- చీటీలపై ప్రశ్నలు రాసుకున్న నిందితులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేందుకు కొందరు ఎన్‌టీఏ నిపుణులు, మధ్యవర్తులు కలిసి ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా పనిచేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ప్రశ్నలను గుర్తుపెట్టుకోవడం, వాటిని చీటీలపై రాసుకోవడం, పుస్తకాల్లో సంబంధిత పేరాలను గుర్తించడం వంటి పద్ధతులను నిందితులు అనుసరించినట్లు పేర్కొంది.
దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ 94 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. నీట్ ప్రశ్నపత్రం తయారీ ప్రక్రియలో భాగమైన కెమిస్ట్రీ నిపుణుడు పీవీ కులకర్ణి, బోటనీ నిపుణురాలు మనీషా మాందరే, ఫిజిక్స్ నిపుణురాలు మనీషా హవల్దార్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ పేర్కొంది. అరెస్టయిన 13 మందిలో వీరు కూడా ఉన్నారు.
ఎన్‌టీఏ కేంద్రంలో ప్రశ్నల రూపకల్పన, అనువాదం జరుగుతున్న సమయంలో వివిధ విభాగాల్లోకి నిపుణులకు ప్రవేశం ఉండేదని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ తెలిపింది. ఈ సమయంలో వారు ప్రశ్నలను చీటీలపై రాసుకోవడం లేదా పుస్తకాల్లో సంబంధిత అంశాలను మార్క్ చేసుకునేవారని పేర్కొంది. అనంతరం తమ నెట్‌వర్క్‌లోని మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల ద్వారా ఆ సమాచారాన్ని విద్యార్థులకు చేరవేసినట్లు ఆరోపించింది.
డిజిటల్ పద్ధతులను ఉపయోగిస్తే తమ వ్యవహారం బయటపడే అవకాశం ఉండటంతో.. నిందితులు ఈ పాత పద్ధతిని ఎంచుకున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలతో పాటు కోచింగ్ సెంటర్ల విజయశాతాన్ని పెంచుకోవడమే ఈ కుట్ర వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు.
దర్యాప్తులో భాగంగా చేతిరాతతో ఉన్న పలు నోట్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో ఎన్‌టీఏ అనుసరిస్తున్న భద్రతా విధానాల్లోనూ లోపాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రశ్నపత్రాల తయారీకి వెళ్లే, అక్కడి నుంచి బయటకు వచ్చే నిపుణులను తనిఖీ చేసే వ్యవస్థ లేదని పేర్కొంది.
కులకర్ణి మూడు సెట్ల పరీక్షపత్రాల నుంచి మూడు రోజుల్లో 135 ప్రశ్నలను అనువదించినట్లు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రస్తావించింది. ఈ ప్రక్రియలో ప్రశ్నలకు నిపుణులకు సులభంగా పరిచయం ఏర్పడే అవకాశం ఉండటంతో లీకేజీకి మార్గం సుగమమైందని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
No comments:
Post a Comment