Showing posts with label 2024 national elections. Show all posts
Showing posts with label 2024 national elections. Show all posts

Friday, 12 May 2023

కాంగ్రెస్‌కే పట్టం కట్టిన కన్నడ ప్రజలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు:


-మోడీ మానియా పనిచేయలేదు

-బజరంగ్‌దళ్‌ నినాదం నిలబెట్టలేదు

-భావోద్వేగాలు ఓట్లు రాల్చలేదు

-ఉచితాలు దేశాభివృద్ధికి నిరోధకాలన్న మోడీ కర్ణాటకలో అనేక ఉచిత హామీలు ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు

-తొమ్మిదేళ్ల కేంద్ర ప్రభుత్వ, మూడేళ్లకు పైగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సాధించిన ప్రగతిని చెప్పలేని పరిస్థితి  

-ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది.

-


అందుకే కమలం పార్టీని కాదని కాంగ్రెస్‌కే పట్టం కట్టిన కన్నడ ప్రజలు 

Wednesday, 25 January 2023

బీఆర్‌ఎస్‌తో ఏ కూటమికి మేలు, ఏ కూటమికి ముప్పు



ఖమ్మం జి


ల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు ముగ్గురు సీఎంలు కేజ్రీవాల్‌, పినరయ్‌ విజయ్‌, భగవంత్‌ మాన్‌ లతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ జాతీయ నేత డి. రాజా హాజరయ్యారు. అయితే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటమి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంలను కలిశారు. వారిలో తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, బీహార్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ తదితరులతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. వీళ్లలో చాలామంది కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 


కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. దాన్ని ఆ పార్టీ ఖండించలేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా జేడీఎస్‌ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పా బీఆర్‌ఎస్‌, జేడీఎస్‌ పోటీ చేయడం దాదాపుగా ఖాయం. ఇక ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభలో వేదిక పంచుకున్ననేతలంతా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవాళ్లే, కొట్లాడుతున్నవాళ్లే. అలాగే వీళ్లు ఎప్పుడూ అటు ఎన్డీఏలోనూ, బీజేపీతోనూ భాగస్వాములుగా లేరు.  బీహార్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ కలిసే ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ ప్రభుత్వాల్లో కాంగ్రెస్‌ భాగస్వామి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లు కాంగ్రెస్‌ను కాదని కేసీఆర్‌తో కలిసి వచ్చే అవకాశాలు తక్కువ. కాకపోతే ఉద్యమకాలం నుంచి తెలంగాణకు మద్దతుగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంఐఎం తమ అలయెన్స్‌ అని కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. ఇది రాష్ట్రం వరకే పరిమితం. జాతీయస్థాయిలో రేపు బీఆర్‌ఎస్‌ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే ఆ పార్టీని కూడా కలుపుకుని వెళ్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవేళ ఎంఐఎంను కలుపుకుంటే అది అంతిమంగా బీజేపీకి లబ్ధి జరుగుతుందనే అబిప్రాయం ఉండనే ఉన్నది. 


ఈసారి కేంద్రంలో కిసాన్‌ ప్రభుత్వం రావాలి అంటున్న కేసీఆర్‌ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి కూడా గత రెండు ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఈసారి తగ్గే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణతో సహా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాల ప్రభావం కచ్చితంగా వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉంటుది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోబీఆర్‌ఎస్‌ వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేయవచ్చు. ఈ కూటమి 30-40 సీట్లు దక్కించుకుంటే రేపు అటు యూపీఏకు గాని, ఎన్డీఏకు గాని పూర్తి మెజారిటీ రాకపోతే ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. వైసీపీ, బీజూజనతాదళ్‌ లాంటి పార్టీలు కూడా ప్రస్తుతం తటస్థంగానే ఉన్నాయి. ఈ పార్టీలకు వచ్చే సీట్లు కూడా కీలకంగా మారుతాయి. 

అలాగే కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ప్రయోగం అంతిమంగా బీజేపీకి మేలు చేయడానికే అనే వాదనలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీనే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ వైఖరి మారవచ్చు, కాంగ్రెస్‌ అధిష్ఠానం అభిప్రాయం మారవచ్చు.  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కదా!

