Monday, 30 March 2026

హేట్ స్పీచ్ బిల్లు ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్


  • అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం
  • ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎల్పీ నేత ధ్వజం
  • బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్


హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'హేట్ స్పీచ్ బిల్లు'పై భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లు భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఉందని, ప్రజాస్వామ్య గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకరమైన చట్టాన్ని తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు. శాంతిభద్రతల పేరుతో తీసుకువస్తున్న ఈ బిల్లు పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనలా కనిపిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీసే సామాన్యులపై కక్ష సాధించేందుకే ఈ నిబంధనలను రూపొందించారని ఆయన విమర్శించారు.



ఈ బిల్లులోని అస్పష్టమైన అంశాల వల్ల సామాన్యులకు సంకెళ్లు పడతాయని, అధికారులకు మాత్రం ఇది రక్షణ కవచంలా మారుతుందని మహేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన నిజాం నవాబు లేదా ఇందిరా గాంధీ వంటి వ్యక్తుల గురించి మాట్లాడినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేలా నిబంధనలు ఉండటం దారుణమన్నారు. ఆధారాలు లేకున్నా, నేరం నిరూపణ కాకముందే జైలుకు పంపే అధికారం పోలీసులకు కల్పించడం పౌర స్వేచ్ఛకు విఘాతమని ధ్వజమెత్తారు. ముఖ్యంగా బిల్లులోని 'సెక్షన్ 4' అనేది ప్రజాస్వామ్యానికి ఒక డెత్ వారెంట్ లాంటిదని ఆయన అభివర్ణించారు.


రాజకీయ కక్షసాధింపు చర్యల కోసం ఇలాంటి నల్ల చట్టాలను తీసుకురావద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంతటి కీలకమైన బిల్లును ఆమోదించే ముందు హౌస్ కమిటీ వేయాలని, క్షుణ్ణంగా చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి పంపి, దానిపై సమగ్రమైన రివ్యూ నిర్వహించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పట్టుబట్టారు. ఈ బిల్లును తమ పార్టీ తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

కేరళలో ఎవరి మధ్య పొత్తు ఉందో అందరికీ తెలుసు


  • మోడీ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ధ్వజం
  • పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్.
  • గ్యాస్ ధరల పెరుగుదలపై ఆందోళన


కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ‘పొత్తు’ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. కేరళలో ఎల్‌డీఎఫ్ , యూడీఎఫ్ కూటముల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్న ప్రధాని ఆరోపణలను తిప్పికొడుతూ, అసలు పొత్తు ఎవరి మధ్య ఉందో కేరళ ప్రజలందరికీ బాగా తెలుసని ఆమె ఎద్దేవా చేశారు. ప్రధాని ఎన్ని చెప్పినా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం మారదని, ప్రజలు సత్యాన్ని గమనిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై కేంద్ర సంస్థలు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



రాజకీయ విమర్శలతో పాటు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా భారత్‌పై పడుతున్న ఆర్థిక ప్రభావాన్ని చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. యుద్ధం వల్ల సరఫరా గొలుసు దెబ్బతిని దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. యుద్ధం వంటి సున్నితమైన అంశాలపై రాజకీయం చేయడం తమ ఉద్దేశ్యం కాదని, అయితే దీనివల్ల తలెత్తుతున్న సవాళ్లకు పరిష్కారాలను వెతకడమే తమ లక్ష్యమని ఆమె వివరించారు.



పశ్చిమాసియా సంక్షోభం విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ముందస్తు ప్రణాళికలు ,సన్నద్ధతను పార్లమెంట్ వేదికగా దేశానికి వెల్లడించాలని ప్రియాంక కోరారు. ఇంధనం , గ్యాస్ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పారదర్శకత ఉండాలని, అప్పుడే అందరం కలిసి భవిష్యత్తు వ్యూహాలపై పని చేయగలమని ఆమె చెప్పారు. ప్రధాని మోడీ కేవలం పరిస్థితిని వివరించడం కాకుండా, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరపడం ద్వారా ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రియాంక గాంధీ సూచించారు.

పినరయి విజయన్ రిమోట్ కంట్రోల్ మోడీ చేతిలోనే


  • కేరళలో  కార్పొరేట్ సంస్థగా మారిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం
  •  రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!


కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పతనంతిట్టలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ అధికార ఎల్డీఎఫ్ (LDF) కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తన సిద్ధాంతాలను పక్కనబెట్టి ‘కార్పొరేట్ నిధులతో నడిచే ప్రభుత్వం’గా మారిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నియంత్రిస్తున్నారని, విజయన్ అవినీతికి సంబంధించిన ఫైళ్లు మోడీ వద్ద ఉండటమే ఇందుకు కారణమని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెడుతుంటే, కేరళ ముఖ్యమంత్రిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఈ రహస్య ఒప్పందానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.



ఎన్నికల బరిలో ఎల్డీఎఫ్ , బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, యూడీఎఫ్ (UDF) కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఈ ‘అపవిత్ర కలయిక’ ఏర్పడిందని రాహుల్ గాంధీ విమర్శించారు. శబరిమల ఆలయ బంగారం దొంగతనం వంటి కీలక అంశాలను నిన్న కేరళలో పర్యటించిన ప్రధాని మోడీ ప్రస్తావించకపోవడం వెనుక ఉన్న అంతర్యాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలను విస్మరించి కేవలం కార్పొరేట్శక్తులకే కొమ్ముకాస్తోందని, కాంగ్రెస్ మాత్రమే బీజేపీని , వారి రహస్య మిత్రులను ఢీకొట్టగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 9న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, యూడీఎఫ్ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , వృద్ధులకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం వంటి పథకాలను అమలుచేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

Sunday, 29 March 2026

వ్యాధి చికిత్స నుంచి నివారణ దిశగా భారత్ అడుగులు

 

  •  జీవనశైలి జబ్బులపై యుద్ధానికి కేంద్రం ‘యోగాస్త్రం’
  • మధుమేహం, రక్తపోటు నియంత్రణకు ప్రత్యేక నిబంధనలు
  • చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ కొత్త యోగా ప్రోటోకాల్స్


దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అసంక్రమిత వ్యాధుల (NCDs) భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చికిత్స కంటే నివారణే మిన్న అనే నినాదంతో, వివిధ అనారోగ్య సమస్యలు , నిర్దిష్ట వయస్సు గల వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన "యోగా ప్రోటోకాల్‌"ను కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఈ నెలలో జరిగిన యోగా మహోత్సవ్ 2026లో ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహకారంతో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ శాస్త్రీయ నిబంధనలను రూపొందించింది. ప్రస్తుతం భారతదేశంలో సంభవిస్తున్న మరణాలలో దాదాపు మూడింట రెండు వంతులు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, మానసిక రుగ్మతల వల్లే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో, ఈ యోగా ప్రోటోకాల్ ఒక కీలకమైన ముందడుగుగా నిలవనుంది.



ఈ నూతన విధానం ప్రకారం, ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాల పాటు ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం , విశ్రాంతి పద్ధతులను కలిపి ఒక క్రమపద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాకుండా, శాస్త్రీయ ఆధారాలతో కూడిన క్లినికల్ మాడ్యూల్ అని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా వివరించారు. ఉదాహరణకు, మధుమేహం ఉన్నవారికి మెటబాలిక్ బ్యాలెన్స్ మెరుగుపరిచేలా, రక్తపోటు ఉన్నవారికి నరాల వ్యవస్థను శాంతపరిచేలా,  ఆస్తమా రోగులకు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేలా ఈ ప్రోటోకాల్స్‌లో ప్రత్యేక మార్పులు చేశారు. చిన్నపిల్లల కోసం సరదాగా ఉండే యోగా పద్ధతులు, కౌమార దశలో ఉన్నవారికి మానసిక ప్రశాంతతనిచ్చే వ్యాయామాలు, గర్భిణీ స్త్రీలు , వృద్ధుల కోసం ప్రత్యేక కదలికలతో కూడిన గైడ్‌లైన్స్‌ను ఇందులో చేర్చారు.




యోగా అనేది కేవలం భారతదేశ సాంస్కృతిక వారసత్వం మాత్రమే కాదని, ఆధునిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఉద్ఘాటించారు. ఈ విధానం ద్వారా ప్రతి పౌరుడు తమ ఆరోగ్యంపై తామే నియంత్రణ సాధించవచ్చని, తద్వారా దీర్ఘకాలంలో దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలపై పడే ఒత్తిడిని తగ్గించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కనీస ఖర్చుతో పాఠశాలలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో ఈ ప్రోటోకాల్స్‌ను అమలు చేయవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, యోగాను ఒక కాలానుగుణ అభ్యాసం నుండి నిత్యకృత్యంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ చొరవతో ప్రపంచవ్యాప్తంగా యోగాను ఒక సంపూర్ణ ఆరోగ్య పరిష్కారంగా ప్రచారం చేయడంలో భారత్ తన అగ్రగామి పాత్రను మరోసారి చాటుకుంది.





వాంఖడేలో ‘హిట్‌మ్యాన్’ సునామీ.


  • 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ ఘనవిజయం!
  •  రోహిత్, రికిల్టన్ మెరుపు హాఫ్ సెంచరీలతో భారీ లక్ష్యం ఛేదన!


ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌కు ఉన్న ఒక వింతైన రికార్డుకు ఎట్టకేలకు తెరపడింది. గత 13 సీజన్లుగా తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోతున్న ముంబై జట్టు, ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. కోల్‌కతా నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే (19.1 ఓవర్లలో) 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన వింటేజ్ ఆటతీరుతో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించారు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసిన రోహిత్, తన ట్రేడ్ మార్క్ ‘కవర్ డ్రైవ్స్’, ‘పుల్ షాట్స్’తో ప్రేక్షకులకు కనువిందు చేశారు.



మరోవైపు ఓపెనర్ రయన్ రికిల్టన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో కోల్‌కతా బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్న ఆయన, 43 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో 81 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్-రికిల్టన్ జోడీ మొదటి వికెట్‌కు కేవలం 72 బంతుల్లోనే 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ముంబైని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టారు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18 నాటౌట్), నమన్ ధీర్ (5 నాటౌట్) సంయమనంతో ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.


అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే 40 బంతుల్లో 67 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, అంగ్‌క్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 51 పరుగులతో మెరిశారు. ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి కోల్‌కతా జోరుకు అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా 250 పరుగుల మైలురాయిని అందుకోలేకపోయింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తమ వేటను విజయంతో మొదలుపెట్టింది.

రష్యా చమురు ఆదాయానికి భారీ గండి


  • ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో కీలక పోర్టు ధ్వంసం!

లెనిన్‌గ్రాడ్/కీవ్: రష్యా ఆర్థిక మూలాలపై ఉక్రెయిన్ మరోసారి విరుచుకుపడింది. రష్యా చమురు ఎగుమతుల్లో అత్యంత కీలకమైన ఉస్త్-లుగా (Ust-Luga) నౌకాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు విధ్వంసం సృష్టించాయి. వారం వ్యవధిలోనే రెండోసారి జరిగిన ఈ దాడితో రష్యా ఇంధన ఎగుమతులకు భారీ ఆటంకం ఏర్పడింది.గత వారం జరిగిన దాడిలో ఈ పోర్టు కొంత మేర దెబ్బతినడంతో ఇప్పటికే ఎగుమతులు నిలిచిపోయాయి. తాజాగా ఆదివారం మరోసారి ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. లెనిన్‌గ్రాడ్ ప్రాంత గవర్నర్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. తాము సుమారు 31 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించారు.



  • ఉస్త్-లుగా పోర్టు ప్రాధాన్యం

బాల్టిక్ సముద్ర ప్రాంతంలో రష్యాకు ఇది అత్యంత వ్యూహాత్మకమైన కేంద్రం. సముద్ర మార్గంలో రష్యా చేసే మొత్తం చమురు ఎగుమతుల్లో 45% వరకు ఈ ప్రాంతం నుంచే జరుగుతాయి. ఇక్కడి నుండి రోజుకు సుమారు 1.72 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతుంది.రష్యా నుంచి భారత్‌కు ఇంధనం సరఫరా చేసే కీలక పోర్టుల్లో ఇది కూడా ఒకటి.


  • రష్యా ఆర్థిక వ్యవస్థపై గురి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో, రష్యా తన లోటు బడ్జెట్‌ను పూరించుకోవాలని భావించింది. అయితే ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యా ఇంధన పరిశ్రమనే లక్ష్యంగా చేసుకుంటోంది. కేవలం ఈ నెలలోనే ఇంధన సంస్థలపై 10 భారీ దాడులు జరిగాయి. గత వారం సర్టోవ్ ప్రాంతంలోని చమురు శుద్ధి కర్మాగారంపై కూడా దాడులు జరిగాయి.తమ సుదీర్ఘ శ్రేణి డ్రోన్లు రష్యా అంతర్భాగంలోకి వెళ్లి తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యా యుద్ధం కొనసాగించడానికి అవసరమైన ఆర్థిక వనరులను దెబ్బతీయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు


  • పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లను సృష్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. తన 132వ ‘మన్‌ కీ బాత్‌’ (Mann Ki Baat) కార్యక్రమంలో భాగంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సాగిస్తున్న తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.



  • ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు

గత నెల రోజులుగా అమెరికా-ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం పరిస్థితులను పూర్తిగా మార్చేసిందని ప్రధాని పేర్కొన్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో, ఈ యుద్ధాలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయని ఆయన వివరించారు. ముఖ్యంగా ఇంధన సరఫరా కేంద్రాల్లో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తిందని గుర్తుచేశారు.


  • ప్రవాస భారతీయుల భద్రత

గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు అండగా నిలుస్తున్న ఆయా దేశాల ప్రభుత్వాలకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు.


  • రాజకీయ లబ్ధి కోసం తప్పుడు సమాచారం

ఈ సంక్షోభాన్ని కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మోదీ హెచ్చరించారు. "ఇది 140 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇక్కడ రాజకీయాలకు తావు లేదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారు పద్ధతి మార్చుకోవాలని, ప్రజలు కేవలం ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

అమెరికాకు కోలుకోలేని దెబ్బ : ఇరాన్ దాడిలో 'అవాక్స్' నిఘా విమానం ధ్వంసం!

 


అమెరికాకు కోలుకోలేని దెబ్బ

ఇరాన్ దాడిలో 'అవాక్స్' నిఘా విమానం ధ్వంసం!

రియాద్/వాషింగ్టన్: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు గట్టి షాక్ తగిలింది. యుద్ధ రంగంలో అమెరికా దళాలకు 'కళ్లు, చెవుల' వంటి కీలకమైన ఈ3-సెంట్రీ (E-3 Sentry AWACS) నిఘా విమానాన్ని ఇరాన్ దళాలు ధ్వంసం చేశాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా జరిగిన దాడిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రముఖ పత్రిక 'వాల్‌స్ట్రీట్ జర్నల్' వెల్లడించింది.


ఏమిటీ ఈ3-సెంట్రీ? ఎందుకంత కీలకం?

ఈ విమానం సాధారణ యుద్ధ విమానం కాదు. బోయింగ్-707 మోడల్‌ను అధునాతనంగా మార్చి, ఆకాశంలోనే ఒక కమాండ్ సెంటర్ లాగా దీనిని రూపొందించారు. దీని ప్రత్యేకతలు ఏమిటంటే.. 250 మైళ్ల పరిధిలో శత్రువుల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాల కదలికలను ఇట్టే పసిగడుతుంది. గగనతల దాడులను పర్యవేక్షించడంలోనూ, అమెరికా యుద్ధ విమానాలకు దిశానిర్దేశం చేయడంలోనూ ఇది అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఈ విమానం కోల్పోవడం వల్ల గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నిఘా సామర్థ్యం దెబ్బతింటుందని ఎయిర్ ఫోర్స్ కర్నల్ జాన్ వెనబల్ ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్: అమెరికాకు గుండెకాయ

సౌదీలోని ఈ ఎయిర్ బేస్ నుంచే ఇరాన్ వైపు వెళ్లే విమానాలకు ఇంధనం నింపడం, ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడం వంటి కీలక ఆపరేషన్లు జరుగుతాయి. ఈ కేంద్రంపైనే ఇరాన్ దాడి చేయడంతో అమెరికా రక్షణ వ్యవస్థలో లోపాలు బయటపడ్డాయి.


యుద్ధ క్షేత్రంలో తాజా పరిస్థితి

ఇరాన్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 303 మంది అమెరికా సైనికులు గాయపడగా, వారిలో 273 మంది కోలుకుని తిరిగి విధుల్లో చేరారు.

పరిస్థితి విషమిస్తుండటంతో అమెరికా 3,500 మంది మెరైన్లను పశ్చిమాసియాకు తరలించింది.యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ (USS Tripoli) నేడు సెంట్రల్ కమాండ్ పరిధిలోకి చేరుకుంది. దీంతో అమెరికా ఇక నేరుగా భూతల దాడులకు (Ground Operations) దిగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

యుద్ధం వద్దంటూ.. అమెరికా వ్యాప్తంగా 'ట్రంప్' వ్యతిరేక సెగలు



వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై అగ్రరాజ్యంతో పాటు ఐరోపా దేశాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. "యుద్ధం వద్దు.. శాంతి ముద్దు" అనే నినాదంతో లక్షలాదిమంది రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

  • 50 రాష్ట్రాలు.. 3,200 కార్యక్రమాలు

ట్రంప్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో సుమారు 3,200 నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాలు నిరసనకారులతో కిక్కిరిసిపోయాయి. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అతిపెద్ద ఆందోళనలుగా వీటిని అమెరికా మీడియా అభివర్ణిస్తోంది.

  • ప్రధాన డిమాండ్లు ఇవే

నిరసనకారులు ప్రధానంగా మూడు అంశాలపై గళమెత్తారు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రను తీవ్రంగా వ్యతిరేకించారు. పౌరుల స్వేచ్ఛకు విఘాతం కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వలస విధానాలపై ట్రంప్ కఠిన వైఖరిని ఎండగట్టారు.

  • ఉద్రిక్త పరిస్థితులు.. టియర్ గ్యాస్ ప్రయోగం

ఈ ఆందోళనలకు మిన్నెసోటా కేంద్ర బిందువుగా మారింది. సెయింట్ పాల్‌లో జరిగిన భారీ ర్యాలీపై స్పందించిన గవర్నర్ టిమ్ వాల్జ్, ఇవి ప్రజాస్వామ్య విలువలకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల పరిస్థితులు అదుపు తప్పాయి. లాస్‌ ఏంజెలెస్‌లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వద్ద ఆందోళనకారులు వస్తువులను విసిరివేయడంతో భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. డల్లాస్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

  • ఖండ ఖండాలూ దాటిన నిరసన

ఈ వ్యతిరేకత కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ఐరోపాలోని ప్రముఖ నగరాలైన లండన్, ప్యారిస్, రోమ్ లలో కూడా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు, ఈ ఆందోళనలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని రిపబ్లికన్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.

Saturday, 28 March 2026

ఐపీఎల్ లో 'కింగ్' కోహ్లీ విశ్వరూపం


  • విరాట్ కెరీర్‌లో టాప్-5 చిరస్మరణీయ సీజన్లు ఇవే
  • 2016 పరుగుల సునామీ నుంచి నేటి వరకు అప్రతిహత ప్రస్థానం


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు వినబడగానే పరుగుల వరద గుర్తొస్తుంది. లీగ్ ఆరంభం నుంచి ఒకే జట్టుకు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఆడుతూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన కోహ్లీ కెరీర్‌లో ఐదు సీజన్లు అత్యంత కీలకంగా నిలిచాయి. వీటిలో 2016 సీజన్ క్రికెట్ ప్రపంచం ఎన్నటికీ మరువలేనిది. ఆ ఏడాది కోహ్లీ ఏకంగా 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 973 పరుగులు సాధించి ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ జట్లపై ఆయన బాదిన శతకాలు ఇప్పటికీ అభిమానుల కళ్లముందే కదలాడుతుంటాయి. ముఖ్యంగా వేళ్లకు గాయమైనా పట్టువదలకుండా పంజాబ్‌పై చేసిన సెంచరీ ఆయన అంకితభావానికి నిదర్శనం.



