- ఇరాన్ నౌకపై అమెరికా దాడిపై రాహుల్ గాంధీ ఆగ్రహం
- మోడీ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టారని విమర్శ!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం భారత ముంగిటకే చేరుకున్నా ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండటంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీలంక సమీపంలోని భారత ప్రాంగణంలోనే ఇరాన్ యుద్ధనౌక 'IRIS దేనా'ను అమెరికా జలాంతర్గామి ముంచేసిన ఘటనపై స్పందిస్తూ, ప్రధాని మోడీ భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని (Strategic Autonomy) తాకట్టు పెట్టారని ఆరోపించారు. దేశానికి అత్యంత క్లిష్టమైన సమయంలో ఒక ధైర్యవంతుడైన నాయకుడు అవసరమని, కానీ ప్రస్తుత ప్రధాని మౌనం పాటించడం వల్ల అంతర్జాతీయస్థాయిలో భారత్ ప్రతిష్ట దెబ్బతింటోందని రాహుల్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. భారత ఆహ్వానం మేరకు విశాఖపట్నంలో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న నౌకపై మన ముంగిట దాడి జరిగితే ప్రధాని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచారకరమని ఆయన అన్నారు.
ఈ ఉద్రిక్తతల వల్ల భారత ఇంధన సరఫరా వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాహుల్ హెచ్చరించారు. భారత చమురు దిగుమతుల్లో 40 శాతానికి పైగా 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) ద్వారానే సాగుతాయని, ఎల్‌పిజి , ఎల్‌ఎన్‌జి సరఫరా పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచం ప్రస్తుతం అత్యంత అస్థిరమైన దశలోకి ప్రవేశించిందని, ఇటువంటి సమయంలో దేశ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రధాని మౌనంగా ఉండటం దారుణమని ఆయన పేర్కొన్నారు. కేవలం ఒక విదేశీ నౌకపై దాడి మాత్రమే కాదని, ఇది భారత సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని రాహుల్ అభిప్రాయపడ్డారు.
మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ వంటి మేధావుల వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. భారత ఆహ్వానంపై వచ్చిన అతిథి నౌకపై దాడి జరగడం మన దేశ సున్నితత్వాలను అమెరికా ఏమాత్రం గౌరవించకపోవడమేనని రాహుల్ మండిపడ్డారు. ఒక దేశాధినేతను (అలీ ఖమేనీ) హత్య చేయడాన్ని లేదా యుద్ధనౌకలపై ఇటువంటి దాడులను ప్రధాని సమర్థిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. అహింస , శాంతి మార్గమే సమస్యల పరిష్కారానికి మార్గమని, భారత్ తన విదేశీ విధానంలో నైతిక స్పష్టతను కలిగి ఉండాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. యుద్ధం మన ఇంటి గుమ్మం వరకు వచ్చినా స్పందించని ప్రధాని తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
No comments:
Post a Comment