న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: మారుతున్న సాంకేతికత, అనూహ్యత, భౌగోళిక సమీపతతో తలెత్తుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతదేశ సన్నద్ధతలో భౌగోళిక-వ్యూహాత్మక ఆలోచన, అనూహ్య పరిస్థితుల కోసం ముందస్తు ప్రణాళికలు అంతర్భాగంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. సంక్షోభం దేశ ద్వారం తట్టేలోపే సన్నద్ధత సంక్షోభ స్థాయికి చేరుకోవాలన్నదే దేశ లక్ష్యమని పేర్కొన్నారు.
దేశ ఇంధన సరఫరా మార్గాలు, జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో భారత నౌకాదళ వృత్తిపరమైన నైపుణ్యం, కార్యాచరణ సన్నద్ధతను కొనసాగుతున్న ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ మరోసారి చాటిచెప్పిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ తొలి స్పందనదారు, ప్రాధాన్య భద్రతా భాగస్వామి, విశ్వసనీయతకు ప్రతీకగా స్థిరంగా నిలుస్తోందని, తద్వారా దేశ ‘మహాసాగర్’ దార్శనికత మరింత బలోపేతమవుతోందని తెలిపారు.
దక్షిణ చైనా సముద్రం, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలో భారత యుద్ధనౌకల ఉనికి.. దేశ నీలి జల నౌకాదళ సామర్థ్యాన్ని చాటుతోందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. అధిక స్థాయి యుద్ధ సన్నద్ధతను కొనసాగిస్తున్న భారత నౌకాదళాన్ని ఆయన అభినందించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని నెరవేర్చడంలో నౌకాదళం వ్యూహాత్మక ఆధారంగా వ్యవహరిస్తోందని అన్నారు. సముద్రాల్లో జాతీయ జెండాను ప్రదర్శించడమే భారత సముద్ర శక్తి లక్ష్యం కాదని, ఎక్కడ త్రివర్ణ పతాకం కనిపించినా అక్కడ భద్రత, విశ్వాసం, నమ్మకాన్ని ప్రతిబింబించేలా చేయడమే లక్ష్యమని చెప్పారు.
యుద్ధ సన్నద్ధమైన, విశ్వసనీయ, సమన్వయంతో కూడిన, భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే బలగాన్ని తీర్చిదిద్దేందుకు కృత్రిమ మేధ, బిగ్ డేటా, స్వయంచాలక, మానవ రహిత వ్యవస్థలు, సైబర్ కార్యకలాపాలు, లాజిస్టిక్స్, శిక్షణ, సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. సమన్వయం, స్వయం సమృద్ధి, ఆవిష్కరణ సూత్రాల ఆధారంగా ఈ అంశాలపై చర్చలు జరిగాయి.