్చిన నేతగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పాదయాత్ర ప్రభావం ఇక్కడ ఉండొచ్చు. అంతేకాదు విభజన, విద్వేష రాజకీయాలను కన్నడ ప్రజలు తిరస్కరించారు. అలాంటిది కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తన అసంతృప్తిని, అక్కసు వెళ్లగక్కిన మోడీ ప్రభావం మాత్రం అస్సలే ఉండదు.  ధరణి, ప్రశ్నాపత్రాల లీకేజీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల వంటివి ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. అయితే ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మలుచుకుని కర్ణాటక ఫలితాలను ఇక్కడ కూడా పునరావృతం చేయాలంటే  కాంగ్రెస్‌ పార్టీ నేతలు బాగా కష్టపడితే తప్పా అది సాధ్యం కాదు. 

Labels: , , , , , , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home