హైదరాబాద్: అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉన్నప్పటికీ.. తాను ఆ అధికారం వినియోగించలేదని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పలు అంశాలపై స్పందించారు.
‘‘శాసనసభలో సభ్యుడు కాకపోయినా తాతా మధుపై చర్యలు తీసుకునే అధికారం నాకుంది. అయితే బీఆర్‌ఎస్‌లాగా వెంటనే బహిష్కరించలేను. ఏ విషయంలోనైనా మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నాం’’ అని స్పీకర్ పేర్కొన్నారు.
అసెంబ్లీ వద్ద మహిళా సభ్యుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాహుల్‌గాంధీ నల్ల టీషర్ట్ ధరించి పార్లమెంట్‌కు వెళ్లారని, అయితే ఆయన టీషర్ట్‌పై అదానీ ఫొటో లేదని ప్రసాద్‌కుమార్ తెలిపారు.
తాతా మధు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వచ్చి క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని చెప్పారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సభకు హాజరు కావాలని కేసీఆర్‌ను తాను కోరుతూనే ఉన్నానని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, తాను సభను నడపలేనని ఈరోజు స్పష్టం చేసినట్లు ప్రసాద్‌కుమార్ తెలిపారు. తన స్థానంలో ప్యానల్ స్పీకర్ కడియం శ్రీహరి సభా కార్యక్రమాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు.