Showing posts with label Eetala rajender. Show all posts
Showing posts with label Eetala rajender. Show all posts

Saturday, 6 May 2023

ఎన్నికల పోరుకు ముందే పొంగులేటికి అనేక సవాళ్లు




బీఆర్‌ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారా? ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక కన్ఫ్యూజన్‌లో ఉన్నారా? కేసీఆర్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమన్న ఆయన ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నారా? అంటే ఔననే అంటున్నారు. ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగానే బరిలోకి దిగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వనని శపథం చేసిన ఆయన ఏ పార్టీవైపు అడుగువేయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు.

ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాల్లో సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. పది నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానం గెలుపే లక్ష్యంగా కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో మీడియా అంతా ఆయనఫైనే ఫోకస్‌ పెట్టింది. కానీ ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకోబుతున్నారని వార్తలు రావడం, మరోవైపు ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని బృందంతో ఆయన భేటీ కావడంతో పొంగులేటికి ఆయన అనుచరుల నుంచే ప్రశ్నలు ఎదురవుతున్నాయని సమాచారం. వామపక్ష భావజాల ప్రభావం ఉన్న ఆ జిల్లాలో బీజేపీకి అంతగా బలం లేదు. కానీ ఆయన బీజేపీ నేతలతో సమావేశం కావడంతో ఇప్పటివరకు ఆయనపై ఉన్న కొద్దిపాటి సానుభూతి కూడా పోయింది అంటున్నారు. అలాగే ఆయనను బీఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేసిన తర్వాత ఏదో ఒక పార్టీలో చేరితో పరిస్థితి ఇక్కడిదాకా రాకపోయిది. కానీ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ ఇలా అన్ని పార్టీల నేతలతో టచ్‌లో ఉండటంతో పొంగులేటికి తాను రాజకీయంగా అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నది.

మరోవైపు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన నేతలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ప్రచారం జరుగుతున్నది. వాళ్లంతా వేరే పార్టీ పెట్టి ఒకే గొడుగు కిందికి రావాలనే ఆలోచనతో ఉన్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే ఖమ్మంలో పొంగులేటి తో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి సమావేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని స్పందన అడిగితే తనకు సమాచారం లేదన్నారు. దీన్నిబట్టి రాష్ట్ర నాయకత్వాన్ని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల నుంచి బీజేపీలో చేరిన వారికి మధ్య సఖ్యత లేదనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  బీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీలో తాను చేరుతానని గతంలో ప్రకటించారు. అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలే కాదు అదికారపార్టీ కూడా  కాంగ్రెస్‌ పార్టీనే అంంటున్నది.  మరి బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు చెబతున్నారు కదా అని కొందరు అంటుండవచ్చు. అయితే   రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటి అని అడిగితే రాజకీయంగా అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే చెబుతారు. దానికి పెద్దగా ఆలోచన కూడా అక్కరలేదు. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  తాను పార్టీలో చేరాలనేది ఆయన కార్యకర్తల అభిప్రాయం మేరకు, వ్యక్తిగత ఆలోచన మేరకు ఏదైనా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉన్నది. అయితే బీజేపీ సిద్ధాంతాలు నచ్చకున్నా బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ ను వీడి  తమ వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా కాషాయ తీర్థం పుచ్చుకుంటే ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. పొంగులేటి కూడా వారి బాటలోనే నడిస్తే రాజకీయంగా బలోపేతం కంటే ఇబ్బందులే అధికంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  ఎందుకంటే ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ వీడిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యం అని తేలడంతో ఆయన గ్రాఫ్‌ 75 శాతానికిపైగానే ఉన్నది. ఆయన కాషాయ కండువా కప్పుకున్న తర్వాత పోలింగ్‌ తేదీ నాటికి చాలా తగ్గిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉదంతాన్నికూడా ఉదాహరణగా చెబుతున్నారు.

Wednesday, 8 March 2023

ఎన్నికల తర్వాత ఇక్కడ ఏక్‌నాథ్‌ షిండే ఎవరో?


ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో దాదాపు 119 లోక్‌సభ స్థానాలు ఉండటమే దీనికి కారణం. అందుకే ఈశాన్యరాష్ట్రాలైన నాగాలాండ్‌, త్రిపుర, మేఘాలయ మొదలు దక్షిణాది రాష్ట్రాల్లో కమలం పార్టీ వికాసానికి దోహదపడిన కర్ణాటక తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాడే ఉండనున్నాయి. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి కర్ణాటక కంటే తెలంగాణకే తన ప్రధాన్యం అని రాష్ట్ర బీజేపీ కీలక నేతల భేటీలో స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే బీజేపీ అధిష్ఠానం ఇప్పటి నుంచే తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నది.


ఇక నుంచి నా దృష్టి అంతా తెలంగాణపైనే. ఆ రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా మీరంతా ముందుకు సాగాలి. పాత, కొత్త నేతలనే అనే తేడాలు వద్దు. అభిప్రాయభేదాలు ఉంటే పరిష్కరించుకోండి. చేరికలను ప్రోత్సహించండి అని ఆయన రాష్ట్ర  నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికి ఇంకా ఏడు నెలల సమయం ఉన్నది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సభ, ఉమ్మడి జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సూచించారు. 