Sunday, 22 January 2023

బీఆర్‌ఎస్‌ సభపై నితీశ్‌ ఆసక్తికర మాటలు అందుకేనా?


బీఆర్‌ఎస్‌ ఆవిర్బావ సభపై బీహార్‌ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ యేతర పక్షాలతో కలిసి సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం గురించి తనకు సమాచారం లేదని, తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ అందినా వెళ్లేవాడిని కాదన్నారు. సావధాన్‌ యాత్ర.  రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలలతో  పాటు ఇతర కార్యక్రమాలు ఉన్నందున తాను హాజరుకాలేదని దానికి కారణం చెప్పారు. అట్లనే స్వప్రయోజనాలు ఏమీ కోరుకోవడం లేదు, జాతీ ప్రయోజనాల కోసం విపక్ష నేతలంతా ఏకతాటిపైకి వచ్చి సాగితే చూడాలని ఉన్నది, తెలంగాణలో అది జరిగింది. అయితే బీఆర్‌ఎస్‌కు సంబంధించిన సభ మాత్రమే. కొత్త కూటమి ఏర్పాటు కోసం నిర్వహించిన సభగా దీన్ని చూడకూడదన్నారు. 


బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా విపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలని కోరుకుంటూ..నితీశ్‌ ఈ దిశగా సోనియాగాంధీ, మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులతో ఆ మధ్య భేటీ అయ్యారు. యూపీఏ, ఎన్డీఏ కూటములకు దూరంగా తటస్థంగా ఉంటున్నవారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఆ కూటమికి తాను ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నారు. బీహార్‌ సీఎంగా మరోసారి కొనసాగే ఆలోచన ఆయనకు లేదు. ఎందుకంటే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ ప్రకటించాక దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఎన్డీఏ కూటమిని నుంచి జేడీయూ వైదొలిగింది. అనంతరం బీహార్‌లో ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జతకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత  ఆర్జేడీతో విభేదాలతో తిరిగి కాషాయ పార్టీతో జట్టు కట్టి తిరిగి అధికారంలోకి వచ్చారు. మళ్లీ బీజేపీకి బైబై చెప్పి తిరిగి ఆర్జేడీ, కాంగ్రెస్‌ తో కలిసిపోయారు. ప్రస్తుతం ఆ కూటమి తరఫున సీఎంగా కొనసాగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలో వెళ్తామన్నారు. అంటే పరోక్షంగా తాను జాతీయ రాజకీయాలకు వెళ్తాను అన్న సిగ్నల్స్‌ ఇచ్చారు. అందుకు అనుగుణంగా బీజేపీ కూటమికి వ్యతిరేకంగా  విపక్ష నేతలను ఐక్యం చేసే పని పెట్టుకున్నారు. అది ప్రక్రియ ప్రస్తుతం ఆగిపోయింది. ఈలోగా కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ రాజకీయాలపై మాట్లాడుతుండటం, కాంగ్రెస్‌, బీజేపీ యేతర సీఎంలతో పాటు ప్రాంతీయ పార్టీల అధినేతలతో సంప్రదింపులు చేశారు. 


బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ సీఎంలతో పాటు వామపక్ష జాతీయ నేతలను ఆహ్వానించి బల ప్రదర్శన చేశారు. ఈ వేదిక నుంచే ఆయన బీజేపీపై, ప్రధాని మోడీపై తీవ్రమైన విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ యేతర కిసాన్‌ ప్రభుత్వం రావాలని కోరారు. అయితే కాంగ్రెస్‌ లేకుండా మరో కూటమి సాధ్యం కాదని శివసేన, ఎన్సీపీ, జేడీయూ, ఆర్జేడీ లాంటి పార్టీలు మొదటి నుంచి స్పష్టంగా చెబుతున్నాయి. అలాగే కాంగ్రెస్‌తో కలిసి బీహార్‌లో అధికారంలో ఉన్న నితీశ్‌  బీఆర్‌ఎస్‌ సభకు రాలేడని, ఒకవేళ ఆయన వస్తే అది వేరే సంకేతానికి దారి తీస్తుందని కేసీఆర్‌కు తెలియదా? అందుకే ఆయన కాంగ్రెస్‌, బీజేపీ యేతర పార్టీలతోనే ముందుకు వెళ్లాలని బావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ సభను భవిష్యత్తు మార్పునకు సంకేతమని ఆ సభకు వచ్చిన నేతలంతా అన్నారు. కానీ నితీశ్‌ మాత్రం దీన్నిఅంగీకరించలేపోతున్నారు. నితీశ్‌  జాతీయస్థాయిలో తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్‌తో వెళ్లడం మినహా మరో మార్గం లేదు. దీన్ని బీఆర్‌ఎస్‌ సభగా మాత్రమే చూడాలని, కొత్త కూటమి ఏర్పాటు కోసం నిర్వహించిన సభగా చూడకూదని అందుకే అన్నారు.

