Showing posts with label #StrayDogMenace #TelanganaNews #AnimalCruelty #Jagtial #HyderabadNews #PanchayatElections #JusticeForAnimals #TelanganaPolice. Show all posts
Showing posts with label #StrayDogMenace #TelanganaNews #AnimalCruelty #Jagtial #HyderabadNews #PanchayatElections #JusticeForAnimals #TelanganaPolice. Show all posts

Saturday, 24 January 2026

తెలంగాణలో కుక్కల మారణకాండ


  • ఇప్పటివరకు 900 వీధి కుక్కల హత్య
  • సర్పంచ్‌లపై కేసులు నమోదు!

తెలంగాణలో వీధి కుక్కల స్వైరవిహారాన్ని అరికట్టే పేరుతో జరుగుతున్న ఘాతుకాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 900 వీధి కుక్కలను దారుణంగా చంపేశారని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో, వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కలిగిస్తామని ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా సర్పంచ్‌లు ఈ అమానుషానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో సుమారు 300 కుక్కలను చంపేయడంతో ఈ మారణకాండ తీవ్రత వెలుగులోకి వచ్చింది.



జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామంలో జనవరి 22న విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి సుమారు 300 కుక్కలను చంపేశారని వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దారుణానికి గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయితీ కార్యదర్శి బాధ్యులని, వారు కొందరిని అద్దెకు తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు వారిద్దరిపై బీఎన్ఎస్ , జంతు హింస నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణలో భాగంగా గొయ్యి తీసి చూడగా, సుమారు 70 నుంచి 80 కుక్కల కళేబరాలు బయటపడ్డాయి. ఇవి మూడు నాలుగు రోజుల కిందటే పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.


కేవలం జగిత్యాల జిల్లాలోనే కాకుండా, ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. జనవరి 19న యాచారం గ్రామంలో 100 కుక్కలకు విషం పెట్టి చంపగా, అందులో 50 కళేబరాలు లభ్యమయ్యాయి. అంతకుముందు హనుమకొండ జిల్లా శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో 300 కుక్కల హత్యకు సంబంధించి ఇద్దరు మహిళా సర్పంచ్‌లు, వారి భర్తలతో సహా తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో కూడా సుమారు 200 కుక్కలను చంపిన ఆరోపణలపై ఐదుగురు సర్పంచ్‌లపై కేసులు నమోద య్యాయి. ఇలా ఎన్నికల హామీల నెపంతో మూగజీవాలను బలితీసుకోవడంపై జంతు హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...