కోహ్లీ ప్రస్థానంలో 2024 సీజన్ మరో మైలురాయిగా నిలిచింది. ఆ సీజన్‌లో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్న విరాట్, తనలోని మునుపటి దూకుడును మళ్లీ ప్రపంచానికి చాటిచెప్పాడు. స్ట్రైక్ రేట్ విషయంలో వస్తున్న విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానమిస్తూ ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే 2013 సీజన్ కూడా కోహ్లీ కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. ఆ ఏడాది మొదటిసారిగా ఒకే సీజన్‌లో 600 పరుగుల మార్కును దాటి (634 పరుగులు) లీగ్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా తన ముద్ర వేశాడు. ఆ సీజన్‌లోనే ఆయన నాయకత్వ పటిమ కూడా వెలుగులోకి వచ్చింది.



2018 - 2023 సీజన్లు కూడా కోహ్లీ పరుగుల వేటలో అగ్రస్థానంలో ఉన్నాయి. 2018లో జట్టు కష్టాల్లో ఉన్నప్పటికీ ఒంటిచేత్తో పోరాడి 530 పరుగులు సాధించగా, 2023లో వరుసగా రెండు సెంచరీలు బాది 639 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఈ ఐదు సీజన్ల గణాంకాలను పరిశీలిస్తే కోహ్లీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా ఎదిగాడో అర్థమవుతుంది. ప్రతి సీజన్‌లోనూ తన ఆటను మెరుగుపరుచుకుంటూ, ఫిట్‌నెస్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న కోహ్లీ, 2026 సీజన్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్ ఉన్నంత కాలం కోహ్లీ సృష్టించిన ఈ పరుగుల రికార్డులు అజేయంగా నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

హైదరాబాద్‌పై బెంగళూరు ఘనవిజయం


  • చిన్నస్వామిలో విరాట్ కోహ్లీ విధ్వంసం
  • పడిక్కల్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ బోణీ


బెంగళూరు: ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ శనివారం రాత్రి బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పాత ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 38 బంతుల్లో 80 పరుగులతో మెరుపుదాడి చేయగా, చివర్లో అనీకేత్ వర్మ 18 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆర్సీబీ బౌలర్లలో అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ 22 పరుగులకే 3 వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.



అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. పడిక్కల్ కేవలం 21 బంతుల్లోనే 61 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. అతనికి తోడుగా కింగ్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో 34 బంతుల్లో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ క్లాస్ షాట్లకు తోడుగా గ్లెన్ మాక్స్‌వెల్ చివర్లో వేగంగా ఆడి మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీసినప్పటికీ, పడిక్కల్-కోహ్లీ జోడీని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి తన టైటిల్ వేటను మొదలుపెట్టింది.


ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ ఆటగాళ్లు నల్లటి రిబ్బన్లను ధరించి మైదానంలోకి దిగడం అందరినీ ఆకర్షించింది. గతేడాది టైటిల్ వేడుకల సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. మైదానమంతా 'ఆర్సీబీ.. ఆర్సీబీ' నినాదాలతో దద్దరిల్లగా, హోమ్ గ్రౌండ్‌లో కోహ్లీ సేన చూపిన ఆధిపత్యం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మెరుగైన ప్రదర్శన చేసిన జాకబ్ డఫీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Friday, 27 March 2026

ఐపీఎల్ పిచ్‌లపై వికెట్ల వేట

 





  • ఒకే సీజన్‌లో ప్రత్యర్థులను వణికించిన టాప్ బౌలర్లు వీరే
  • రికార్డుల రారాజుగా నిలిచిన హర్షల్ పటేల్!


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే బ్యాటర్ల ధాటిని తట్టుకుని బౌలర్లు తమ ప్రతిభను చాటుకునే వేదిక. గత 17 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణంలో కొంతమంది బౌలర్లు ఒకే సీజన్‌లో అసాధారణ ప్రదర్శనతో వికెట్ల వర్షం కురిపించారు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ బౌలర్ హర్షల్ పటేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2021 సీజన్‌లో హర్షల్ ఏకంగా 32 వికెట్లు పడగొట్టి డీజే బ్రావో రికార్డును సమం చేశాడు. హర్షల్ పటేల్ వేసిన స్లో డెలివరీలు , డెత్ ఓవర్లలోని కచ్చితత్వం అతనికి పర్పుల్ క్యాప్‌ను అందించడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలబెట్టాయి.


హర్షల్ పటేల్‌తో పాటు వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ డ్వేన్ బ్రావో కూడా 2013 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున 32 వికెట్లు తీసి ఈ రికార్డులో భాగస్వామిగా ఉన్నాడు. బ్రావో తనదైన శైలిలో వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో దిట్ట. వీరిద్దరి తర్వాత 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన కాగిసో రబాడా 30 వికెట్లు తీసి మూడో స్థానంలో నిలిచాడు. రబాడా వేగం , యార్కర్లు ఆ సీజన్‌లో ఢిల్లీని ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాయి. అలాగే, 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ 28 వికెట్లతో అదరగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.



వీరితో పాటు 2022లో వానిందు హసరంగ (26 వికెట్లు), 2017లో భువనేశ్వర్ కుమార్ (26 వికెట్లు) వంటి బౌలర్లు కూడా ఒకే సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారి జాబితాలో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ వరుసగా రెండు సీజన్లలో పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ వేదిక ఏదైనా బౌలర్లు తమ కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో మ్యాచ్ ఫలితాలను మార్చేయగలరని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఈ రికార్డులను ఎవరైనా తిరగరాస్తారా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'టీమ్ ఇండియా' స్ఫూర్తితో పనిచేద్దాం


  • ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ
  • సరఫరా గొలుసు దెబ్బతినకుండా చూడాలని ఆదేశం


పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం ఎదుర్కోబోయే సవాళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ భేటీలో, యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా తలెత్తే మార్పులు భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరాపై ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'టీమ్ ఇండియా' స్ఫూర్తితో కలిసి పనిచేస్తేనే ఈ క్లిష్ట పరిస్థితిని సమర్థవంతంగా అధిగమించగలమని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. సరఫరా గొలుసు (Supply Chain) ఎక్కడా దెబ్బతినకుండా చూడటమే కాకుండా, యుద్ధం సాకుతో అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రులను ఆదేశించారు.



ముఖ్యంగా ఇంధన భద్రత , ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల తలెత్తే అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర , జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను వెంటనే క్రియాశీలకం చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, రాబోయే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, సరిహద్దు ,  తీరప్రాంత రాష్ట్రాలు నౌకాయానం మరియు సముద్ర కార్యకలాపాలకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని నొక్కి చెప్పారు. సామాన్య పౌరుల ప్రయోజనాలను కాపాడటమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.


ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు వార్తలు, వదంతుల పట్ల ప్రధాని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్లో భయాందోళనలు కలగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించాలని రాష్ట్రాలకు సూచించారు. పశ్చిమాసియాలో ఉన్న భారతీయుల క్షేమం కోసం కేంద్రం ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు చేపట్టిందని, వారికి సహాయం చేయడానికి రాష్ట్రాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు , నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రం తీసుకుంటున్న ముందస్తు చర్యలను ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా అభినందించారు. ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతో ఊరటనిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.

పెట్రోల్, గ్యాస్ సరఫరాపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!




దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సరఫరాకు సంబంధించి కేంద్ర పెట్రోలియం  సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని, ఎక్కడా ఎటువంటి కొరత లేదని స్పష్టం చేసింది. కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో ఇంధన కొరత అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు జరుగుతున్న ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. అన్ని రీటైల్ బంకుల్లో తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, ఇంధన భద్రత విషయంలో దేశం సురక్షితంగా ఉందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. మరోవైపు, అంతర్జాతీయంగా భారత నౌకల రాకపోకలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వివరాలు వెల్లడించారు. అత్యంత ప్రమాదకరంగా మారిన హార్ముజ్ జలసంధి గుండా ఇప్పటికే నాలుగు భారీ ఎల్‌పీజీ నౌకలు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాయని ఆయన తెలిపారు. మన దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని దేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతోందని ఆయన వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు. గ్లోబల్ డైనమిక్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ, భారత నౌకల సురక్షిత ప్రయాణానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పునరుద్ఘాటించారు.

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు


శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామనామ స్మరణతో మారుమోగిపోయింది. దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన భారీ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రధాన వీధుల గుండా సాగిన ఈ యాత్రలో భక్తులు కాషాయ జెండాలు చేబూని, సంప్రదాయ వాయిద్యాల నడుమ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. శ్రీరాముడి ప్రతిమలతో అలంకరించిన రథాలు , రామలక్ష్మణుల వేషధారణలో ఉన్న కళాకారులు ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.






Wednesday, 25 March 2026

లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు 2026కు ఆమోదం


  • భారత్ 'సంస్కరణల ఎక్స్‌ప్రెస్' మీద వెళ్తోంది
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 

న్యూఢిల్లీ, మార్చి 25 (తెలుగుప్రభ): పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్‌సభ  చారిత్రక ఘట్టాన్ని పూర్తి చేసింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 'ఫైనాన్స్ బిల్లు 2026'కు 32 ప్రభుత్వ సవరణలతో కలిపి దిగువ సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోద ప్రక్రియలో లోక్‌సభ తన వంతు బాధ్యతను పూర్తి చేసినట్లయింది. ఈ బిల్లు ఆమోదం సందర్భంగా ఆర్థికమంత్రి ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్' (సంస్కరణల వేగం) మీద ప్రయాణిస్తోందని, ఈ సంస్కరణలు ఏదో ఒత్తిడి వల్ల కాకుండా, దేశాభివృద్ధిపై ఉన్న స్పష్టమైన దృక్పథం మరియు నమ్మకంతో చేపడుతున్నామని స్పష్టం చేశారు.



