Tuesday, 1 September 2026

ఎన్ని అడ్డంకులొచ్చినా నల్గొండ వెళ్తా



  • తెలంగాణలో పోలీసుల తీరుపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఆగ్రహం


హైదరాబాద్: నల్గొండ పర్యటనకు వెళ్లకుండా పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి నిరాశ, అసహనం పెరిగిపోవడంతోనే బీజేపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్‌ నాయకులు బీజేపీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని రామచందర్‌రావు అన్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసి గోడలు, గేటుపై నల్లరంగు పూసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారని, ఈ ఘటనలో ఆయన తల్లి కూడా గాయపడ్డారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుండటాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని రామచందర్‌రావు విమర్శించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే బీజేపీ కూడా ప్రతిఘటిస్తుందని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై జరిగిన దాడిలో గాయపడిన ఆయన తల్లిని పరామర్శించేందుకు నేడు నల్గొండ వెళ్లాల్సి ఉందని చెప్పారు. అయితే పోలీసులు తనను అదుపులోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు. ఉదయం నుంచే తనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, మూడు రోజుల్లో ఇది తనకు రెండోసారి హౌస్ అరెస్ట్ అని పేర్కొన్నారు. “ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నల్గొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది” అని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

Featured post

డేటా సెంటర్ల హబ్‌గా భారత్

200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధ్యం – పీయూష్ గోయల్  7.8 శాతం వృద్ధి సాధించడంపై ప్రధాని మోడీ నాయకత్వానికి, ప్రజలకు అభినందనలు న్యూఢిల్లీ: డే...