Saturday, 18 September 2021

మార్పు పంజాబ్ లో మొదలై

మొన్నటిదాకా సీఎం లను మార్చుతూ బీజేపీ వార్తల్లో నిలిచింది. పంజాబ్ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. ఆ రాష్ట్రానికి కొత్త సీఎం రానున్నారు.

పంజాబ్‌లో రాజకీయాలు కొంత కాలంగా అనేక పరిణామాల అనంతరం ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేసేదాకా వచ్చింది. మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానం పై ఒత్తిడి చేస్తున్నారు. అధిష్ఠానం రాజీనామా చేయాలని అమరీందర్‌కు సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న  నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది.


రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో విసిగిపోయానని, కాబట్టి పదవిలో కొనసాగలేనని సోనియాగాంధీకి  కెప్టెన్ వివరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే రాజీనామా సమర్పించారు. అయితే రాజీనామా అనంతరం మీడియా మాట్లాడిన కెప్టెన్‌ అమరిందర్ సింగ్ దీన్ని అవమానంగా భావిస్తున్నానని అన్నారు. తన మద్దతుదారులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాను  అన్నారు. అయితే కొంతకాలంగా కెప్టెన్, సిద్ధూ ల మధ్య నెలకొన్న విభేదాలు తారా స్థాయికి చేరాయి. వచ్చే ఏడాది ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ ఇప్పటికే మొదలు పెట్టింది. అందుకే కెప్టెన్ వ్యతిరేకించినప్పటికి సిద్దూని నియమించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలను కాంగ్రెస్ అధిష్ఠానం ఆచరణలో పెట్టినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసే రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తిరిగి పవర్ ను నిలబెట్టుకోవడం, భాగస్వామ్య పక్షాలు బలంగా ఉన్నచోట ఆయాపార్టీలకు మద్దతు ఇచ్చి బీజేపీని నిలువరించడం వంటి ప్రణాళికలను వ్యూహాత్మక అమలుచేస్తున్నది. జార్ఖండ్ లో ఇదే చేసింది. మహారాష్ట్ర లో ఎన్నికల తర్వాత కొత్త కూటమిలో కాంగ్రెస్ పార్టీనే కీలకం. ఛత్తీస్ గఢ్ లో సీఎం మార్పు పై ఆ పార్టీలో నెలకొన్న విభేదాలకు కూడా త్వరలో ముగింపు ఉండొచ్చు. రాజస్తాన్ లో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. పంజాబ్


 లో ప్రస్తుత మార్పు అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టే భావించాలి.


Tuesday, 14 September 2021

సార్వత్రిక ఎన్నికల సన్నద్ధానికే


ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఇప్పుడు కమలనాథులు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. గడిచిన ఆరు నెలల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది. పార్టీలో నెలకొన్న అన్నిరకాల సమస్యలను పరిష్కరించుకొని  వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సన్నద్ధం కావాలన్నది మోదీ,షా ల వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులతో పాటు నలుగురు సీఎం మార్పుల ఇందులో భాగం అంటున్నారు. 