సామాన్యుడిపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌లో 17 రకాల ప్రాణరక్షక మందులపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం మినహాయించిందని మంత్రి వివరించారు. అలాగే, చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం నియమ నిబంధనలను సరళతరం చేస్తూ ఆటోమేటెడ్ వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. "మనం ఇప్పుడు రియాక్టివ్ పద్ధతుల్లో కాకుండా, వ్యవస్థాగతమైన స్పష్టతతో ఆర్థిక పాలన సాగిస్తున్నాం. వ్యాపారవేత్తలు, సాధారణ పౌరులు లైసెన్సులు, కోటాలు , అనవసరపు నిబంధనలతో ఇబ్బంది పడకుండా 'ఈజ్ ఆఫ్ లివింగ్'ను పెంపొందించడమే మా ప్రధాన ఉద్దేశం" అని ఆమె పేర్కొన్నారు. విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలకు సమాధానమిస్తూ, నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకమైన పన్ను యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు హామీ ఇచ్చారు.


మరోవైపు, రాజ్యసభలో కూడా బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 'లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు 2026'కు ఎగువ సభ ఆమోదం తెలిపింది. అలాగే, విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రేపు (గురువారం) రామ నవమి సందర్భంగా పార్లమెంటుకు సెలవు ప్రకటించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఫైనాన్స్ బిల్లుపై చర్చ కోసం రాజ్యసభ తిరిగి శుక్రవారం (మార్చి 27) ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. బడ్జెట్ ఆమోద ప్రక్రియను ఈ వారంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సరిహద్దుల్లో 'ఉక్కు' కోటలు


బీఆర్వో బలోపేతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సమీక్ష

ఇండో-మయన్మార్ బోర్డర్‌లో 1,600 కిలోమీటర్ల మేర వ్యూహాత్మక రహదారులు!

న్యూఢిల్లీ, మార్చి 25: దేశ రక్షణలో అత్యంత కీలకమైన సరిహద్దు రహదారుల సంస్థ (BRO) పనితీరుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశ భద్రత, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల కల్పన, సరిహద్దుల్లో సైనిక సంసిద్ధతను మెరుగుపరిచే అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సరిహద్దుల్లో పటిష్టమైన మౌలిక సదుపాయాలు కేవలం రక్షణకే కాకుండా, ఆ ప్రాంతాల అభివృద్ధికి మరియు అనుసంధానానికి వెన్నెముక వంటివని రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్వో నిర్మిస్తున్న రహదారులు అక్కడి ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయని ఆయన కొనియాడారు.



భారత్-మయన్మార్ సరిహద్దు వెంబడి సుమారు 1,600 కిలోమీటర్ల మేర మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వం బీఆర్వోకు అప్పగించింది. ఇది మన సరిహద్దు నిర్వహణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని రక్షణ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అలాగే 'బోర్డర్ రోడ్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ 2023-28' కింద చేపట్టిన 1,000కి పైగా ప్రాజెక్టుల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. గడ్డకట్టే చలి ఉండే హిమాలయ ప్రాంతాల్లో కూడా అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా రహదారులు, వంతెనలు, సొరంగాలు నిర్మించేందుకు అత్యాధునిక 'ప్రీకాస్ట్' సాంకేతికతను ,మాడ్యులర్ బ్రిడ్జిలను వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా బీఆర్వోకు బడ్జెట్ పరంగా, ఆధునిక పరికరాల పరంగా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.


బీఆర్వో డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ ఈ సందర్భంగా సంస్థ సాధించిన విజయాలను వివరించారు. 1960లో స్థాపించబడినప్పటి నుండి బీఆర్వో ఇప్పటివరకు 64,000 కిలోమీటర్ల రహదారులు, 1,179 వంతెనలు, 22 విమానాశ్రయాలను నిర్మించిందని తెలిపారు. కేవలం దేశంలోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్ ,తజికిస్థాన్ వంటి మిత్ర దేశాల్లో కూడా బీఆర్వో కీలక ప్రాజెక్టులను పూర్తి చేసిందని పేర్కొన్నారు. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో పని చేసే కార్మికులు ,సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన కమిటీకి వివరించారు. 'వికసిత్ భారత్ 2047' లక్ష్యంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల సామాజిక-ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో బీఆర్వో పాత్ర అసమానమైనదని ఈ సమావేశంలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ , ఇతర ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

అమెరికా-ఇరాన్ యుద్ధంలో అనూహ్య మలుపు


  • శాంతి చర్చలపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
  • పశ్చిమాసియాలో ముగియనున్న ఉద్రిక్తతలు?

వాషింగ్టన్/టెహ్రాన్: కొన్నిరోజులుగా పశ్చిమాసియాను వణికిస్తున్న అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఇరాన్‌లో అధికార మార్పిడి తమ లక్ష్యం కాదని, కేవలం శాంతిని నెలకొల్పడమే తమ ధ్యేయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలీబాఫ్ సంధి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో, ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలకు తలుపులు తెరుచుకున్నాయని, త్వరలోనే ఒక శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.



  • సంధి దిశగా అడుగులు

హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం, ఆర్థికవ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో, యుద్ధానికి స్వస్తి పలకాలని ఇరు దేశాలపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ నాయకత్వం కూడా ఆర్థిక ఆంక్షల నుండి ఉపశమనం పొందేందుకు చర్చలకు సిద్ధమని సంకేతాలిచ్చింది. ట్రంప్ తన ప్రకటనలో ఇరాన్ ప్రజల పట్ల తమకు ఎటువంటి వ్యతిరేకత లేదని, కేవలం అణు కార్యక్రమాలు, ప్రాంతీయ అస్థిరతపైనే తమ అభ్యంతరాలని స్పష్టం చేశారు. ఈ పరిణామం యుద్ధం ముగింపునకు తొలి మెట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


  • ప్రపంచ దేశాల హర్షం

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల వార్తలను జీ7 దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా స్వాగతించింది. యుద్ధం వల్ల తలెత్తిన మానవతా సంక్షోభం, ఇంధన కొరతకు ఈ చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని గల్ఫ్ దేశాలు ఆశిస్తున్నాయి. అయితే, ఈ చర్చల్లో ఇజ్రాయెల్ పాత్ర, ఇరాన్ విధించే షరతులు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, పశ్చిమాసియాలో దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది.



బాద్‌షా వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు


  • పాపులర్ ర్యాపర్ రిలేషన్‌షిప్ టైమ్‌లైన్ ఇదే

ముంబై: భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ ర్యాపర్ బాద్‌షా (Badshah) తాజాగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన రెండో వివాహం చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆయన గత వైవాహిక జీవితం , రిలేషన్‌షిప్ ప్రయాణంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బాద్‌షా మొదటి వివాహం 2012లో జాస్మిన్ మసీహ్ అనే యువతితో జరిగింది. వీరిద్దరికీ 2017లో 'జేసీ గ్రేస్ సింగ్' అనే కుమార్తె జన్మించింది. అయితే, పరస్పర విభేదాల కారణంగా 2019 నుండి వీరిద్దరూ విడిగా ఉంటున్నారని, కొవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో వారి మధ్య దూరం మరింత పెరిగిందని సమాచారం. చివరకు 2020లో వీరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం జాస్మిన్ తన కుమార్తెతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు.



విడాకుల తర్వాత బాద్‌షా జీవితంలోకి పంజాబీ నటి ఇషా రిఖీ ప్రవేశించారు. వీరిద్దరూ రెండేళ్లకు పైగా డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఒకరి కుటుంబ సభ్యులను మరొకరు కలుసుకోవడం, పార్టీలలో జంటగా కనిపించడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఇషా రిఖీతో సంబంధం ముగిసిందని, బాద్‌షా తన చిరకాల స్నేహితురాలు, పాకిస్థానీ నటి హానియా ఆమిర్‌తో సన్నిహితంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపించాయి. దుబాయ్‌లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేయడంతో వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, హానియా ఆమిర్ ఈ వార్తలను ఖండించి, తామిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు.


ఇక అసలు విషయానికి వస్తే, బాద్‌షా ఇటీవల ఇషా రిఖీ ని అత్యంత రహస్యంగా రెండో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్ ప్రారంభం నుండి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచే అలవాటున్న ఈ ర్యాపర్, తన రెండో పెళ్లి గురించి కూడా ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. కేవలం అతికొద్ది మంది సన్నిహితులు , కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు సమాచారం. తన పాటలతో మిలియన్ల మందిని ఉర్రూతలూగించే బాద్‌షా, తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించారని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Monday, 23 March 2026

పశ్చిమాసియా యుద్ధం ముగింపు లేని సుడిగుండం


  • ఇరాన్ సైనిక శక్తిపై తప్పుడు అంచనా
  • ట్రంప్ అల్టిమేటంల పర్యవసానమే ఈ సంక్షోభమా? 


న్యూఢిల్లీ/టెహ్రాన్, మార్చి 23 (UNI): పశ్చిమాసియాలో గత 23 రోజులుగా సాగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు ఒక డెడ్-ఎండ్ (ముగింపు లేని స్థితి)కి చేరుకుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అసలు సైనిక సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి ఈ యుద్ధం ఇంతలా ముదరడానికి ప్రధాన కారణాలని ఒక ప్రత్యేక విశ్లేషణలో వెల్లడైంది. కేవలం కొన్నిరోజుల్లోనే ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చని అమెరికా-ఇజ్రాయెల్ కూటమి భావించినప్పటికీ, ఇరాన్ అంచనాలకు మించి ప్రతిఘటిస్తుండటంతో యుద్ధం ఇప్పుడు అనిశ్చితిలో పడింది.



అధ్యక్షుడు ట్రంప్ విధించిన 48 గంటల గడువు నేటితో ముగియనుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ లోని పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలకు ప్రతిగా, ఇరాన్ తన డీప్-టెక్ , అధునాతన రాడార్ వ్యవస్థల ద్వారా అమెరికా క్షిపణులను అడ్డుకోగలమని నిరూపించింది. ఇరాన్ సైనిక శక్తి కేవలం సంఖ్యాబలంపైనే కాకుండా, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్లు , క్షిపణి వ్యవస్థలపై ఆధారపడి ఉందని, వీటిని తక్కువ అంచనా వేయడం వల్లనే అమెరికా కూటమి ఇప్పుడు ఇరకాటంలో పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పెట్టిన 6 కఠిన షరతులను అంగీకరించడమా లేక మరింత విధ్వంసానికి సిద్ధపడటమా అనే సందిగ్ధంలో శ్వేతసౌధం ఉంది.


