- 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధ్యం – పీయూష్ గోయల్
- 7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని మోడీ నాయకత్వానికి, ప్రజలకు అభినందనలు
న్యూఢిల్లీ: డేటా సెంటర్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం , సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సాధించడంపై ఈ రంగానికి చెందిన భాగస్వాములందరితో ఎంతో ఆసక్తికరమైన రౌండ్ టేబుల్ చర్చలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా భారత్ నిలుస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
రెండు చోట్ల యుద్ధాలు జరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, హెచ్చుతగ్గులు నెలకొన్నటువంటి అత్యంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో కూడా తొలి త్రైమాసికంలో భారత్‌కు 7.8 శాతం జీడీపీ వృద్ధిని అందించిన దేశ ప్రజలను చూసి గర్విస్తున్నానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన, 'వికసిత్ భారత్ 2047' దిశగా సాగుతున్న అమృత్ కాలంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ నమ్మకాన్ని నింపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ నిశ్చయాత్మక నాయకత్వాన్ని కొనియాడారు.
డేటా సెంటర్, సెమికండక్టర్ పరిశ్రమలు, భారత్ చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రయాణం, నాణ్యమైన ఉత్పత్తుల కోసం భారత్ తయారీ కేంద్రంగా మారడం వంటి అంశాలన్నీ రాబోయే రోజుల్లో దేశ ప్రగతిని మరిన్ని ఎత్తులకు తీసుకెళ్తాయని గోయల్ స్పష్టం చేశారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవే ఇంధనంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ సమావేశం ఎంతో సానుకూల ధోరణిలో, అత్యంత సమర్థవంతంగా జరిగిందని ఆయన చెప్పారు. అంతకుముందు జరిగిన చర్చల ఆధారంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. పరిశ్రమ వర్గాల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయని, డేటా సెంటర్ల రంగంలోకి ఏకంగా 200 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు. భారత్‌ను ప్రపంచానికే 'డేటా సెంటర్'గా ఎలా మార్చవచ్చనే దానిపై ఎన్నో సరికొత్త ఆలోచనలు, అవగాహనతో ఈ సమావేశం ముగిసిందని పీయూష్ గోయల్ వివరించారు.

No comments:
Post a Comment