- ‘నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం’తో రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదన్న విదేశాంగ శాఖ..
- లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ విదేశీ పర్యటనలో కీలక మార్పు చోటుచేసుకుంది. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో సీఎం తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి ఆగస్టు 23న అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 20న లండన్ బయలుదేరి.. బ్రిటన్, అమెరికాల్లో 10 రోజుల పాటు పర్యటించి ఆగస్టు 30న హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ పర్యటనలో ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలను తెలంగాణకు ఆకర్షించడం, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
- అమెరికా పర్యటనకు రాజకీయ క్లియరెన్స్ నిరాకరణ
అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. పర్యటనకు ‘రాజకీయ కోణంలో క్లియరెన్స్ నిరాకరించబడింది’ అని విదేశాంగ శాఖ పేర్కొన్నట్లు సీఎంవో తెలిపింది. బ్రిటన్, అమెరికా పర్యటనలకు కేంద్రం నుంచి అనుమతి కోరగా.. బ్రిటన్ పర్యటనకు మాత్రమే అనుమతి లభించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే అధికారిక ప్రతినిధి బృందం ఇప్పటికే బ్రిటన్‌కు చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని తెలిపింది.
కేంద్ర నిర్ణయంతో తాను తీవ్రంగా నిరాశ చెందినప్పటికీ, దాన్ని గౌరవిస్తూ లండన్ నుంచే భారత్‌కు తిరిగి రావాలని సీఎం నిర్ణయించుకున్నారని సీఎంవో పేర్కొంది.‘ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యం’ అమెరికా పర్యటన ఉద్దేశం పూర్తిగా విద్యారంగానికి సంబంధించినదేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను భారత్‌కు, ముఖ్యంగా తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడమే తన పర్యటన లక్ష్యమని చెప్పారు. కేంద్ర నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసి యువతకు అత్యుత్తమ విద్య, నైపుణ్యాలు, శిక్షణ అందించాలన్నదే ఉద్దేశమని వివరించారు.దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తాను ఎప్పటి నుంచో విశ్వసిస్తున్నానని సీఎం అన్నారు.
- అమెరికా కార్యక్రమాలు అధికారులతో పూర్తి చేయించనున్న సీఎం
తాను అమెరికా వెళ్లకపోయినా.. అక్కడి ప్రతిపాదిత పర్యటనను అధికారులు కొనసాగించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిపాదిత అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని సూచించారు.మరోవైపు బ్రిటన్‌లో ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమాలను సీఎం కొనసాగించనున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు.హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు నగరానికి గొప్ప మానవ వనరులను అందించాయని గుర్తుచేశారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా వంటి ప్రముఖులు ఎదిగారని సీఎం ప్రస్తావించారు. ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి సంస్థలు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు ఆకర్షితమయ్యాయని తెలిపారు.హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, ఎంఐటీ, ఎల్‌బీఎస్, ఎల్‌ఎస్‌ఈ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో చదివే అవకాశాన్ని భారతీయులకు హైదరాబాద్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన సంకల్పమని రేవంత్‌రెడ్డి చెప్పారు.
- అనుమతి నిరాకరణలో రాజకీయ కోణం లేదు
అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంలో రాజకీయ కోణం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు అన్నారు. విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చే సమయంలో విదేశాంగ శాఖ అనేక అంశాలను పరిశీలిస్తుందని తెలిపారు.పర్యటన అవసరం, ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, అంతర్జాతీయ ప్రోటోకాల్, దౌత్యపరమైన అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు.గతంలో 2012లో యూపీఏ ప్రభుత్వం అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనలకు అనుమతి నిరాకరించిన విషయాన్ని రామచందర్‌రావు గుర్తుచేశారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్ నేతలు లేఖలు రాశారని ఆరోపించారు.రేవంత్‌రెడ్డి గతంలో విదేశీ పర్యటనలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ప్రస్తుత నిర్ణయం నిబంధనల ప్రకారమే తీసుకున్నదని ఆయన అన్నారు.
- అమెరికాలో షెడ్యూల్‌లో కీలక కార్యక్రమాలు
అమెరికా పర్యటనలో భాగంగా ఆగస్టు 24న హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ క్యాంపస్‌లను సందర్శించాలని రేవంత్‌రెడ్డి తొలుత నిర్ణయించారు. ఆగస్టు 25న బోస్టన్‌లోని వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశం కావాల్సి ఉంది. ఆగస్టు 26న న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. ఆగస్టు 30న హైదరాబాద్‌కు తిరిగి రావాల్సిన షెడ్యూల్ ఉంది.అయితే కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంతో ఈ కార్యక్రమాలను సీఎం స్వయంగా హాజరుకాకుండానే అధికారుల ద్వారా కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
No comments:
Post a Comment