ముఖ్యమంత్రులపై అసంతృప్తి వ్యక్తమైతే వెంటనే గుర్తించాలి. దాన్ని పరిష్కరించాలనే సూత్రాన్ని బీజేపీ అమలు చేస్తున్నది. బీజేపీ అధినాయకత్వం 2017 ఎన్నికలకు 16 నెలల ముందు అప్పటి సీఎం ఆనందీబెన్‌తో రాజీనామా చేయించి విజయ్ రూపాణీకి కుర్చీ కట్టబెట్టింది. ఎన్నికలు 15 నెలల్లో ఉన్నాయనగా రూపాణీని దించి పాటీదార్ వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌ను తెరపైకి తెచ్చింది. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఎన్నికైన నాటి నుంచి రెండున్నర దశాబ్దాలుగా అక్కడ బీజేపీ అధికారంలో కొనసాగుతున్నది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నది. అలాగే కోవిడ్ కట్టడిలో రూపాణీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దీంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో సరిగ్గా పనిచేయకపోవడం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లో ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఆప్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది.ఆమ్ ఆద్మీ పార్టీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తన బలాన్ని పెంచుకుంటున్నది. అలాగే రాష్ట్రంలో నిర్ణాయత్మక శక్తిగా 12 శాతం ఉన్న పాటీదార్లు కొంతకాలంగా ముఖ్యమంత్రి పదవి తమ సామాజికవర్గానికి ఇవ్వాలంటూ డిమాండు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరైన నాయకత్వం లేని స్థితి వంటి అంశాలను తమకు లాభిస్తాయి అని, మళ్లీ గుజరాత్ కాషాయ జెండాను ఎగురవేయాలన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచన. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌తో దీర్ఘకాల అనుబంధం ఉన్న భూపేంద్ర పటేల్‌ను సీఎం సీటులో కూర్చొబెట్టింది. మృదు స్వభావి, గుజరాత్‌లో బూత్ మేనేజ్‌మెంట్ పితామహుడిగా పేరున్న భూపేంద్ర నేతృత్వంలో మళ్లీ గెలువవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ అధినాయకత్వంలో ఉండి ఉంటుంది. అందుకే విజయ్ రూపాణీ రాజీనామా తర్వాత రకరకాల పేర్లు తెరమీదికి వచ్చాయి. కానీ ఊహాగానాల జాబితాలో కూడా లేని పేరు భూపేంద్ర పటేల్‌ను ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ప్రస్తుతం బీజేపీ రూటు మార్చింది. కొత్తవారినే సీఎం కుర్చీలో కూర్చొబెడుతున్నది. తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్ ను గుజరాత్ లో,  ఉత్తరాఖండ్‌లో పుష్కర్‌సింగ్ ధామీని నియమించింది. ఆరు నెలల్లో మార్చిన నలుగురు సీఎంలు పార్టీని విజయపథంలో నడిపించలేరని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైనట్టు సమాచారం. ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్‌తో మొదలైన మార్పులో ఆయన స్థానంలో తీరథ్ సింగ్ రావత్‌ను నియమించినా నాలుగు నెలలు కూడా ఆయన కొనసాగలేదు. అలాగే కర్ణాటకలో యడ్యూరప్పపై పార్టీలో నెలకొన్న అసంతృప్తితో ఆయన సామాజికవర్గం పార్టీకి దూరం కాకుడదని ఆయన అనుచరుడైన బసవ బొమ్మైకి బాధ్యతలు అప్పగించారు. 


ముఖ్యమంత్రుల మార్పుపై బీజేపీలో అంతర్గత కలహాలే కారణమని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది. కానీ వారి పార్టీలో ఉన్న విభేదాలను పరిష్కరించుకోకుండా పక్కవారిపై విమర్శలు చేసినంత మాత్రానా ప్రజాదరణ ఉండదని ఆ పార్టీ నేతలు గుర్తించాలి. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాల మధ్య తలెత్తిన విభేదాల ఫలితమే అక్కడ అధికారాన్ని కోల్పోయింది. రాజస్థాన్‌లోనూ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య పోరు నడుస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌లో   అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయి.  సీఎం భూపేశ్ బఘేల్, ఆరోగ్యమంత్రి టీఎస్​ సింగ్ దేవ్​ మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కారం కాక అనిశ్చితి కొనసాగుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కొబోతున్న పంజాబ్‌లోనూ సీఎం అమరిందర్, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పంజాబ్, గుజరాత్ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాల వైఫల్యాల ఫలితంగా ఆప్ అక్కడ బలపడుతున్నది. ఢిల్లీలో అధికారంలో ఉన్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నదని ఇటీవల ఆ పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాల బట్టి స్పష్టం అవుతున్నది.

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...