మరోవైపు, హోర్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని గమనించకుండా ట్రంప్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చమురు ధరలను ఆకాశానికి చేర్చాయని విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ తన పాత వ్యూహాలను వదిలి, ఇప్పుడు సైబర్ యుద్ధం , అధునాతన రక్షణవ్యవస్థల ద్వారా ప్రతిదాడికి దిగుతోంది. ఈ వ్యూహాత్మక మార్పును గమనించడంలో వైఫల్యం చెందడం వల్లే యుద్ధం ఇప్పుడు ఒక పరిష్కారం లేని చిక్కుముడిగా మారింది. ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే కేవలం సైనిక చర్యలు సరిపోవని, ఇరు పక్షాలు దౌత్యపరమైన చర్చలకు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Friday, 20 March 2026

కువైట్ రిఫైనరీపై ఇరాన్ భీకర డ్రోన్ దాడి

 

 రంజాన్ పర్వదినాన మంటల్లో 'మినా అల్-అహ్మదీ'.. దుబాయ్, బహ్రెయిన్‌లలోనూ పేలుళ్ల మోత!

పశ్చిమాసియాలో ఇరాన్ తన దాడుల పరంపరను గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాల వైపు మళ్ళించింది. ఖతార్, సౌదీ అరేబియా తర్వాత ఇప్పుడు కువైట్‌లోని అత్యంత కీలకమైన చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. శుక్రవారం కువైట్ వ్యాప్తంగా రంజాన్ పండుగ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలోనే, ఆ దేశంలోని అతిపెద్ద రిఫైనరీల్లో ఒకటైన 'మినా అల్-అహ్మదీ' (Mina Al-Ahmadi) పై ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడింది. ఈ దాడితో రిఫైనరీలో భారీ ఎత్తున మంటలు చెలరేగగా, ఆకాశమంతా దట్టమైన పొగ కమ్మేసింది.



స్తంభించిన చమురు ఉత్పత్తి: రోజుకు సుమారు 7,30,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీపై వరుసగా రెండో రోజు కూడా దాడి జరగడం గమనార్హం. గురువారం జరిగిన దాడి తర్వాత కోలుకుంటున్న తరుణంలోనే, మళ్ళీ శుక్రవారం డ్రోన్లు విరుచుకుపడటంతో భారీ నష్టం వాటిల్లింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గల్ఫ్ ప్రాంతంలో చమురు సరఫరాను దెబ్బతీయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది.

దుబాయ్, బహ్రెయిన్‌లలో టెన్షన్: మరోవైపు పర్యాటక స్వర్గధామం దుబాయ్ నగరంపైకి కూడా ఇరాన్ డ్రోన్లు దూసుకువచ్చాయి. అయితే యూఏఈ (UAE) వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని సకాలంలో గుర్తించి గాలిలోనే కూల్చివేశాయి. ఈ క్రమంలో నగరం పొలిమేరల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటు బహ్రెయిన్ కూడా తమ దేశంపైకి దూసుకువచ్చిన ఒక క్షిపణిని అడ్డుకున్నట్లు ప్రకటించింది. ఆ క్షిపణి శకలాలు ఒక గిడ్డంగిపై పడటంతో అక్కడ అగ్నిప్రమాదం సంభవించింది.

భారత్‌పై ప్రభావం: కువైట్ మరియు దుబాయ్‌లలో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. రంజాన్ వంటి పవిత్ర పండుగ రోజున ఇలాంటి దాడులు జరగడం ప్రవాస భారతీయులను కలవరపెడుతోంది. ముఖ్యంగా కువైట్ రిఫైనరీపై దాడి వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగి, భారత్ వంటి దేశాల్లో పెట్రోల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తోంది.

పశ్చిమాసియా రణరంగం: మొజ్తాబా బతికే ఉన్నారన్న ఇరాన్

ఏప్రిల్ వరకు యుద్ధం కొనసాగితే 180 డాలర్లకు చమురు సెగ!

పశ్చిమాసియాలో యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ మృతి చెందారన్న వార్తలను కొట్టిపారేస్తూ ఆ దేశం ఒక వీడియోను విడుదల చేయగా, మరోవైపు ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు చమురు మరియు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో పెను మార్పులు సంభవిస్తున్నాయి.


  • 1. మొజ్తాబా క్షేమం.. వీడియో విడుదల చేసిన ఇరాన్

ఇరాన్ సుప్రీం నేతగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న సందిగ్ధతకు ఇరాన్ తెరదించింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, చనిపోయారని వస్తున్న వార్తలను తిప్పికొడుతూ.. ఆయన మతపరమైన బోధనలు చేస్తున్న వీడియోను అధికారిక మీడియా ఐఆర్‌ఐబీ (IRIB) ప్రసారం చేసింది. తన తండ్రి అలీ ఖమేనీ మరణం తర్వాత మొజ్తాబా బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. అయితే ఈ వీడియో ఎప్పటిదనే దానిపై స్పష్టత లేనప్పటికీ, ఆయన బతికే ఉన్నారని చెప్పడానికి ఇరాన్ దీనిని ఆధారంగా చూపుతోంది.


  • 2. 180 డాలర్లకు చమురు? సౌదీ ఆందోళన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు ఏప్రిల్ చివరి వరకు ఉంటే ముడి చమురు ధర బ్యారెల్‌కు 180 డాలర్లకు చేరవచ్చని సౌదీ అరేబియా హెచ్చరించింది. 70 డాలర్ల నుండి మొదలైన చమురు ధర ఇప్పటికే 119 డాలర్లకు చేరుకుంది. ఎర్ర సముద్రంలోని టెర్మినళ్లపై దాడులు జరిగితే రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ధరలు నియంత్రణ కోల్పోతాయని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఖతార్‌లోని 'రాస్ లఫ్పాన్' గ్యాస్ కేంద్రం పునరుద్ధరణకు నెలల సమయం పట్టేలా ఉండటంతో గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని తాకనున్నాయి.



  • 3. ఎరువులపై చైనా ఆంక్షలు.. భారత్‌కు ఇబ్బందులు

యుద్ధ ప్రభావంతో తన దేశీయ అవసరాలను కాపాడుకునేందుకు చైనా కీలక నిర్ణయం తీసుకుంది. జెట్ ఇంధనం, డీజిల్ మరియు ముఖ్యంగా యూరియా, నైట్రోజన్ ఎరువుల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల ఎగుమతిదారు అయిన చైనా నుండి సరఫరా నిలిచిపోవడం భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఎల్‌ఎన్‌జీ (LNG) కొరతతో భారత్‌లోని పలు యూరియా ప్లాంట్లు మూతపడే స్థితికి చేరుకున్నాయని సర్వేలు చెబుతున్నాయి.


  • 4. అమెరికా ఎఫ్-35 విమానాన్ని కూల్చేశాం: ఇరాన్

యుద్ధ విమానాల చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎఫ్-35 (F-35) యుద్ధ విమానాన్ని తమ క్షిపణి ఢీకొట్టిందని ఇరాన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ (IRGC) విడుదల చేసింది. సుమారు 769 కోట్ల రూపాయల విలువైన ఈ విమానం తీవ్రంగా దెబ్బతిని అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అమెరికా కూడా ధృవీకరించింది. అత్యధునాతన సాంకేతికత కలిగిన ఎఫ్-35 విమానం ఇలా క్షిపణి దాడికి గురికావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

రూపాయి రికార్డు పతనం


  • డాలర్‌తో పోలిస్తే 93 మార్కును దాటిన భారత కరెన్సీ
  • పశ్చిమాసియా యుద్ధమే ప్రధాన కారణం

భారత ఆర్థికవ్యవస్థకు మరో గట్టి షాక్ తగిలింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం , అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండుతుండటంతో భారత రూపాయి విలువ చరిత్రలోనే కనిష్టస్థాయికి పడిపోయింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మొదటిసారిగా 93 మార్కును దాటి 93.12 వద్దకు చేరుకుంది. గత బుధవారం 92.89 వద్ద ముగిసిన రూపాయి, గురువారం సెలవు తర్వాత మార్కెట్లు తెరుచుకోగానే భారీ పతనాన్ని చవిచూసింది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన డాలర్ వైపు మొగ్గు చూపడం, దేశీయ మార్కెట్ల నుండి విదేశీ పెట్టుబడులు (FPI) భారీగా తరలిపోవడం రూపాయిని కోలుకోలేని దెబ్బతీశాయి.



  • చమురు సెగ , విదేశీ పెట్టుబడుల తరలింపు

ముడి చమురు ధరలు నిన్న బ్యారెల్‌కు 119 డాలర్లకు చేరి, నేడు స్వల్పంగా తగ్గినప్పటికీ.. ఇంకా 106 డాలర్ల పైన ట్రేడవుతుండటం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెను భారంగా మారింది. ఈ మార్చి నెలలోనే విదేశీ మదుపరులు భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సుమారు 80,000 కోట్ల రూపాయలను (దాదాపు 8.5 బిలియన్ డాలర్లు) వెనక్కి తీసుకోవడం కరెన్సీ పతనానికి ఆజ్యం పోసింది. హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు, సరుకు రవాణాలో అంతరాయాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఆర్‌బీఐ (RBI) జోక్యం చేసుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రూపాయి పతనం ఆగడం లేదు.


  • సామాన్యుడిపై ధరల భారం

రూపాయి విలువ పడిపోవడం వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, చమురు, యంత్ర పరికరాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీసి, నిత్యావసర వస్తువుల ధరలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే, రూపాయి బలహీనపడినప్పటికీ, ఐటీ , ఫార్మా వంటి ఎగుమతి రంగాలకు ఇది కొంత మేర ప్రయోజనం చేకూరుస్తుంది. యుద్ధ ఉద్రిక్తతలు తగ్గి, చమురు ధరలు అదుపులోకి వస్తే తప్ప రూపాయి మళ్ళీ పుంజుకోవడం కష్టమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌





 హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అదించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.