కర్ణాటకలో ఆ పార్టీ పరిణమాలు బీజేపీ అధిష్ఠానాన్ని కలవరపరుస్తున్నాయి. పైకి అక్కడ కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా తెలంగాణపై మోడీ-షాలు దృష్టి సారించారు అంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టు కనిపిస్తున్నది. అక్కడ జరిగే నష్టాన్ని తెలంగాణలో పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయని విధంగా చేరికల కమిటీ ఒక ఏర్పాటు చేసి దానికి ఈటల రాజేందర్‌ కన్వీనర్‌గా నియమించింది. ఆయన నేతృత్వంలో పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని భావించింది. కానీ వారు ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోగా అధికార పార్టీ పై అసంతృప్తితో బీజేపీ చేరిన నేతలు తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విజయశాంతిలతో పాటు తుల ఉమ వంటి నేతలు రాష్ట్ర నాయకత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. పాత, కొత్త తేడా ఉండొద్దని అమిత్‌ షా చెప్పినా కొత్త వారికి ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన నేతలకే తగిన ప్రాధాన్యం లేదనే చర్చ జరుగుతున్నది. ఆ పార్టీలో నేతల మధ్య అంతర్గత అభిప్రాయభేదాల ఫలితంగా చాలామంది పార్టీలో చేరకపోవడానికి ముఖ్యకారణమని పార్టీ అధిష్టానం గుర్తించింది. అందుకే దీనివల్ల పార్టీలో చేరికలు లేకపోగా పార్టీకి నష్టం చేస్తున్నదని అంచనా వేసింది. పేరుకు తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారని పత్రికల్లో వచ్చినా.. నేతల మధ్య ఉన్న అంతరాలు పార్టీ పుట్టి ముంచుతుందని దాన్ని సరిచేయాలని అమిత్‌ షా సూచనలు చేశారు. 


తెలంగాణలో బీజేపీ గెలుపు అంత తేలిక కాదని వారికీ తెలుసు. అయితే గతంలో గెలిచిన నాలుగు లోక్‌సభ స్థానాలు తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు మరో మూడు నాలుగు స్థానాలు దక్కించుకోవాలన్ని ఆ పార్టీ పెద్దల వ్యూహం. మొత్తం పదిహేడు స్థానాల్లో సగం తమ ఖాతాలో వేసుకోవాలని కమలనాథులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని రెండు మూడు అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నా 20-30 స్థానాల్లో పాగా వేయవచ్చు అని, ఒకవేళ రాష్ట్రంలో హంగ్‌ లాంటి పరిస్థితి వస్తే మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ను ముందుపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ కూడా అదే వ్యూహాన్ని అమలుచేయవచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ఆ ఏక్‌నాథ్‌ షిండే ఇక్కడ ఎవరు అవుతారు అన్నది తేలుతుంది.

Monday, 2 August 2021

ఉప ఎన్నిక, ఉద్యమకారులు


హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎవరూ అన్నది వారం, పది రోజుల్లోగా అధికారికంగా వెల్లడి కానున్నది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజురాబాద్ లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఈటల బీజేపీ లో చేరిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మండలాల వారీగా ఇంచార్జి లను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారు అని అందరూ అనుకుంటుండగానే ఈ నెల రోజుల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి.
చివరికి కౌశిక్ టీ ఆర్ ఎస్ కండువా కప్పుకోవడం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా రాష్ట్ర క్యాబినెట్ ఆయనను నామినేట్ చేయడం వంటి నిర్ణయాలు చక చకా జరిగిపోయాయి. అలాగే అధికార పార్టీ ఆహ్వానం మేరకు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, ఈటల చేరిక తర్వాత బీజేపీలో అంతర్గతంగా జరిగిన పరిణామాలతో మాజీమంత్రి పెద్దిరెడ్డి ఇంకా కొంతమంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ చేరారు.

దళిత బంధు పథకం, హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యం ప్రతిపక్ష పార్టీలలో భిన్నస్వరాలకు వేదిక అయ్యాయి. కొన్నిరోజులుగా చర్చలో ఉన్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరన్నది కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఎన్నికల సందర్భంలో ఉద్యమం, ఉద్యమకారులు అనే ప్రశ్నలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ మాత్రమే చాలామంది ఉద్యమకారులను గుర్తించింది. వారి సేవలు రాష్ట్ర పునర్ నిర్మాణంలో వినియోగించుకుంటున్నది.

ఉద్యమ సమయంలో ఉద్యమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర బిందువుగా నిలిచింది. అందుకే దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో పెద్దగా ప్రధాన అంశం కాలేదు. కాని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుల విషయం ఇప్పుడు ప్రధానం అయ్యింది. బీసీ సామాజిక సమీకరణలు వంటివే కాకుండా ఈటల రాజేందర్ కు ఉద్యమ నేపథ్యం ఉండటంతో అధికార పార్టీ కూడా అలాంటి అభ్యర్థి వైపే చూసేలా చేసింది. ఈ కోణంలోనే ఉద్యమకారుడు, బీసీ అయిన టీఆర్ ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అభ్యర్థి అయితేనే గెలుపు అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయం అధికార పార్టీలో ఉన్నది. సంక్షేమ పథకాలకు తోడు ఉద్యమకారుడు వర్సెస్ ఉద్యమకారుడు అనేవి తమకు లాభిస్తాయి అనే ఆలోచనలో టీఆర్ ఎస్ అధినాయకత్వం ఉన్నదని అర్థం అవుతున్నది. గెల్లు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది ఇక. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోనున్నది.

- ఆసరి రాజు

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...