బడ్జెట్‌ స్వరూపం

మొత్తం బడ్జెట్‌.. రూ.3,24,234 కోట్లు

రెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లు

మూలధన వ్యయం.. రూ.47,267 కోట్లు


బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు

జూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటన

ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతనం

రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన

వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు

విద్యుత్‌ శాఖకు రూ.21,285 కోట్లు

పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు

పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు

విద్యా శాఖకు రూ.26,674 కోట్లు

వైద్య శాఖకు రూ.13,679 కోట్లు

కార్మిక శాఖకు రూ.998 కోట్లు

మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు

పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు

ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు

ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు

బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు

మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు

కల్యాణ లక్ష్మీ పథకం.. రూ.3,683 కోట్లు

ఉపకార వేతనాలకు రూ.4,343 కోట్లు

యంగ్‌ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు

మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌.. రూ.1500 కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు

మెట్రో రైలు ఫేజ్‌-2.. రూ.600 కోట్లు

మహాలక్ష్మీ గ్యాస్‌ సబ్సిడీ పథకం.. రూ.723 కోట్లు

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ.. రూ.1143 కోట్లు

గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు

వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్‌.. రూ.3500 కోట్లు

మహాలక్ష్మీ పథకం.. రూ.4,305 కోట్లు

ఇందిరమ్మ ఇళ్లు.. రూ.5,500 కోట్లు

చేయూత పథకం.. రూ.14,861 కోట్లు

రైతు భరోసా.. రూ.18 వేల కోట్లు

ఆరు గ్యారంటీల అమలుకు.. రూ.50,713 కోట్లు


Thursday, 19 March 2026

హర్మూజ్ జలసంధి రక్షణకు అగ్రరాజ్యాల కవచం

  •  రంగంలోకి అమెరికా మిత్రదేశాలు.. 
  • నౌకల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా భారీ వ్యూహం

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి' రక్షణ కోసం ప్రపంచ దేశాలు ఏకమవుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ , కెనడా దేశాల అధినేతలు తాజాగా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సముద్ర మార్గంలో నౌకల రాకపోకలను అడ్డుకోవడం, క్షిపణి , డ్రోన్ దాడులకు దిగడం వంటి చర్యలను ఇరాన్ తక్షణమే నిలిపివేయాలని వారు హెచ్చరించారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛాయుత ప్రయాణాన్ని నిర్ధారించేందుకు తామంతా సమిష్టిగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని అగ్రరాజ్యాలు ప్రకటించాయి.



ముఖ్యంగా నాటో (NATO) సభ్య దేశాలు ఈ విషయంలో అమెరికాకు సహకరించడం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించిన నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. కేవలం జపాన్ మినహా మిగిలిన అన్ని దేశాలు నాటోలో సభ్యత్వం కలిగి ఉండటం విశేషం. చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలతో పాటు పౌర నౌకలపై దాడులు చేయడం అంతర్జాతీయ శాంతిభద్రతకు పెను ముప్పు అని ఈ దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు వాటా జరుగుతున్నందున, ఇక్కడ అంతరాయం కలిగితే ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.


అయితే, ఈ రక్షణ చర్యలు యుద్ధం కోసం కాదని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ కూటమి రంగంలోకి దిగడం వల్ల సముద్రపు దొంగతనాలు , క్షిపణి దాడుల భయం లేకుండా నౌకలు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ పరిణామం చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు కొంత ఊరట కలిగించే అంశం. పరిస్థితులు చక్కబడితే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రమంగా ఇంధన ధరలు స్థిరీకరించబడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.




ట్రంప్ మాటకు తలొగ్గిన నెతన్యాహు


  • ఇరాన్ గ్యాస్ నిక్షేపాలపై దాడులు నిలిపివేసిన ఇజ్రాయెల్ 
  • 119 డాలర్లకు చేరిన ముడి చమురు!

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య  కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు అత్యంత వ్యూహాత్మకమైన 'సౌత్ పార్స్' గ్యాస్ నిక్షేపాలపై దాడులు చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విన్నపాన్ని ఇజ్రాయెల్ మన్నించింది. ఇజ్రాయెల్ ప్రధాని  నెతన్యాహుతో మాట్లాడిన ట్రంప్, ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలం అవుతుందని హెచ్చరించారు. ట్రంప్ సూచన మేరకు ప్రస్తుతం ఆ గ్యాస్ ఫీల్డ్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తాము ఇప్పటికే గణనీయంగా దెబ్బతీశామని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ మాత్రం తన క్షిపణి ,డ్రోన్ దాడులతో ప్రాంతీయ దేశాలను వణికిస్తూనే ఉంది.



  • ఖతార్‌లో బీభత్సం - ఇరాన్ అధికారుల బహిష్కరణ

ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 'ఖతార్ ఎనర్జీ'కి చెందిన కీలకమైన ఎల్‌ఎన్‌జీ (LNG) మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఖతార్ ప్రభుత్వం, తమ దేశంలో ఉన్న ఇరాన్ సైనిక , భద్రతా అధికారులను 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ 'పర్సోనా నాన్ గ్రాటా' (అవాంఛనీయ వ్యక్తులు)గా ప్రకటించింది. గల్ఫ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఈ స్థాయిలో దెబ్బతినడం యుద్ధం మరింత విస్తరిస్తోందనే దానికి సంకేతంగా కనిపిస్తోంది.


  • భారత్‌పై ఇంధన సెగ

ఈ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై చావుదెబ్బ కొట్టింది. బ్రెంట్ ముడి చమురు ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 119 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుండి చమురు ధరలు ఏకంగా 60 శాతం పెరగడం గమనార్హం. హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడటం, సౌదీ రిఫైనరీలపై డ్రోన్ దాడులు జరగడం వంటివి సప్లై చైన్‌ను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. పెట్రోల్ , గ్యాస్ దిగుమతుల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద సవాలుగా మారింది. దేశీయంగా నిత్యావసరాల ధరలు పెరగడమే కాకుండా ఆర్థికవృద్ధిపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచానికి ఇరాన్ హెచ్చరిక


  • ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యంగా ఐఆర్‌జీసీ భీకర క్షిపణి దాడులు
  • చట్టవ్యవస్థల విచ్ఛిన్నం తప్పదన్న పీజీష్కియాన్


పశ్చిమాసియాలో యుద్ధం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ,ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ ఎత్తున క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అవీవ్‌తో పాటు మధ్య , దక్షిణ ఇజ్రాయెల్‌లోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని అల్ జజీరా వెల్లడించింది. ఇరాన్ భూభాగం నుంచి క్షిపణులు దూసుకువస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ధృవీకరించింది. వీటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తన గగనతల రక్షణ వ్యవస్థలను (Air Defence Systems) యాక్టివేట్ చేసింది. యుద్ధ విమానాలు, క్షిపణి విచ్ఛిన్నకారిణులు నిరంతరాయంగా పనిచేస్తుండటంతో యుద్ధ క్షేత్రం రణరంగంగా మారింది.



  • అప్రమత్తమైన పౌరులు - అత్యవసర ఆదేశాలు

దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం తన పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. హోమ్ ఫ్రంట్ కమాండ్ నేరుగా ప్రజల మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపుతూ, వెంటనే రక్షిత ప్రాంతాలకు (Bunkers) వెళ్లాలని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరూ బంకర్ల నుంచి బయటకు రావద్దని, క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా ప్రాణనష్టం నివారించవచ్చని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు నేరుగా క్షిపణి యుద్ధంగా మారడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నది.


  • ఇరాన్ అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పీజీష్కియాన్ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా దురాక్రమణ , తమ పూర్వ సుప్రీం లీడర్ హత్య వంటి చర్యలు అంతర్జాతీయ వివాదాల్లో ఒక ప్రమాదకరమైన ధోరణిని సృష్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇది ప్రపంచ చట్టవ్యవస్థలను పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "అంతర్జాతీయ సమాజం ఇప్పుడైనా ఈ సంక్షోభాన్ని అడ్డుకోవడానికి గట్టిగా నిలబడకపోతే, రేపు ఈ యుద్ధ జ్వాలలు అందరినీ చుట్టుముడతాయి" అని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అగ్రరాజ్యాల జోక్యం వల్ల పశ్చిమాసియాలో శాంతి మృగ్యమవుతోందని ఇరాన్ పునరుద్ఘాటించింది.

ప్రపంచ ఇంధన గుండెకాయపై ఇరాన్ దాడి


  • ఖతార్‌లోని 'రాస్ లఫాన్'పై క్షిపణుల వర్షం
  • భారత్‌లో గ్యాస్ కష్టాలు తప్పవా?

పశ్చిమాసియాలో యుద్ధం ఊహించని మలుపులు తిరుగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు (LNG) కేంద్రంగా పేరుగాంచిన ఖతార్‌లోని 'రాస్ లఫాన్' (Ras Laffan) పారిశ్రామిక నగరంపై ఇరాన్ భీకర దాడులకు దిగింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇరాన్ ఈ సాహసానికి పూనుకుంది. సుమారు 100కు పైగా డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో జరిగిన ఈ దాడిలో ఖతార్‌లోని కీలక గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతి టెర్మినల్స్ దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ పరిణామం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది.


  • భారత్‌పై పడనున్న పెను ప్రభావం

రాస్ లఫాన్ పై జరిగిన ఈ దాడి భారత్‌కు అత్యంత ఆందోళన కలిగించే అంశం. మన దేశం దిగుమతి చేసుకునే మొత్తం ఎల్‌ఎన్‌జీ (LNG)లో సుమారు 40 శాతానికి పైగా కేవలం ఖతార్ నుంచే వస్తుంది. ముఖ్యంగా 'పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ' వంటి భారతీయ సంస్థలు ఖతార్‌తో దీర్ఘకాలిక ఒప్పందాలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు అక్కడి ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతినడం వల్ల భారత్‌కు గ్యాస్ సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది దేశంలోని ఎరువుల కర్మాగారాలు, విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CNG/PNG) వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.



  • ఆర్థిక వ్యవస్థకు సవాలు

గ్యాస్ సరఫరా తగ్గితే దేశీయంగా విద్యుత్ మరియు వంటగ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో రూపాయి విలువ పడిపోతోంది, ఇప్పుడు గ్యాస్ సంక్షోభం కూడా తోడైతే భారత ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ భారం మరింత పెరుగుతుంది. యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి ఇప్పటికే ప్రమాదంలో ఉండగా, ఇప్పుడు నేరుగా సరఫరా కేంద్రాలనే లక్ష్యంగా చేసుకోవడం వల్ల భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా లేదా ఆఫ్రికా వంటి దేశాల వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు త్వరగా చక్కబడకపోతే సామాన్యుడిపై ధరల భారం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగ

  •  114 డాలర్లకు చేరిన ముడి చమురు
  • ఖతార్ గ్యాస్ కేంద్రాలపై దాడులతో ఐరోపాలో ధరలు 30 శాతంపైకి


పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం జరిగిన తాజా పరిణామాల్లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఖతార్‌కు చెందిన ఎల్‌ఎన్‌జీ (LNG) మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరగడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌కు 114 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.  సప్లై చైన్‌ దెబ్బతింటుందనే ఆందోళనల మధ్య ఇంధన ధరలు నిరంతరాయంగా పెరుగుతుండటం ప్రపంచదేశాల ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నది.



ముఖ్యంగా గ్యాస్ దిగుమతుల కోసం ఖతార్‌పై ఎక్కువగా ఆధారపడే ఐరోపా దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఖతార్ గ్యాస్ కేంద్రాలపై దాడుల వార్త వెలువడిన కొద్దిగంటల్లోనే ఐరోపాలో సహజ వాయువు ధరలు ఏకంగా 30 శాతం మేర పెరిగాయి. యుద్ధం కారణంగా ఇప్పటికే రష్యా నుంచి సరఫరా తగ్గడంతో ఇబ్బందులు పడుతున్న ఐరోపాకు, ఇప్పుడు ఖతార్ సంక్షోభం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. ఈ పరిణామాల వల్ల విద్యుత్ ఉత్పాదన, పారిశ్రామిక కార్యకలాపాల వ్యయం భారీగా పెరగనున్నది. యుద్ధ మేఘాలు తొలగి పరిస్థితులు చక్కబడకపోతే రానున్న రోజుల్లో ఇంధన కొరత మరింత తీవ్రమై ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాక్ స్వాతంత్య్రం అంటే విచ్చలవిడితనం కాదు


  • 'సర్కే చునారి' పాటపై నిషేధాన్ని సమర్థించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

సినిమా పాటల్లో పెరుగుతున్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇటీవల విడుదలైన 'సర్కే చునారి' (Sarke Chunariya) అనే పాటపై దేశవ్యాప్తంగా వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో, ఆ పాటను ప్రభుత్వం అధికారికంగా నిషేధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో స్పష్టం చేశారు. వాక్ స్వాతంత్య్రం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అయినప్పటికీ, అది సమాజం , సంస్కృతికి లోబడి ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదౌరియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. డిజిటల్ మాధ్యమాల ద్వారా చెడు ప్రభావం వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో, ముఖ్యంగా మహిళలు ,పిల్లల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.



  • రాజ్యాంగ పరిమితులకు లోబడే స్వేచ్ఛ

భారత రాజ్యాంగంలోని అధికరణ 19(2) ప్రకారం వాక్ స్వాతంత్య్రంపై కొన్ని 'సముచితమైన పరిమితులు'  ఉన్నాయని, వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ మర్యాదలు, నైతికత , ప్రజా శాంతికి విఘాతం కలిగించేలా ఎవరూ ప్రవర్తించకూడదని ఆయన హితవు పలికారు. 'కేడీ: ది డెవిల్' అనే సినిమాలోని ఈ పాటలో నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించగా.. ఇందులోని సాహిత్యం , దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, తీవ్రమైన అశ్లీలతతో నిండి ఉన్నాయని విమర్శలు వచ్చాయి. హర్యానా, కర్ణాటక మహిళా కమిషన్లతో పాటు కంగనా రనౌత్, రవి కిషన్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ పాటను తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సెన్సార్ బోర్డు (CBFC) ద్వారా ఇటువంటి కంటెంట్‌పై నియంత్రణను మరింత కఠినతరం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Monday, 16 March 2026

లోక్‌సభలో విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు ఎత్తివేత?

  • స్పీకర్ ఓం బిర్లా భేటీలో కీలక నిర్ణయం!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నుండి సస్పెండ్ అయిన ఎనిమిది మంది విపక్ష ఎంపీలకు ఊరట లభించే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వీరి సస్పెన్షన్ వేటును ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభలో ఈ సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.



గత ఫిబ్రవరి 3న సభలో అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు , ఒక సిపిఐ(ఎం) ఎంపీని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు (ఏప్రిల్ 2 వరకు) సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్‌కు గురైన వారిలో గుర్జీత్ సింగ్ ఔజ్లా, హిబీ ఈడెన్, సి. కిరణ్ కుమార్ రెడ్డి, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణికం ఠాగూర్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియకోస్ (కాంగ్రెస్) మరియు ఎస్. వెంకటేశన్ (సిపిఐ-ఎం) ఉన్నారు. అప్పటి నుండి వీరి సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు నిరంతరాయంగా డిమాండ్ చేస్తున్నాయి.


సభ సజావుగా సాగేందుకు గానూ స్పీకర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కొన్ని కీలక నిబంధనలపై ఉభయ పక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఇకపై సభ్యులెవరూ సభ మధ్యలోకి ) వెళ్లి నిరసన తెలపకూడదని, స్పీకర్ పోడియం వైపు పేపర్లు చింపి వేయకూడదని మరియు అధికారుల టేబుల్స్ ఎక్కకూడదని నిర్ణయించారు. అలాగే సభలో ప్లకార్డులు, పోస్టర్లు మరియు ఏఐ ద్వారా రూపొందించిన వివాదాస్పద చిత్రాలను ప్రదర్శించకూడదని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ గౌరవ మర్యాదలను కాపాడటమే తమ ప్రాధాన్యమని స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

హార్ముజ్‌ జలసంధి రక్షణలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలి

 

  • ట్రంప్ డిమాండ్‌ను సమర్థించిన వైట్ హౌస్!

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, వ్యూహాత్మకమైన హార్ముజ్‌ జలసంధి రక్షణ బాధ్యతను ఇతర దేశాలు కూడా పంచుకోవాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ను వైట్ హౌస్ గట్టిగా సమర్థించింది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ, ఇరాన్ నిరంకుశ పాలనను అదుపు చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల వల్ల ఇతర దేశాలు నేరుగా ప్రయోజనం పొందుతున్నాయని, కాబట్టి అక్కడ భద్రత కోసం అవి కూడా తమ వంతు సహాయం అందించడం సరైనదేనని పేర్కొన్నారు. కేవలం అమెరికా మాత్రమే కాకుండా, మొత్తం పాశ్చాత్య దేశాలన్నీ ఇంధన సరఫరా సజావుగా సాగాలని కోరుకుంటున్నాయని, ఇరాన్ ఉగ్రవాద చర్యల వల్ల అంతర్జాతీయ ఇంధన రవాణాకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె స్పష్టం చేశారు.



మరోవైపు, చైనా తన చమురు అవసరాల కోసం మిడిల్ ఈస్ట్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతున్నందున, హార్ముజ్‌ జలసంధిని తెరిపించడంలో ఆ దేశం కూడా సహకరించాలని ట్రంప్ ఆశిస్తున్నారు. మార్చి నెలాఖరులో బీజింగ్ పర్యటనకు వెళ్లే ముందే దీనిపై చైనా నుండి స్పష్టమైన సమాధానం కావాలని ఆయన ఆదివారం నాటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చైనా స్పందనను బట్టి తన పర్యటనను వాయిదా వేసే అవకాశం కూడా ఉందని ఆయన వెల్లడించారు. అయితే, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సుంకాలు మరియు ఇతర అంశాలపై ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో, ఈ పర్యటన రద్దు కావడం లేదా వాయిదా పడటం ఆర్థిక పరిణామాలకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.


అయితే, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ మాత్రం ఈ పర్యటన వాయిదా పడితే అది కేవలం 'లాజిస్టిక్స్' (సాంకేతిక కారణాల) వల్ల మాత్రమే జరుగుతుందని, హార్ముజ్‌ వివాదంతో దానికి సంబంధం లేదని ఇన్వెస్టర్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు వాషింగ్టన్ డి.సి.లో ఉండి సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడం ముఖ్యమని, ఇలాంటి సమయంలో విదేశీ పర్యటనలు అంత అనుకూలమైనవి కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పారిస్‌లో చైనా అధికారులతో వాణిజ్య చర్చలు జరుపుతున్న ఆయన, పర్యటనపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు.

బెంగాల్ ఎన్నికల సమరం


  • మమతా బెనర్జీపై నేరుగా తలపడనున్న సువేందు
  • నందిగ్రామ్, భవానీపూర్ రెండింటి నుంచీ పోటీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్న బీజేపీ, సోమవారం తన తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 144 స్థానాలతో కూడిన ఈ జాబితాలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ప్రతిపక్ష నేత సువేందు అధికారిని ఏకకాలంలో రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దింపడం. ఆయన తన సొంత గడ్డ అయిన నందిగ్రామ్‌తో పాటు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నుంచి కూడా పోటీ చేయనున్నారు. మమతా బెనర్జీని ఆమె కంచుకోటలోనే ఢీకొట్టడం ద్వారా బీజేపీ ఈ ఎన్నికలను 'మమత వర్సెస్ సువేందు' పోరాటంగా మార్చేసింది. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన సువేందు, ఈసారి ఆమె ఇలాకాలోనూ జెండా ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.



బీజేపీ తన తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూనే, సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇచ్చింది. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (ఖరగ్‌పూర్ సదర్), అగ్నిమిత్ర పాల్ (అసన్సోల్ సౌత్), చందనా బౌరి (సాల్తోరా) వంటి 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం కల్పించింది. మాజీ క్రికెటర్ అశోక్ దిండా (మొయినా), నటుడు రుద్రనీల్ ఘోష్ (శిబ్‌పూర్) వంటి ప్రముఖులు కూడా బరిలో ఉన్నారు. అయితే, ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచేయి ఎదురైంది. అభ్యర్థుల ఎంపికలో వృత్తిపరమైన వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ.. 57 మంది ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు , మాజీ సైనికోద్యోగులను ఎంపిక చేశారు. వయస్సు పరంగా కూడా 36 మంది 40 ఏళ్లలోపు యువకులకు, 11 మంది మహిళలకు చోటు కల్పించడం విశేషం. 'వందేమాతరం' రచయిత బంకిం చంద్ర ఛటర్జీ కుటుంబానికి చెందిన సౌమిత్ర ఛటర్జీని నైహతి నుంచి పోటీకి నిలబెట్టడం గమనార్హం.


మరోవైపు, ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో పెద్ద ఎత్తున పేర్ల తొలగింపు జరగడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంలో సుమారు 47,000 మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై టీఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 2011లో కేవలం 4 శాతం ఓట్లతో మొదలైన బీజేపీ, 2021 నాటికి 38 శాతానికి చేరుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇప్పుడు అన్నీ తానై నడిపిస్తున్న సువేందు అధికారిని రెండుచోట్ల పోటీకి నిలబెట్టడం ద్వారా, మమతా బెనర్జీని ఆమె నియోజకవర్గానికే పరిమితం చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ఈ పోలింగ్ ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

Sunday, 15 March 2026

సరదా కోసం మరో రెండు సార్లు కొడతాం


  • ఇరాన్ 'ఖార్గ్ ఐలాండ్'పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
  • ముదురుతున్న యుద్ధం!

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ముడి చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి 'ఖార్గ్ ఐలాండ్'పై ఇప్పటికే అమెరికా దళాలు భారీ దాడులు జరిపి అక్కడి సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయని ఆయన ప్రకటించారు. శనివారం జరిగిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, తమ దాడుల వల్ల ఖార్గ్ ఐలాండ్ ఇప్పటికే దాదాపు కుప్పకూలిపోయిందని, అవసరమైతే కేవలం "సరదా కోసం" (Just for fun) ఆ ద్వీపంపై మరిన్ని సార్లు దాడులు చేస్తామని అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.



ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ ద్వీపం ద్వారానే ఆ దేశం సుమారు 90 శాతం ముడి చమురును ఎగుమతి చేస్తుంది. అయితే, తాజా దాడుల్లో తాము కేవలం సైనిక స్థావరాలను, క్షిపణి గిడ్డంగులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, చమురు పైపులైన్లను ఉద్దేశపూర్వకంగానే వదిలేశామని ట్రంప్ స్పష్టం చేశారు. వాటిని మళ్ళీ నిర్మించాలంటే సంవత్సరాల సమయం పడుతుందన్న కారణంతోనే వాటిని తాకలేదని, కానీ ఇరాన్ గనుక హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకోవాలని చూస్తే ఆ చమురు కేంద్రాలను కూడా నేలమట్టం చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఇరాన్ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, వారు ప్రతిపాదించిన షరతులు తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన ఖరాఖండిగా చెప్పారు.


మరోవైపు, హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచే బాధ్యతను ఇతర దేశాలు కూడా పంచుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, బ్రిటన్ వంటి దేశాలు తమ యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి పంపి అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను కాపాడాలని, దీనికి అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరాన్  కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నారా లేదా అనే అంశంపై కూడా ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ, ఇరాన్ తక్షణమే లొంగిపోవాలని డిమాండ్ చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆసియా ఆర్థిక వ్యవస్థపై యుద్ధం సెగ


  • చమురు సరఫరా ఆగిపోతే కీలక రంగాల్లో కుదుపు తప్పదు.. 
  • మోర్గాన్ స్టాన్లీ నివేదికలో హెచ్చరిక!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం యుద్ధ రంగానికే పరిమితం కాకుండా, ఆసియా దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత్ సహా ఆసియాలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని కీలక రంగాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొంది. కేవలం ధరల పెరుగుదలే కాకుండా, చమురు ,సహజ వాయువు (LNG) సరఫరాలో ఏర్పడే అంతరాయాలు ఉత్పత్తి , ఎగుమతులపై తీవ్రమైన 'నాక్-ఆన్' (గొలుసుకట్టు) ప్రభావాలను చూపుతాయని విశ్లేషించింది.


ముఖ్యంగా భారత్, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా , తైవాన్ వంటి దేశాలు ఈ ఇంధన సంక్షోభం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే అది కేవలం ఇంధనానికే పరిమితం కాకుండా.. వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులు, ఆటోమొబైల్ , సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పెట్రో కెమికల్స్, హీలియం, సల్ఫర్ వంటి ముడి పదార్థాల లభ్యతను కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల వస్తువుల తయారీ వ్యయం పెరగడమే కాకుండా, వినియోగదారులపై కూడా భారం పడుతుందని మోర్గాన్ స్టాన్లీ వివరించింది.



సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే కొన్ని ఆసియా దేశాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. భారత్ ఇప్పటికే ఎల్ఎన్జీ రేషనింగ్‌ను ప్రారంభించగా, దక్షిణ కొరియా ఇంధన పన్నులను తగ్గించింది. థాయ్‌లాండ్ వంటి దేశాలు ఇంధన పొదుపు కోసం తమ ప్రభుత్వ ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని (Work from home) ఆదేశించాయి. యుద్ధం మరికొంత కాలం కొనసాగితే, ఇంధన ఎగుమతులపై ఆంక్షలు మరియు మరిన్ని రంగాల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. రాబోయే వారాల్లో అంతర్జాతీయ వాణిజ్య గణాంకాలను గమనిస్తే ఈ సంక్షోభ తీవ్రత ఎంతవరకు ఉంటుందో స్పష్టమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నెతన్యాహుపై హత్య వార్తలు వదంతులే


  •  AI వీడియోతో మొదలైన కుట్ర సిద్ధాంతం.. 
  • స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం!


దుబాయ్‌, మార్చి 15 :   ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్యామిన్ నెతన్యాహు హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఆయన కార్యాలయం తీవ్రంగా ఖండించింది. నెతన్యాహు క్షేమంగా ఉన్నారని, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అంతా పచ్చి అబద్ధమని (Fake News) ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒక విదేశీ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రధాని ఆరోగ్యంగా ఉన్నారని, విధుల్లో నిమగ్నమై ఉన్నారని స్పష్టం చేసింది.  కొన్నిరోజులుగా పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, నెతన్యాహు కనిపించడం లేదంటూ మొదలైన చర్చ చివరకు ఆయన హత్య వార్తల వరకు దారితీసింది.



ఈ వివాదానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ఒక వీడియో. అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై నెతన్యాహు ప్రసంగిస్తున్న ఈ వీడియోను 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఉపయోగించి సృష్టించినట్లు నెటిజన్లు ఆరోపించారు. ముఖ్యంగా వీడియోలో 0:35 నిమిషాల వద్ద నెతన్యాహు చేతి వేళ్లు అసాధారణంగా ఆరు ఉన్నట్లు కనిపిస్తున్నాయని, ఇది ఏఐ సాంకేతికతలో వచ్చే లోపమని (AI Glitch) కొందరు కుట్ర సిద్ధాంతాలను తెరపైకి తెచ్చారు. అమెరికన్ పొలిటికల్ కామెంటేటర్ క్యాండేస్ ఓవెన్స్ వంటి వారు కూడా "బిబీ ఎక్కడ ఉన్నాడు? ప్రధాని కార్యాలయం ఫేక్ వీడియోలు ఎందుకు విడుదల చేస్తోంది?" అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.


అయితే, ఈ ఆరోపణలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' (గతంలో ట్విట్టర్) కు చెందిన ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్' ఫ్యాక్ట్-చెక్ చేసి కొట్టిపారేసింది. నెతన్యాహుకు ఆరు వేళ్లు లేవని, వీడియోలోని నీడలు , కెమెరా యాంగిల్స్ వల్ల అలా భ్రమ కలిగిందని వివరించింది. ప్రభుత్వ అధికారిక రికార్డుల ప్రకారం ఆయనకు ఐదు వేళ్లే ఉన్నాయని, వీడియోలో కనిపిస్తున్నది కేవలం వెలుతురు ప్రభావమేనని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన తర్వాత ఈ ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో, మానసిక యుద్ధంలో భాగంగానే ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

సౌదీపై డ్రోన్ దాడులతో మాకు సంబంధం లేదు

 

  • ఐఆర్‌జీసీ స్పష్టీకరణ.. దాడుల మూలాలను వెతకాలని రియాద్‌కు సూచన!

దుబాయ్‌, మార్చి 15 :   సౌదీ అరేబియా రాజధాని రియాద్ ,తూర్పు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ డ్రోన్ దాడుల విషయంలో ఇరాన్ తన ప్రమేయాన్ని తోసిపుచ్చింది. ఇరాన్ అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ దాడులకు ఇరాన్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారం సౌదీ రక్షణ దళాలు తమ గగనతలంలో పది డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ నుండి ఈ వివరణ వెలువడింది. ఈ దాడులు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయో, వాటి వెనుక ఉన్న అసలు మూలాలను కనిపెట్టాలని సౌదీ ప్రభుత్వానికి ఐఆర్‌జీసీ సూచించింది.



ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో, ఇరాన్ పై నెపాన్ని నెట్టేందుకు శత్రు దేశాలు తమ డ్రోన్ల నమూనాలను (Cloned Drones) ఉపయోగిస్తున్నాయని ఇరాన్ సైనిక ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇరాన్  'షాహెద్-136' డ్రోన్ తరహాలోనే ఉండే 'లుకాస్' డ్రోన్లను ఉపయోగించి ఇరుగుపొరుగు దేశాలపై దాడులు చేస్తూ, ఇరాన్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందని వారు వాదించారు. ఈ రకమైన దాడుల వల్ల ఇరాన్, దాని పొరుగు దేశాల మధ్య అపనమ్మకం సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని ఐఆర్‌జీసీ ఆందోళన వ్యక్తం చేసింది.


మరోవైపు, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల అంతర్జాతీయంగా చమురు రవాణా , విమానయాన రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సౌదీ అరేబియా ఇప్పటికే తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సర్వసన్నద్ధం చేయగా, ఈ డ్రోన్ల అసలు మూలం యూఏఈ (UAE) కావచ్చని కొన్ని అనధికారిక వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాంతీయంగా మారుతున్న ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు యుద్ధాన్ని మరో కొత్త మలుపు తిప్పుతాయేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

Featured post

తెలంగాణ కుల గణన నివేదిక వెల్లడి

సగటు కంటే వెనుకబడిన 135 కులాలు జనరల్ కేటగిరీ కంటే ఎస్సీ, ఎస్టీలు మూడు రెట్లు వెనుకబాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర...